Transfers 2020 -దరఖాస్తు నమూనాపై సిబ్బందికి అవగాహన

 

బదిలీలకు కసరత్తు!

దరఖాస్తు నమూనాపై సిబ్బందికి అవగాహన

టీచర్‌ లాగిన్‌లో మార్పులకు హెచ్‌ఎం సమ్మతి అవసరం!

ఈనాడు-గుంటూరు

బదిలీలకు కసరత్తు!

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కసరత్తును పాఠశాల విద్యాశాఖ వేగవంతం చేసింది. జిల్లాలో 3250 ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్స్‌, పీఈటీ, హెచ్‌ఎంలు అంతా కలిపి 12వేల మంది పనిచేస్తున్నారు. బదిలీలపై వీరంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.గతంలో బదిలీల ప్రక్రియలో భాగంగా టీచర్‌ లాగిన్‌ నుంచి సమాచారం హెచ్‌ఎం, ఎంఈవో, డీవైఈవో, డీఈవో లాగిన్లకు చేరాక కూడా కొందరు తిరిగి మార్పులు, చేర్పులు చేసేవారు. అది ఎవరు చేశారు? ఎప్పుడు చేశారనేది ఉన్నతాధికారులకు తెలిసేదికాదు. కానీ ఈసారి ఏ స్థాయిలో మార్పులు జరిగినా అది ఎవరి లాగిన్‌లో జరిగిందో తెలిసిపోతుంది. ఇలా నూతన విధానం అమలు చేయబోతున్నారు. 

ఒకసారి టీచర్‌ లాగిన్‌ నుంచి తన సర్వీసుకు సంబంధించిన వివరాలు హెచ్‌ఎం లాగిన్‌కు వెళ్లాక తిరిగి ఉపాధ్యాయుడు ఏదైనా మార్పు, చేర్పులకు ప్రయత్నిస్తే కచ్చితంగా హెచ్‌ఎం చరవాణికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారానే సదరు టీచర్‌ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా హెచ్‌ఎం లాగిన్‌లోనే చేయాలి. ఆయన లాగిన్‌లో ఏదైనా మార్పులు చేస్తే డీవైఈఓ ఫోన్‌కు ఓటీపీ వెళ్తుంది. ఇలా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు ఉండడంతో ఒకసారి లాగిన్‌ అయిన తర్వాత తిరిగి మార్పులు, చేర్పులు చేసుకోవడం టీచర్లకు అసాధ్యమనేది స్పష్టమౌతోంది. 

దీంతో ఉపాధ్యాయులు వివరాలను ముందుగా తన లాగిన్‌లోనే జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి. మొత్తానికి బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తరఫున చర్యలు ఊపందుకున్నాయి. కేవలం తన సర్వీసు, ఏ కేటగిరిలో ఎన్నాళ్లు పని చేశారో ఆ వివరాల ఆధారంగానే పాయింట్లు కేటాయించి ఆ మేరకు బదిలీలు చేయడానికి రంగం సిద్ధమవుతోందని ఉద్యోగవర్గాలు తెలిపాయి.

మిగులు ఖాళీలన్నీ బ్లాక్‌ చేస్తారు...

గతంలో క్లియర్‌ వేకెన్సీలు, ఒకేచోట దీర్ఘకాలికంగా పనిచేసిన ఖాళీలు(లాంగ్‌ స్టాండింగ్‌ వేకెన్సీలు) ఇవి మొత్తం చూపేవారు. కానీ ప్రస్తుతం ఎంత మంది ఉపాధ్యాయులైతే పని చేస్తున్నారో ఆ ఖాళీలనే చూపాలని అధికారులకు సూచించారు. దీనివల్ల టీచర్లు ఇష్టానుసారం ఆప్షన్లు పెట్టుకోవడానికి కుదరదు. మిగులు ఖాళీలను కూడా కేటగిరీ 1, 2, 3 విభాగాలుగా విభజించి వాటిని చూపుతారు. ఈ మిగులు ఖాళీలను కోరుకోకూడదని ముందుగానే తెలియజేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు ఉండి ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే వారిని హైస్కూల్‌కు బదిలీ చేస్తారు. 

ఇదంతా కూడా తొలుత హేతుబద్ధీకరణ ప్రక్రియ(రేషనలైజేషన్‌) పూర్తయ్యాకే చేపడతారు. దీనికి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి ఏ క్షణాన అయినా బదిలీల ప్రక్రియ నిర్వహణకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad