కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని... అది ఇతర కరోనా రోగులకు ప్రాణదానం చేసినట్టు అవుతుందని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈ ప్లాస్మా థెరపీతో మరణాల శాతం పెద్దగా తగ్గే అవకాశం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు.
ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా కరోనా మరణాలు తగ్గించే అంశంలో పెద్దగా ప్రయోజనం లేదని ఢిల్లీలోని ఎయిమ్స్ అభిప్రాయపడింది. ఎయిమ్స్‌లో జరిపిన ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయిల్స్‌లో ఈ విషయం వెల్లడైందని తెలిపింది.
ఎయిమ్స్‌లో 30 మంది కరోనా పేషెంట్లపై చేపట్టిన ట్రయల్స్‌లో ప్లాస్మా థెరపీ ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చనే స్పష్టత రాలేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. బుధవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ క్లినికల్ గ్రాండ్ రౌండ్స్ సదస్సులో ప్లాస్మా థెరపీ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఈ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ట్రయల్స్ భాగంగా కరోనా పేషెంట్లను రెండు బృందాలుగా విభజించి వారిలో ఒక బృందానిక రెగ్యూలర్ చికిత్స, మరో బృందానికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించినట్టు ఆయన తెలిపారు. అయితే రెండు బృందాల్లోనూ మరణాల శాతం సమానంగా ఉందని వెల్లడించారు.
అయితే ఇది కేవలం మధ్యంతర విశ్లేషణ మాత్రమే అని దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని గులేరియా చెప్పారు.
క్లినికల్ మేనేజ్’మెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం విషమంగా ఉన్న కరోనా బాధితులకు మాత్రమే ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించాలి. ఈ మేరకు కేంద్రం ఆరోగ్యశాఖ గతంలోనే స్పష్టత ఇచ్చింది.