ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నిలువరించే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా?
అని వేయికళ్లతో ఎదురచూస్తున్నారు. అయితే, కేవలం వ్యాక్సిన్ వచ్చే వరకూ చేతులు
కట్టుకుని కూర్చోవద్దని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా రక్కసి విలయతాండం కొనసాగుతున్న వేళ మరోసారి దేశాధినేతలకు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్
కోసం వేచిచూడొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా
వ్యాక్సిన్ కోసం తీవ్రమైన కృషి జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ప్రజల ప్రాణాలను
కాపాడటమే మన తక్షణ కర్తవ్యమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ జనరల్ టెడ్రోస్
అధ్నామ్ గాబ్రియోసస్ స్పష్టం చేశారు.
జెనీవాలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘ఎటువంటి తప్పులకు ఆస్కారం
ఇవ్వొద్దని, వ్యాక్సిన్ పరిశోధనను మరింత వేగవంతం చేయాలి. ఇదే సమయంలో ప్రస్తుతం
మనకు అందుబాటులో ఉన్న సాధనాలతో విస్తృతంగా కట్టడి చేయాలి’ అని టెడ్రోస్
పునరుద్ఘాటించారు. గడచిన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఒక్క మిలియన్ పాజిటివ్
కేసులు నమోదుకావడం వైరస్ తీవ్రతకు అద్దంపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలను డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్
జనరల్ స్వాగతించారు. కాంటాక్ట్ ట్రేసింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించి,
అవసరమైనన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ పంపిణీ చేసే
కచ్చితమైన విధానం లేదని డబ్ల్యూహెచ్‌ఓ మైక్ రేయాన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్
వచ్చాక సరఫరా సమస్యలు ఏర్పడే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ముఖ్యంగా పేదలు,
ఆర్ధిక స్థోమతలేని వారికి వ్యాక్సిన్ పంపిణీ సక్రమంగా జరగాలంటే నాయకులకు రాజకీయ
నిబద్ధతే ఏకైక మార్గమని అన్నారు. ప్రజల భాగస్వామ్యం, బలమైన నాయకత్వం, సమగ్ర
వ్యూహంతో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించవచ్చని రేయాన్ ఉద్ఘాటించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆందోళన కలిగించే విధానాలను కూడా రేయాన్
ప్రస్తావించారు. ‘వ్యాక్సిన్ విషయంలో కొన్ని దేశాలు మరొక దిశలో
ప్రయాణిస్తున్నాయని, ప్రపంచ ప్రజా ప్రయోజనం గురించి ఏకాభిప్రాయం లేనప్పుడు,
ధనికులే దానిని స్వంతం చేసుకుంటారు.. పేదలకు అందకపోవచ్చు. ఇప్పటికే పలు
దేశాధినేతలు టీకా లేదా చికిత్సా విధానం ప్రపంచ ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా
ఉండాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు’ అని అన్నారు.