చికెన్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు.. కొత్త టెన్షన్

China: చికెన్‌లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలడం ఆందోళనకు గురి చేస్తోంది. బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన కోడి మాంసంలో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు చైనా తెలిపింది


కోడి మాంసంలో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. అది కూడా కరోనా మహమ్మారి పుట్టిన చైనా దేశంలోనే. దీంతో కొత్త ఆందోళన మొదలైంది. అంతేకాదు, కరోనా ఆనవాళ్లు కనిపించిన ఆ చికెన్ బ్రెజిల్ నుంచి రవాణా అయింది. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం. బ్రెజిల్ నుంచి రవాణా అయిన చికెన్‌లో కరోనా వైర‌స్‌ కనిపించిందని చైనా బుధవారం పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో రాశారు. సముద్రాల మీదుగా దిగుమతి అవుతున్న మాంసం నుంచి శాంపిళ్లు సేకరించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా చేసిన పరీక్షల్లో ఓ చికెన్ శాంపిల్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈ వారం ఈక్వెడార్ నుంచి వచ్చిన ఎండ్రకాయలు, చేపలకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్ నగరానికి బ్రెజిల్ నుంచి దిగుమతైన చికెన్ వింగ్స్‌లో కరోనా వైరస్ గుర్తించారు. అంతకుముందు ఈక్వెడార్ నుంచి షాంజీ ప్రావెన్స్‌లోని జియాన్ నగరానికి దిగుమతి అయిన రొయ్యల పార్శిల్‌లోనూ కరోనా వైరస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్రెజిల్‌ సహా మరికొన్ని దేశాల నుంచి మాంసం దిగుమతులను చైనా జూన్‌లోనే నిలిపివేసింది.

బ్రెజిల్, ఈక్వెడార్ తదితర దేశాల నుంచి చైనాకు మాంసం ఉత్పత్తులు, చేపలు, ఎండ్రకాయలు భారీగా దిగుమతి అవుతున్నాయి. అయితే.. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్‌లో చికెన్‌తో పాటు రవాణా చేసిన ఇతర ఆహార ఉత్పత్తుల నమూనాలు కూడా పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్‌గా వచ్చినట్లు చైనా పేర్కొంది.

చికెన్‌లో కరోనా ఆనవాళ్లు కనిపించడంపై చైనా.. బ్రెజిల్‌ను నిలదీసింది. అయితే.. బ్రెజిల్ ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

కరోనా వ్యాప్తి మొదలైన తొలి రోజుల్లో చికెన్ నుంచి కూడా వైరస్ వ్యాపిస్తుందని ప్రచారం జరిగింది. జనం చికెన్ కొనుగోలు చేయడం మానేశారు. దీంతో కోడి మాంసం ధరలు పతనమయ్యాయి. కోడి మాంసం నుంచి కరోనా వ్యాపించదని.. పైగా చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం చేయడంతో చికెన్ కొనుగోళ్లు క్రమంగా పెరిగాయి. తాజాగా కోడి మాంసంలో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించాయనే వార్త అలజడి రేపుతోంది.

మాంసం మార్కెట్ల నుంచి కరోనా వ్యాప్తి..

కరోనా వైరస్‌ వుహాన్‌‌లోని మార్కెట్‌ నుంచి వ్యాపించిన విషయం తెలిసిందే. ఇక్కడి సీఫుడ్ మార్కెట్ నుంచి తొలిసారిగా ఈ వైరస్ వ్యాపించిందని భావిస్తున్నారు. ఈ మార్కెట్లో గబ్బిలాలు, పాములు, కుక్కలు.. కాదేదీ అనర్హం అన్నట్లు పలు రకాల జంతువుల మాంసం అమ్ముతారు. వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చిన తర్వాత ఈ మార్కెట్‌ను మళ్లీ ప్రారంభించారు. తాజాగా చికెన్‌లో కరోనా ఆనవాళ్లు బయటపడిన మార్కెట్ కూడా సీఫుడ్‌కు సంబంధించినదే కావడం గమనార్హం. చైనా రాజధాని బీజింగ్‌లోనూ ఓ మాంసం మార్కెట్ కేంద్రంగా కరోనా వైరస్ విజృంభించింది.

బీజింగ్‌లోని షిన్ఫాడీ సీఫుడ్ మార్కెట్లోనూ వైరస్ వ్యాప్తి కేసులు ఎక్కువగా ఉన్నాయి. నాటి నుంచి చైనా అధికారులు అన్ని రకాల ఆహార ఉత్పత్తుల నమూనాలను సేకరించి కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. తాజా ఘటన అనంతరం సీ ఫుడ్, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార పదార్థాలను తినే విషయంలో జాగ్రత్త వహించాలని చైనా ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad