ఫిన్లాండ్ : 16 ఏళ్ల బాలిక ఫిన్లాండ్‌కు ప్రధాని కాగలదా ? కానీ.. అయ్యింది ! గత బుధవారం ఉదయం ఫిన్లాండ్ ప్రధానమంత్రిగా ఆవా ముర్టో (16) బాధ్యతలను చేపట్టింది. ఆ వెంటనే కేబినెట్ మంత్రులు, చట్ట సభ్యులు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. బాలికలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడం చాలా ముఖ్యమని, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన అవసరముందని నొక్కి చెప్పింది. సాంకేతికంగా దూసుకెళ్తున్న ఫిన్లాండ్... బాలికలకు ఆ ఫలాలను అందించేందుకు ఏమేం చేయగలదన్న విషయమై ఆరా కూడా తీసింది !
ఫిన్లాండ్ ప్రధానమంత్రిగా ఆవా ముర్టో ఎలా కాగలిగిందంటే...ఈ నెల 11 న 'అంతర్జాతీయ బాలికల దినోత్సవం'. ఆ వేడుకను పురస్కరించుకుని ఐరాస బుధవారం 'గర్ల్స్ టేకోవర్' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా దక్షిణ ఫిన్లాండ్‌లోని వాక్సే గ్రామానికి చెందిన ఆవా ముర్టో (16) ఒక్కరోజు ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది. స్త్రీ-పురుష సమానత్వ భావనను చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముర్టో తోపాటు అసలు ప్రధాని సనా మారిన్ కూడా కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వారిద్దరూ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ''ప్రపంచ వ్యాప్తంగా బాలికలకు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, పరిష్కారం కనుగొనాలి'' అని వారు పేర్కొన్నారు. ఫిన్లాండ్‌లోని చాలా సంస్థలు కూడా మహిళా సిబ్బందికి ఒక్కరోజు సారథ్య బాధ్యతలు అప్పగించాయి.