E-SR ఇక సులభతరం. కొత్త మార్పులు చేర్పులు.

 అందుబాటులోకి కొత్త వెర్షన్‌(Aug 25 - 2020)

పారదర్శకంగా ఉద్యోగులకు ఆర్థిక భత్యాల చెల్లింపు.. జాప్యం లేకుండా ఉద్యోగ విరమణ ప్రయోజనాలను సమకూర్చడం..

లంచాలను నివారించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఉద్యోగుల సేవాపుస్తకం (ఇ-ఎస్‌ఆర్‌) ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను ఆర్థిక శాఖ సులభతరం చేసింది. మంగళవారం రాత్రి నుంచి కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది.

సర్వర్‌ సామర్థ్యాన్ని కూడా పెంచడంతో తొందరగా ఉద్యోగులు నమోదు చేసే అవకాశం ఏర్పడింది.

ఇ-ఎస్‌ఆర్‌ నమోదులో గతంలో 12 విభాగాలు ఉండేవి. అందులో నుంచి పూర్తిగా జీఐఎస్‌ వివరాలు పొందుపరచడాన్ని తొలగించారు. వివిధ విభాగాల నుంచి ఆస్తుల వివరాలు, జడ్‌పీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, బ్యాంకు ఖాతా, వైద్య ధ్రువీకరణ పత్రాలు, పాత ఫొటో వంటి అంశాలు పూర్తిగా తొలగించారు. గతంలో విభాగం -2లోని వివరాలను మార్చారు. సర్వీసు వెరిఫికేషన్‌ పూర్తిగా తొలగించారు. శాఖాపరమైన పరీక్షల శిక్షణలు, విద్యార్హతల పత్రాలను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం వాటిని పూర్తిగా తొలగించారు.

అనేక మార్పులు

మొదట్లో ఇ-ఎస్‌ఆర్‌ నమోదులో అత్యధిక సమయం వెచ్చించాల్సి వచ్చేది. లీవ్‌ లెడ్జర్‌ ఐచ్ఛికం కోసం చాలా మంది ఉపాధ్యాయులు ఆపసోపాలు పడి ఈ ప్రక్రియ పూర్తిచేశారు. కొంత కాలం తర్వాత ఆ ఐచ్ఛికాన్ని తొలగించారు. ప్రస్తుతం కొత్త వెర్షన్‌లో మళ్లీ లీవ్‌ లెడ్జర్‌ ఐచ్ఛికాన్ని పొందుపరిచారు. గతంలో నమోదు చేసిన వారి సెలవులకు సంబంధించిన వివరాలను తీసివేయమడంతో మళ్లీ లీవ్‌ లెడ్జర్‌ నమోదు చేయాల్సి వస్తోందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ఆలస్యమే అమృతం:

ఇ-ఎస్‌ఆర్‌ నమోదును ఈనెల 25లోపు పూర్తి చేయాలన్న విద్యాశాఖ ఆదేశాలతో అష్టకష్టాలు పడి 20 శాతం ఉపాధ్యాయులు దీన్ని సమర్పించారు. 70 శాతం పైగా నమోదు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. వీరంతా కొత్త వెర్షన్‌లో మళ్లీ నమోదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ప్రారంభించని వారికి మాత్రం తేలికగా పూర్తవుతుందని సంఘ నాయకులు పేర్కొంటున్నారు. గతంలో పూర్తిచేసిన వారి వివరాలు లీవ్‌ లెడ్జర్‌లో మళ్లీ జోడించాలని, కొత్తగా నమోదు చేసే వారికి ప్రస్తుత విధానాన్ని అమలు చేస్తే చాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.

ఇక మార్పులు లేనట్లేనా?

ఇ-ఎస్‌ఆర్‌ సాఫ్ట్‌వేర్‌ రూపొందించినప్పటి నుంచి కనీసం 25 సార్లయినా మార్పులు చేశారు. కొత్తగా కొన్ని ఐచ్ఛికాలు పొందుపరచటం లేదా తీసివేయటం, మరికొన్ని మార్పులు, చేర్పులు చేయటం కొనసాగుతూనే ఉంది. నమోదు ప్రక్రియ పూర్తి చేసేశామని ఊపిరి పీల్చుకొనే సమయానికి మరికొన్ని మార్పులతో నెట్‌ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. తమిళనాడు తరహాలో ఇక్కడ సంబంధిత శాఖలే ఈ ప్రక్రియ మొత్తం చేపట్టాలని కోరుతున్నారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad