ఇప్పట్లో స్థానిక ఎన్నికలు కష్టం

 ఇప్పట్లో ఎన్నికలు కష్టం

ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో భేటీలో సీఎస్‌ సాహ్ని స్పష్టీకరణ

వాయిదా వేసినప్పుడు 26.. ఇప్పుడు 26 వేలకు పైగా యాక్టివ్‌ కరోనా కేసులు

అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున వైరస్‌ బారినపడ్డారు

వేల సంఖ్యలో పోలీసులకూ పాజిటివ్‌

రాష్ట్రంలో కరోనా తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం

స్థానిక ఎన్నికలకు అనుకూల పరిస్థితులు ఏర్పడగానే సమాచారమిస్తాం

అమరావతి: కరోనా నియంత్రణకు దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో మార్చిలో రాష్ట్రంలో కరోనా కేసులు కేవలం 26 మాత్రమే ఉండగా తాజాగా 26,622 యాక్టివ్‌ కేసులున్నాయని మొత్తం 8,14,774 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని పేర్కొంది. ప్రభుత్వం వైరస్‌ నియంత్రణకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా రోజుకు సగటున 20 వరకు మరణాలు నమోదవుతున్నాయని తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని పేర్కొంటూ సీఎస్‌ నీలం సాహ్ని బుధవారం సాయంత్రం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో కలసి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారని, విధి నిర్వహణలో ఉన్న 11 వేల మందికి పైగా పోలీస్‌లకు కోవిడ్‌ సోకిందని సీఎస్‌ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. కోవిడ్‌ తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడగానే ఎన్నికల కమిషన్‌కు తెలియచేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నందున ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని తాజాగా నిమ్మగడ్డ నిర్వహించిన సమావేశంలో దాదాపు అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అసలు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో ముందు ఎస్‌ఈసీ తేల్చి చెప్పాకే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామని పార్టీలు పేర్కొన్నాయి. టీడీపీ మినహా ఎవరూ ఈ సమయంలో ఎన్నికలకు మొగ్గు చూపలేదు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad