విద్యకు సంబంధించి సంవత్సరం కాదు కదా.. ఒక్క రోజు, ఒక్క నెలను కూడా పోగొట్టుకోకూడదని వ్యవస్థ విభాగాలన్నీ ఇప్పుడు ప్రబోధిస్తున్నాయి. కోవిడ్–19 మరో సంవత్సరం కొనసాగవచ్చు. మరి అంతవరకు వేచి ఉండాలా? దానివల్ల దేశానికి, విద్యార్థుల కెరీర్‌కి ఎంత నష్టమో మీకు అర్థం అవుతోందా? అని ఒక న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకే న్యాయస్థానం నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. విద్యార్థుల జీవిత భద్రత కంటే విద్యా సంవత్సరం నష్టపోతామన్న భయమే ఎందుకు కలుగుతోంది అంటే విద్య ఒక పెట్టుబడి వనరు. దాన్ని స్తంభింపజేస్తే ఉత్పత్తికి అవసరమైన కార్మికులు తయారు కారు. ఈ భయమే కేంద్రం, యూజీసీ, కోర్టులు అన్నింటినీ విద్యా సంవత్సరం కొనసాగింపునకు అనుకూలంగా మారుస్తున్నాయి.
ఆసుపత్రులు, బెడ్‌లు, కిట్లు, టెస్టులు, మెడిసిన్స్, డాక్టర్లు, నర్స్‌లు, చావులు, మురికివాడలు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు వగైరా పదాల కంటే లాక్‌డౌన్, అన్‌లాక్ అనే రెండు పదాలే ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని అవగాహన చేయించే కీలక పదాలుగా మారాయి. అయితే వివిధ దశల్లో అన్ లాక్ చేయడం, ప్రతి దశలోనూ పాటించాల్సిన విధానాలు, వాటిద్వారా వచ్చే లాభాలు, నష్టాలకు సిద్ధపడటం వంటి అంశాల్లో నయా ఉదారవాదం ఎలా పనిచేస్తోంది అనేది పూర్తి మార్మికతతో అర్థంకాని విధంగా సాగుతోంది. పెట్టుబడిని ఒక ప్రక్రియగా ఒక కార్యాచరణగా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆర్థిక వ్యవస్థను, నగరాలను, పని స్థలాలను, రవాణాను, పాఠశాలలు, కాలేజీలను అన్‌లాక్ చేయడంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. స్తంభించిపోయిన అకడమిక్ పరీక్షల ప్రక్రియ, మతపరమైన ఉత్సవాలు, కరోనా కాలంలో స్తంభించిన సమాజ జీవితాన్నే ఎలా అన్‌లాక్ చేయాలి అనేది ముఖ్యం అయిపోయింది. కోవిడ్–19 వ్యాప్తి సమయంలో భౌతిక దూరం అనే పదబంధం మనిషి జీవితానికి సంబంధించిన కీలక ప్రశ్నగా కనిపించింది. దీని కంటే ముఖ్యంగా ప్రతి సామూహిక ఆవరణం కూడా ఇప్పుడు వైయక్తిక భద్రతా పరిమితిలోకి కుదించుకుపోయింది. ఇదే ఇప్పుడు మన సామాజిక సంబంధాలన్నింటినీ పునర్నిర్మిస్తోంది.
పరీక్షలు నిర్వహించడంలోనూ ఇది వాస్తవం. జాతీయ సాంకేతిక విద్యారంగంలో (మెడికల్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లు, బిజి నెస్ అడ్మినిస్ట్రేషన్, జీవ సాంకేతిక శాస్త్రాలు వగైరా) పరీక్షలు నిర్వహించడంపై చర్చలే కరోనా వైరస్ కంటే ఇప్పుడు కీలకంగా మారిపోయాయి అనిపిస్తోంది. విద్యా సంవత్సరాన్ని కొనసాగించే క్రమంలో విద్యార్థుల జీవిత పరిరక్షణే కీలకమైన అంశంగా ఉంటుంది. కరోనా వైరస్‌ను అధిగమించడానికి మనం ఎంతకాలం వేచి ఉండాలి. కోవిడ్–19 ఇంకో ఏడాది కొనసాగవచ్చు. మరి మరో ఏడాది వరకు వేచి ఉండాలని చెబుతున్నారా? దానివల్ల దేశానికి, విద్యార్థుల కెరీర్‌కి ఎంత నష్టమో మీకు అర్థం అవుతోందా? అని ఒక న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకే న్యాయస్థానం నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది.
విద్యలో నయా ఉదారవాద విధానం
అందుచేత, కోవిడ్–19 జీవన సంక్షోభం మధ్యనే జీవితం సాగాల్సి ఉంది. జీవితం ప్రయోజనాలకు సంబంధించిన ఈ ద్వంద్వ లక్షణం అటు వ్యక్తి జీవితం భద్రతపైనా, నయా ఉదారవాద జీవితం అంటే ప్రపంచ నైపుణ్యాల ఉత్పత్తి భద్రత పైనా దృష్టి పెట్టేలా చేస్తోంది. ఇప్పుడు మొత్తం వివాద కేంద్రస్థానాన్ని ఆక్రమిస్తున్నది ప్రధానంగా సాంకేతిక విద్యే అనే విషయం మనం మర్చిపోకూడదు. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు (పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్తాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్) వలస కార్మికుల సమస్యపై ఐక్యంగా సమావేశమై నిరసన తెలుపలేక పోయారు. కానీ ఇప్పుడు మాత్రం వీరు భారీస్థాయిలో జరుగుతున్న జాతీయ విద్యా పరీక్షల నేపథ్యంలో లక్షలాది మంది విద్యార్థుల జీవితాన్ని కాపాడేందుకు ఐక్యం కావడం మంచిదే. జాతీయ తృష్ణకు చెందిన సమస్య ప్రధానమైంది. గుర్తుంచుకోండి. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ జాతీయ పరీక్షా సంస్థను ఏర్పర్చింది. ఇది స్వతంత్ర స్వయంప్రతిపత్తి కలిగిన కీలకమైన పరీక్షా సంస్థ. విద్యాపరీక్షలను పారదర్శకంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్–1860 కింద దీన్ని ఏర్పర్చారు. అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అభ్యర్థుల పోటీతత్వాన్ని అంచనా వేసే సంస్థ ఇది. దీని ఆధ్వర్యంలోనే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర కేంద్ర, రాష్ట్రాల నిధులతో నడిచే సాంకేతిక సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రాముల్లో చేరడానికి ఇవే కీలకం.
స్వావలంబన సాధించే జాతి నిర్మాణం కోసం ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపులో విద్యాపరమైన తృష్ణ కాకుండా ఆధ్యాత్మికపరమైన విద్యా తృష్ణే కనిపిస్తోంది. ఆయన పిలుపులో శాస్త్రీయ స్ఫూర్తి లేదు. ప్రకృతి నుంచి నేర్చుకుంటూ ఎలా జీవించాలో నేర్పే విద్య దాంట్లో లేదు. ఇతర ప్రాణులతో మమేకమవుతూ స్వార్థం నుంచి బయటపడే స్ఫూర్తి ఆ పిలుపులో లేదు. వీటికి బదులుగా దేశాన్ని సంపన్నవంతంగా మార్చే మేనేజిరియల్ నైపుణ్యాలను ప్రబోధించే సాంకేతిక పరమైన తృష్ణతో కూడిన విద్యకోసం మోదీ పిలుపిస్తున్నారు. వ్యాపారం, వాణిజ్యం, సంపన్నులతో భుజంభుజం కలిపే తరహా షాంఘై ర్యాంకింగ్‌లను తలపించే సంపన్న సమాజం కోసం మోదీ పిలుపిస్తున్నారు.
విద్యకు సంబంధించి సంవత్సరం కాదు కదా. ఒక్క రోజు, ఒక్క నెలను కూడా పోగొట్టుకోకూడదని వ్యవస్థకు సంబంధించిన అన్ని విభాగాలు ఇప్పుడు ప్రబోధిస్తున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అనేది క్వారంటైన్‌లో ఉన్న విభాగాలను మార్కెట్ కోసం సామాజిక ఉత్పాదక యూనిట్లుగా మార్చివేసింది. పైగా విద్యారంగంలో భౌతిక దూరం పాటించడం నయా ఉదారవాద విద్యకు చెందిన కొత్త పరికరంలాగా మారిపోయింది. సాంప్రదాయిక క్లాస్ రూమ్ విద్య స్థానంలో ఆన్‌లైన్ విద్య ఇప్పుడు మరింత ఉన్నతంగా మారిపోయింది. దూరం పాటిస్తూ నేర్చుకునే యంత్రాంగం పెట్టుబడికి కొత్త హద్దులను సృష్టిస్తోంది.
మీ సరుకును, మీ కేపిటల్ గూడ్స్‌ని లాభాలు ఆర్జించే దిశగా నడిపించకుండా గోడౌన్‌లలో కుళ్లబెడితే మీరు తట్టుకోగలరా? సరఫరా ప్రక్రియను మొత్తంగా నిలిపివేస్తే మీరు భరించగలరా? అందుకే భౌతిక దూరం అనే భావనను కూడా పరీక్షల క్రమ నిర్వహణ, కఠినమైన విద్యా క్యాలెండర్లు, ప్రత్యేకించి సాంకేతిక, వైద్య విద్యలో నిర్దిష్ట ఉద్యోగ నియామకాల వ్యవస్థతో తప్పనిసరిగా మిళితం చేయాల్సిందే. కోవిడ్–19 విద్యా పునర్నిర్మాణంలో భాగంగా సామాజిక క్షేత్ర పునర్నిర్మాణం చేయగలిగే అవకాశాన్ని రాజ్యానికి దఖలు పర్చింది. అందుకే కోవిడ్–19 నేపథ్యంలో జేఈఈ, నీట్ వంటి పరీక్షలను వాయిదా వేయాలనే సాధారణ ప్రశ్నను దాటి మనం ఇప్పుడు ఈ సమస్య గురించి చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగానే లక్షలాదిమంది విద్యార్థుల భద్రత, ఆరోగ్యానికి, వారి ప్రాణాలకు కలిగే ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాం. ఆన్‌లైన్ విద్యలో ఇంటర్నెట్ కనెక్టివిటీ, బ్యాండ్ విడ్త్‌ను అందరూ సమానంగా పొందే అవకాశాలను గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాం.
వాస్తవ సమస్యలు
మనం విద్య అనే సరుకు మనుగడ సమస్యను ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ ప్రధాన వనరుల్లో విద్య ఒకటి. కానీ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను పొందే హక్కు ఉంటోంది. ప్రతి శిశువు పూర్తికాలం ప్రాథమిక విద్యను సంతృప్తికరంగా నాణ్యమైన రీతిలో పొందే హక్కును రాజ్యాంగ సవరణ దఖలు పర్చింది. కానీ ఈ దేశంలో ఒక వలస కార్మికుడు లేదా వలస కూలీ కుటుంబంలోని పిల్లల విద్యా జీవితం ఒక వరద వల్లో, దుర్భిక్షం వల్లో, తండ్రి లేక తల్లి మరణం వల్లో ఎలా విచ్ఛిన్నమవుతోందని మనం ఎన్నడైనా ప్రశ్నించుకున్నామా? విద్యేతర కారణాల వల్ల ఎంతమంది కింది తరగతులకు చెందిన పిల్లల కెరీర్ అంతమవుతోందో మనం ఎన్నడైనా ఆలోచించామా?
అఖిల భారత పరీక్షలను వాయిదా వేయాలంటూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యర్థనను సుప్రీం కోర్టు కూడా కొట్టేసింది. కోర్టు తీర్పుతో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు విద్యార్థులను కార్మికులుగా తయారు చేస్తున్నాయనీ, లేబర్ మార్కెట్లో ప్రవేశించడానికి వీరిని సిద్ధం చేస్తున్నారని మనం మర్చిపోకూడదు. వలస కార్మికుల పిల్లలను నూతన నైపుణ్యాలతో అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే కార్మికుల పిల్లలు నిర్మాణరంగం, హస్తకళలు, చిన్న తరహా గని పనుల కోసం కారుచౌకగా ఎప్పుడూ లభ్యమవుతూనే ఉంటారు. వారికి నైపుణ్య విద్య ఉంటే ఎంత? లేకుంటే ఎంత?
అందుకే విద్యలో జాతీయ స్వభావం గురించి టముకు వాయిస్తున్న వారు మన సాంకేతిక విద్యా సంస్థల్లో కూడా భవిష్యత్ కార్మికులను అసమాన నైపుణ్యాలు, వ్యత్యాసాలతో కూడిన జీతాలు, లేబర్ మార్కెట్లో అసమాన అవకాశాల వ్యవస్థలోకి చొప్పించాలని చూస్తున్నారు. ఒకవైపు విద్యపై అధికంగా ఖర్చుపెడుతున్న రాష్ట్రప్రభుత్వాలు విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని తపనపడుతుంటే ఏమాత్రం లక్ష్యపెట్టని యూజీసీ దాని రెగ్యులేటరీ అధికారులు విద్యార్థుల జీవి తాలను పరీక్షల పేరిట నియంత్రించాలని చూడటమే విషాదం. (ది వైర్ సౌజన్యంతో)
వ్యాసకర్త: రణబీర్ సమద్దర్, చైర్‌పర్సన్, కోల్‌కతా రీసెర్చ్ గ్రూప్
E–Mail : ranabir@mcrg.ac.in