Home క్వారంటైన్‌ కొత్త మార్గదర్శకాలు ..!

 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసుల్లో ఢిల్లీ దేశంలో రెండో స్థానంలో ఉంది. ఓ వైపు కేసుల సంఖ్యలో పెరుగదల.. మరోవైపు బెడ్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హోం క్వారంటైన్‌కు సంబంధించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. దాని ప్రకారం ఇక మీదట ఎవరికైనా  రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ ద్వారా కరోనా పాజిటివ్‌గా తేలితే.. వారు సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యుడిని కలవాలి. 

ఆ రిపోర్టులు చూసిన తర్వాత వైరస్‌ తీవ్రతను బట్టి సదరు వ్యక్తికి హోం క్వారంటైన్‌ సరిపోతుందా.. లేక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కి వెళ్లాలా అనే విషయాన్ని అక్కడి ప్రభుత్వ వైద్యుడు నిర్ణయిస్తారని కేజ్రీవాల్‌ ప్రభుత్వం తెలిపింది. సదరు వ్యక్తిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఏవి లేకుండా.. కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉంటే అతడు/ ఆమెకి హోం క్వారంటైన్‌ను సూచిస్తారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వారిని ఆస్పత్రికి లేదా కరోనా కేర్‌ సెంటర్‌కి తరలిస్తారు

అలానే కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న వారిని హోం క్వారంటైన్‌కు సిఫారసు చేసే ముందు ఓ ప్రత్యేక బృందం వారి ఇంటిని పరిశీలిస్తుంది. ఇంట్లో రెండు గదులు.. ప్రత్యేక బాత్రూములు ఉంటే ఆ ఇల్లు హోం క్వారంటైన్‌కు సరిపోతుందని సూచిస్తారు. లేదంటే వారిని కరోనా కేర్‌ సెంటర్‌కు పంపిస్తారు. హోం క్వారంటైన్‌లో ఉన్న కేసులను ప్రత్యేక బృందం తొమ్మిది రోజుల పాటు పర్యవేక్షిస్తుంది. ప్రతి రోజు ఫోన్‌ చేసి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటుంది. పది రోజుల తర్వాత వారిని డిశ్చార్జ్‌ చేస్తారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘రోగులు హోం క్వారంటైన్‌కు వెళ్లే ముందు పరీక్షా కేంద్రంలో వైద్య అధికారి వారికి పల్స్ ఆక్సిమీటర్లను అందిస్తారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కొలవడానికి ఈ ఆక్సిమీటర్ సహాయపడుతుంది. కాబట్టి రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రాకముందే ఆక్సిజన్‌ను అభ్యర్థించవచ్చు’ అని తెలిపారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad