సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు రాసిన లేఖ దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. సీఎం జగన్ రాసిన లేఖను ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయగా, తాజాగా, సుప్రీం కోర్టులో మరో సంచలన పిటిషన్ దాఖలైంది. ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
సీజేఐకి సీఎం జగన్ లేఖ
న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్.. వైఎస్ జగన్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీఎం జగన్‌పై న్యాయవాదులు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌పై దాదాపు 30 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, ఇలాంటి వ్యక్తి కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఐ, సీఎం జగన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చూపారు.