త్వరలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్...అంతా ఆన్‌లైన్‌లోనే...
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దస్త్రానికి ఆమోదం లభించగానే షెడ్యూల్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
బదిలీల ప్రక్రియకు జిల్లా విద్యాధికారులు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు నుంచి పాఠశాల కేటాయింపు వరకు మొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు.
ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేసే అవకాశం ఉంది
బదిలీకి దరఖాస్తు చేసినప్పటి నుంచి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు 35 రోజుల వరకు సమయం పడుతుంది.వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నందున తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు, హేతుబద్ధీకరణలో పాఠశాల మారాల్సి వచ్చేవారు ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకూ ఆప్షన్లు ఇవ్వాలి. ఆన్‌లైన్ కావడంతో కొన్ని పాఠశాలలనే ఎంపిక చేసుకుంటే సీనియారిటీలో ఆ స్కూల్లో పోస్టింగ్ రాకపోతే ఎక్కడో ఒక చోటుకు బదిలీ అవుతుంది. ఎక్కువ పాఠశాలలను ఎంపిక చేసుకోవడం తమకు ఇబ్బందికరమని కొందరు ఉపాధ్యాయులు అంటున్నారు
ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కారణంగా స్పౌస్ కోటా కింద బదిలీ కోరుకునే వారికి వారు కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్ దొరుకుతుందనే దానిపై స్పష్టత లేదు.
పాయింట్లు ఇలా.
పనిచేసే పాఠశాలల కేటగిరీల వారీగా పాయింట్లు ఇస్తారు. ఒకటో కేటగిరీకి ఒకటి, రెండో కేటగిరీకి రెండు, మూడో కేటగిరీకి మూడు, నాలుగో కేటగిరీకి ఐదు పాయింట్ల చొప్పున ఇస్తారు.
ఉపాధ్యాయుల సర్వీసుకు ఏడాదికి 0.5 పాయింట్లు ఇస్తారు. ఏడాదికి ఒక పాయింటు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
స్పౌస్‌కు ఐదు పాయింట్లు ఇస్తారు.