పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు - కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ


ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒక జిల్లా

మంత్రివర్గ సమావేశంలో సీఎం స్పష్టీకరణ

 అమరావతి: ప్రతి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలో మార్పులకు అవకాశం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రానికి అసెంబ్లీ నియోజకవర్గాలు దూరమవుతాయని, అందువల్ల అలాంటి వాటి పరిధిని మార్చాలనే చర్చ వచ్చింది. ఈ సందర్భంగా సీఎం స్పష్టమైన విధానాన్ని వివరించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.  


► ‘ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడితే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. అప్పుడే జిల్లాలు బాగుపడతాయి. కలెక్టర్లు బాగా పరిపాలన చేయగలుగుతారు. ఒక్కో జిల్లాలో 15, 17, 19 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఏ విధంగా న్యాయం చేయగలగుతాం?’ అని సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది.  

► అరకు లోక్‌సభ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉందని, దాని పరిధిని ఒక జిల్లాగా నిర్ణయిస్తే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఈ విషయమై సీఎం స్పందిస్తూ.. ‘అంతగా అయితే అరకు లోక్‌సభా పరిధిని రెండు జిల్లాలుగా చేద్దాం.. అప్పుడు 25 జిల్లాలకు అదనంగా మరొకటి పెరిగితే పెరుగుతుంది.. మిగతా చోట్ల మార్పులకు అవకాశం లేదు’ అని చెప్పినట్లు సమాచారం.  

► కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లా కేంద్రానికి దూరమవుతాయని కొందరు అభిప్రాయపడగా, అలాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి తన లాంటి వారికి అవకాశం ఇవ్వండని పేర్ని నాని అనడంతో.. ‘అంతే.. మరి’ అని ముఖ్యమంత్రి బదులిచ్చినట్లు తెలిసింది.  

కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది. సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కమిటీని ఆదేశించారు.

పార్లమెంట్‌ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 25 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. 4 జిల్లాలకు అరకు జిల్లా ప్రాంతం విస్తరించి ఉందని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad