ఈ కొత్త విద్యా విధానంలో ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయి. 2035 నాటికి ఉన్నత విద్యలో నమోదును 50శాతానికి పెంచనున్నట్లుగా, ఉన్నత విద్యా సంస్థలలో అదనంగా 3.5 కోట్ల సీట్లు వచ్చి చేరనున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వ రంగంలోని ఉన్నత విద్యాసంస్థలను బలోపేతం చేయడం, కొత్త విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం వంటి చర్యల ప్రస్తావన లేకుండా ఇదెలా సాధ్యం? ప్రభుత్వం సాధ్యమే అంటోంది. ఎలాగంటే పూర్తిస్థాయి ప్రైవేటీకరణ. గ్లోబల్ స్థాయిలో ప్రైవేటీకరణ. దీనికి ప్రభుత్వం పెట్టిన ముద్దుపేరు ఇంటర్ నేషనలైజేషన్.
కొత్తజాతీయ విద్యావిధానం -2020 నేపథ్యంలో ఈ విధానంలో ప్రస్తా వించిన అంశాలకు సంబంధించి వాక్యానికి, వాక్యానికి మధ్యనున్న నిగూఢ అర్థాన్ని; వాక్యానికి ఆవల ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని నిశితంగా పరిశీలించవలసి ఉంది. లేదంటే ప్రభుత్వ ప్రచారార్భాట వెల్లువలో, మీడియా వంధిమాగదుల హోరులో అసలు విషయం కొట్టుకుపోయే అవకాశం ఉంది. మన విద్యారంగంలో ప్రధాన సమస్యలకు మూలం నిధుల కొరత, పాలకుల చిత్తశుద్ధి కొరవడటం. ఎన్నోఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించాలని కోరడం, ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడం పరిపాటయ్యింది. విద్యపై ఖర్చును జీడీపీలో 6 శాతా నికి (ప్రస్తుతం 0.44శాతం) చేర్చడానికి కేంద్ర రాష్ట్రాలు ఉమ్మడిగా పనిచేస్తాయని కొత్త విద్యా విధానంలో ఒక ప్రకటన ఉంది. ఇక్కడొక తిరకాసు వుంది. జీడీపీలో శాతం అంటే అంబానీ, ఆదానీ, దమానీ వంటి గుప్పెడు కార్పొరేట్ల, ఇంకా అసంఖ్యాక ఆమ్ ఆద్మీల ఇద్దరి ఆదాయాలను కలిపి భాగించే తలసరి ఆదాయం లాంటిది. విద్యపై వెచ్చించే జీడీపీలో కూడా ప్రభుత్వ ఖర్చు, ప్రైవేటు ఖర్చు రెండూ కలిపి ఉంటాయి. విద్యలో చాలా కాలంగా ప్రభుత్వ ఖర్చు తగ్గుతూ, ప్రైవేటు ఖర్చు పెరిగిపోవడం జరుగుతోంది. దీనికి కారణం ప్రజలకు విద్యనందించే బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకుంటూ ప్రైవేటీకరణను ప్రోత్సహించడం. ఇప్పటికే పాఠశాల విద్యలో 50శాతం పైగా, ఉన్నత విద్యలో దాదాపు 70 శాతం ప్రైవేటు రంగంలోకి పోయింది. ఈ పరిస్థితిలో కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులగురించి సూటిగా చెప్పకుండా డొంకతిరుగుడులో జీడీపీ ఖర్చు గురించి చెప్పడమంటే మరింత ప్రైవేటీకరణ వరద ద్వారాలను తెరవడమని అర్థం కాదా!
ఈ విధానంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అంశం ప్రస్తుతమున్న 10+2 స్కీమ్ స్థానంలో కొత్తగా తెచ్చే 5+3+3+4 స్కీమ్. స్కీమ్ మార్పుతోనే అంతా అమాంతం మారుతుందన్నట్లు భ్రమ కలిగించే ప్రయత్నం కనిపిస్తోంది. ఈ కొత్త స్కీములో మూడేళ్ళ పూర్వ ప్రాథమిక విద్యతో కలుపుకొని ప్రాథమిక-సెకండరీ విద్య, ఇంటర్మీడియట్ విద్య మొత్తం కలిపి పాఠశాల విద్యగా మార బోతుంది. పూర్వ ప్రాథమిక విద్య అవసరాన్ని ప్రభుత్వం గుర్తించడం మంచి విషయమే అయినా, దీన్ని అంగన్వాడీలకు అప్పగించడం వల్ల ఒనగూడే ప్రయోజనం అంతంత మాత్రమే. అంగన్వాడీలలో పనిచేస్తున్న ఆయాలకు డిజిటల్, డిస్టెన్స్, డీటీహెచ్ పద్ధతుల్లో ఆరు నెలల శిక్షణ ఇచ్చి, ఉపాధ్యాయులుగా మారుస్తామని చెప్పడమంటే పూర్వ ప్రాథమిక విద్యను హాస్యాస్పదంగా మార్చడమే.
అలాగే ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులు, అవసరమైనంతమంది ఉపాధ్యాయులులేక పదేళ్ళుగా పాఠశాల విద్య నిర్వహణే ఎంతో ప్రయా సతో కూడి ఉండగా, ఇంటర్మీడియట్‌ను తెచ్చి అందులో కలపడం వల్ల ఏమౌతుంది? ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు మూతపడి, ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్ విద్య విస్తరిస్తుంది. స్కీమ్ ఏదైనా ప్రాథమిక స్థాయిలో ప్రతి తరగతికి ఒక గది, ఒక ఉపాధ్యాయుడు, 1:30 నిష్పత్తి, సెకండరీ స్థాయిలో సబ్జెక్టు టీచర్స్, పటిష్ట పర్యవేక్షణ లేకుండా చేసే ప్రతి వాగ్దానం నీటి మీద రాతే. చాలమందిని గందరగోళానికి గురిచేసే మరొక అంశం 6వ తరగతి నుండి ఒకేషనల్ విద్యను ప్రవేశపెట్టడం. పాఠశాల విద్య ద్వారా విద్యార్థిలో ప్రకృతి, సమాజం గురించిన మౌలిక జ్ఞానాన్ని, భాషా నైపుణ్యాలను, సాహిత్య అభిరుచిని నేర్పాలి, వ్యక్తిత్వ నిర్మాణానికి పునాదులు వేయాలి. శారీరక- మానసిక ఆరోగ్యానికి వ్యాయామం, ఆటలలో పాల్గొనేటట్లు చేయాలి. అంతేగాని వృత్తులు, నైపుణ్యాలు నేర్పడంకాదు. పాఠశాల విద్య అనంతరం ఉన్న ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సుల్లో ఎన్ని వృత్తులు, నైపుణ్యాలు నేర్పినా ఎవరికీ అభ్యంతరముండదు. అయితే పాఠశాల స్థాయిలో ఒకేషనల్ విద్యను చేరిస్తే, ఫార్మల్ అకడమిక్ విద్య దెబ్బతింటుంది. పిల్లలు రెంటికీ చెడ్డ రేవడి అవుతారు. బహుశా ఒకేషనల్ కోర్సుల నిర్వహణను ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే, కాంట్రాక్టర్లు మాత్రమే లబ్ధిపొందుతారు.
ఈ విధానంలో మాతృభాషలో లేదా స్థానిక భాషలో కనీసం 5వ తరగతి వరకు విద్యాబోధన ఉండాలని పేర్కొన్నప్పటికీ, దీన్ని ప్రైవేటు పాఠశాలల్లో కూడా కచ్చితంగా అమలుచేయాలని చెప్పలేదు. అలాగే సంస్కృతానికి సింహాసనంవేసి, ఇంగ్లీషును బిజినెస్ కమ్యూనికేషన్‌కు మాత్రమే పరిమితం చేయడం వలన సంభవించే నష్టం పూరించలేనిది
ఈ కొత్త విద్యా విధానంలో ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయి. 2035నాటికి ఉన్నత విద్యలో నమోదును 50శాతానికి పెంచనున్నట్లుగా, ఉన్నత విద్యా సంస్థలలో అదనంగా 3.5 కోట్ల సీట్లు వచ్చి చేరనున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉన్నత విద్యాసంస్థలను బలోపేతం చేయడం, కొత్త విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం వంటి చర్యల ప్రస్తావన లేకుండా ఇదెలా సాధ్యం? ప్రభుత్వం సాధ్యమే అంటోంది. ఎలాగంటే పూర్తిస్థాయి ప్రైవేటీకరణ. గ్లోబల్ స్థాయిలో ప్రైవేటీకరణ. దీనికి ప్రభుత్వం పెట్టిన ముద్దుపేరు ఇంటర్ నేషనలైజేషన్. దీన్ని కొలాబరేషన్, స్టూడెంట్ -ఫ్యాకల్టీ మొబిలిటీ, విదేశీ యూనివర్శిటీలకు అనుమతి, 4 ఏళ్ళ డిగ్రీ మొదలైన పద్ధతులలో అమలు చేస్తామని ఫక్తు వ్యాపార భాషలో చెప్పారు. ఈ వ్యాపారానికి ప్రాతిపదిక ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రధాన ఒప్పందాలలో ఒకటైన జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ (GATS). ఈ గ్యాట్స్ ఒప్పందంలో విద్య ఒక వాణిజ్య సర్వీసు అని, విద్యా సంస్థ ఒక సర్వీసు ప్రొవైడర్ అని, ఉపాధ్యాయుడు సర్వీసు ఫెసిలిటేటర్ అని, విద్యార్థి సర్వీసు కంజ్యూమర్ అని నిర్వచించారు. ఇలా వాణిజ్య రూపంలో విద్య ఇంటర్ నేషనలైజేషన్ అయి నమోదు శాతం పెంపు,అదనపు సీట్లు రావడం జరుగుతుందని అర్థం చేసుకోవడం కష్టమా? నమోదును పెంచడానికి మరొక మార్గం ఆన్‍లైన్ కోర్సులు, డిజిటల్ నిక్షేపాలు అని చెప్పడం జరిగింది.
కరోనా మహమ్మారి ప్రబలి విద్యా సంస్థలు తెరవడానికి వీలులేని పరిస్థితుల్లో ఆన్‍లైన్, డిజిటల్ విద్యను న్యూ నార్మల్ మోడ్ అని, క్లాస్ రూమ్ విద్యకు ప్రత్యామ్నాయమనే ప్రచారాన్ని ప్రభుత్వాలు చేపట్టాయి. ఈ ఆన్‍లైన్, డిజిటల్ విద్యలో కూడా ప్రైవేటు వ్యాపార సంస్థలకే అగ్ర తాంబూలం ఉంటుంది. కావున ఇది విద్యారంగంలో డిజిటల్ డివిజన్ సృష్టిస్తుంది. ఇంకా ఈ విధానంలో ఉన్నత విద్య గురించిన ప్రధాన మార్పులు కొన్ని ఉన్నాయి. యూనివర్శిటీలను, ఉన్నత విద్యాసంస్థలను, నాలెడ్జ్ హబ్‍లను 3000మంది లేదా అంతకు పైగా విద్యార్థులున్న మల్టీ డిసిప్లీనరీ అటానమస్ కేంద్రాలుగా మార్చడం; యూనివర్శిటీల అఫ్లియేషన్ తొలగించడం; వివిధ కోర్సుల్లో చేరడానికి, వదలివేయడానికి ముల్టిపుల్ ఎంట్రీ-ఎక్జిట్‌ను కల్పించడం, ఛాయిస్ బేస్డ్ క్రెడిట్స్ పద్ధతిలో చదువులు ఉంటాయి. ఈ మార్పుల పర్యవసానాలు స్పష్టమే. అతి కొన్ని ఐటీఇలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు అలా మారడానికి అవకాశముందేమోకానీ, మిగిలిన వేలాది డిగ్రీ కాలేజీలు, వందలాది యూనివర్శిటీల భవిష్యత్తు అగమ్యగోచరమవుతుంది. మరోవైపు ప్రైవేటు రంగంలోని టీచింగ్ షాప్స్‌లా కొన్ని టీచింగ్ మాల్స్‌గా రూపొందుతాయి.
కెఫిటేరియా నమూనాలో క్రెడిట్స్‌కోసం ఎన్నుకునే సబ్జెక్టుల్లో ఒక దానికి మరొకదానికి ఎలాంటి సంబంధం లేకపోవడం వల్ల విద్య విజ్ఞానార్జన లక్ష్యాన్ని కోల్పోతుంది. మార్కెట్ డిమాండ్ ఉండే సబ్జెక్టులలో క్రెడిట్స్ పొందడానికి వెంపర్లాట కనిపిస్తుంది. ఈ తరహా మల్టీ డిసిప్లినరీ, మల్టిపుల్ ఎంట్రీ-ఎక్జిట్ అనేవి కోర్ సబ్జెక్టుల సమగ్ర అధ్యయనాన్ని, అవగాహనను, నిశిత పరిశీలనా శక్తిని, పరిశోధనా ఆసక్తులను బాగాదెబ్బతీసి, విద్యార్థులను యంత్రాల వలె పనిచేసే వర్క్ ఫోర్సుగా మారుస్తాయి. ఇక ఉన్నత విద్య రెగ్యులేషన్ విషయానికి వస్తే యుజీసీ, ఏఐసీటీయూ వంటి సంస్థలు రద్దు చేయబడి, హైయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా (HECI) అనే ఒకే ఒక సర్వాధికార సంస్థను ఏర్పాటుచేస్తున్నట్లు ఈ విధానం ప్రకటించింది. దీని క్రింద మరో నాలుగు సంస్థలుంటాయి. పునాది నుండి పరిశోధన వరకు నియంత్రించడానికి కొత్తగా దాదాపు పది కేంద్ర సంస్థలు ఏర్పాటుకాబోతున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మెలిగే బ్యూరోక్రటిక్ సంస్థలు. ఇలాంటివి విద్యలో మౌలిక భావన అయిన విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని సమూలంగా సమాధి చేస్తాయి.
కొత్త విధానంలో వివాదాస్పద అంశం ఒకటుంది. ప్రాథమిక స్థాయి నుండి పరిశోధన వరకు దేశ జాతీయ స్థానిక సంప్రదాయాలను, ఆచారాలను, వారసత్వాన్ని, ప్రాచీన సమకాలీన జ్ఞానాన్ని గురించి బలమైన పునాదితో పెడగాగీ, పాఠ్య ప్రణాళికను మార్పు చేస్తున్నట్లు ప్రముఖంగా పేర్కొన్నారు. మనదేశ ప్రాచీన అర్వాచీన చరిత్రలో మంచి, చెడు రెండు ఉన్నాయి. నిమ్న కులాలకు, మహిళలకు విద్య నిషేధం, సతీ సహగమనం, బాల్య వివాహం వంటి ఆచారాలున్నాయి. అదే సమయంలో వీటికి వ్యతిరేకంగా ఆ యుగంలోనూ, ఆధునిక కాలంలోనూ ప్రశ్నించిన, పోరాడిన చరిత్ర, సంప్రదాయం కూడా ఉంది. దేని గురించి విద్యార్థులకు చెప్పాలి? మను, మాయావాదాల గురించా? లోకాయుత, చార్వాకాల గురించా? మత, ఆధ్యాత్మిక భావాల పునరుద్ధరణ సంస్కృతి గురించా? లేక మతంతో సంబంధంలేని సెక్యులర్, ప్రజాస్వామ్య విలువల గురించా?
ఏమైతేనేం 34 ఏళ్ళ తరువాత ఈ కొత్త విద్యావిధానం రావడం ఒక విశేషమే. అయితే దీన్ని తెచ్చినవేళ మాత్రం విపత్కరమైనది. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, రైల్వేలు, బొగ్గు గనులు, విద్యుత్తు, వ్యవసాయం, ప్రభుత్వరంగ సంస్థలలో సంస్కరణలను వరుసగా తనదైన శైలిలో ప్రకటిస్తూ, విద్యారంగంలో కూడా ఈ విధాన ప్రకటనను ఆమోదించింది. ఈ కొత్త విధానం మన దేశ విద్యా వ్యవస్థను ఏ ప్రవాహ తీరాలకు చేరుస్తుందో తలుచుకుంటే కొన్ని భయాలు కలుగక మానవు.
ఎస్. గోవింద రాజులు
(అల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటి)