G.O.645 Dr. N.Ramesh Kumar, IAS(Retd.,) - Restoring the position of State Election Commissioner


నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. ఈ పేరు ఏపీ రాజకీయ వ్యవహారాల్లో నిత్యం వినబడుతూనే ఉంది. రమేశ్ కుమార్ ఏపీ ఎన్నికల కమిషనర్‌గా మొదట నియామకం అయిన దగ్గరి నుంచి ఇప్పటిదాకా ప్రతి విషయంలోనూ రాజకీయం రంజుగా నడిచింది. ఎన్నికల కమిషనర్‌గా నియమించడంపై ప్రభుత్వం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఈలోపే ఎన్నో వాదోపవాదాలు.. చర్చలు.. అయినా ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్ కుమార్ నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ ఆర్డినెన్సును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌నే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.

మొదట ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్కడ సుప్రీం కోర్టు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ప్రతి విషయం మాకు తెలుసంటూ ఘాటుగానే స్పందించింది. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీఈసీగా రమేశ్ కుమార్‌ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ కావడం గమనార్హం.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad