2021 మార్చికి భారత్‌‌లో 6కోట్ల కరోనా కేసులు, IISC స్టడీ

దేశంలో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులు పెంచుతున్న కొద్దీ కేసుల సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగనుందా? ఏకంగా 6 కోట్ల మంది కొవిడ్ బారిన పడతారా? అంటే అవుననే అంటోంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ సైన్సెస్ (ఐఐఎస్‌సీ).
మార్చికి 6.18 కోట్ల కరోనా కేసులు:
వచ్చే ఏడాది అంటే 2021 మార్చి నాటికి వైరస్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ సైన్సెస్ (ఐఐఎస్‌సీ) ఓ రిపోర్ట్‌ను రూపొందించింది. ఆ రిపోర్టు ప్రకారం వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటే వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్​లో 6 కోట్ల 18లక్షల మందికి కరోనా వైరస్​ సోకే అవకాశం ఉందని ఐఐఎస్సీ వెల్లడించింది. అదే ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఈ సంఖ్యను 37.4 లక్షలకే పరిమితం చేయొచ్చంది. 2020 మార్చి 23 నుంచి జూన్ 18 వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల డేటా, ట్రెండ్స్‌ను పరిశీలించి ఐఐఎస్‌సీ ఈ లెక్కలు వేసింది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులను బట్టి చూస్తే ఈ లెక్కలు కాస్త మారొచ్చు.

సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో కరోనా సెకండ్ వేవ్:
దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌‌లో రావొచ్చని ఐఐఎస్‌సీ హెచ్చరించింది. ఈ మోడల్ ప్రకారం కొత్త వైరస్ ఇన్ఫెక్షన్స్‌ను తగ్గించడానికి వారంలో రెండు రోజులు లాక్‌డౌన్ విధించాలంది. మిగతా రోజుల్లో మనిషికి మనిషి మధ్య దూరం ఉండేలా చూసుకోవడం వల్ల కొత్త కేసుల నమోదు తీవ్రతను గణనీయంగా తగ్గించొచ్చని ఐఐఎస్​సీ తెలిపింది. దేశంలో కోవిడ్​ రికవరి రేటు పెరగడం వెనుక మెడికల్​ కేర్​, క్వారంటైన్​ పాత్ర ప్రముఖంగా ఉందని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి అప్పటివరకు వైరస్ వ్యాప్తిని ఆపడానికి కాంట్రాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, సోషల్ డిస్టెన్సింగ్ చాలా కీలకమని సూచించింది. కాగా, భారత్ లో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. ఈ మహమ్మారి బారిన పడి 24వేల 915 మంది చనిపోయారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. వాటి తర్వాత మూడో స్థానంలో భారత్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad