అడ్డదారుల్లో ప్రయత్నాలు
ప్రిఫరెన్సియల్, స్పౌజ్‌లో పాయింట్లు పొందేందుకు అక్రమ మార్గాలు
నోట్ల కట్టల దెబ్బకు నోరుమూసుకున్న ఉన్నతాధికారులు.
అనంతపురం విద్య, నవంబరు 27 : తమకు అనుకూలమైన ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు కొందరు ఉ పాధ్యాయులు చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. కొంద రు సంఘాల నాయకుల నుంచి సామాన్య టీచర్ల వరకూ అర్హులు కాకపోయినప్పటికీ ప్రిఫరెన్షియల్, స్పౌజ్ కేటగిరీలో పాయింట్లు పొందేందుకు వినూత్న అక్రమాలకు పాల్పడుతున్నారు. భారీగా నకిలీ సర్టిఫికెట్లు పొంది...అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికి జిల్లా విద్యాశాఖలోని కొందరు ఉన్నతాధికా రులు, సిబ్బంది సైతం కాసుల కట్టల తీసుకుని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి.
బీటెక్ చదువుతున్న కుమార్తెకు జువైనల్ డయాబెటిస్ అంట !
అనంతపురం రూరల్ మండలంలో పనిచేసే గణిత ఉపాధ్యాయురాలు ఒకే పాఠశాలలో 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ప్రిఫరెన్షియల్ కేటగిరీలో వెళ్లేందుకు పావులు కదిపినట్లు సమాచారం. తన కుమార్తెకు బాల్య మధుమేహం(జువైనల్ డయాబెటిస్) ఉందంటూ బోగస్ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆమె కుమార్తె బెంగళూరులో బీటెక్ మొదటి ఏడాది చదువుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సాధారణంగా 9 లేదా 10 ఏళ్లలోపు వారికే బా ల్య మధుమేహం ఉంటుందని, పైగా ఈ తరహా వ్యాధితో బాధపడుతూ ఉంటే నిత్యం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుం ది. అయితే ఆ ఉపాధ్యాయురాలి కూతురు ఇంటికి దూరంగా బెంగళూరులో బీటెక్ చదువుతుంటే జువైనల్ డయాబెటిస్ ఉందంటూ బోగస్ సర్టిఫికెట్ తీసుకుని ప్రిఫరెన్షియల్ కేటగిరీలో దరఖాస్తు చేసినట్లు సమాచారం. బెళుగుప్ప మండలంలోని ఓ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు కూడా తన కుమార్తెకు జువైనల్ డయాబెటిస్ ఉందంటూ ఓ నర్సు ద్వా రా డాక్టర్లను కలిసి బోగస్ సర్టిఫికెట్లు పొంది దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. సపోర్టు డాక్యుమెంట్లు పరిశీలిస్తే వీరి బండారం బయట పడుతుంది.
తన లెటర్ తానే టైప్ చేసుకుని...
జిల్లాలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ రెండేళ్ల కిందట స్పౌజ్ వినియోగించుకున్నట్టు సమాచారం. ఆయన భార్య బుక్కరాయసముద్రం మండంలోని ఓ పాఠశాలలో పనిచేస్తోంది. అయితే ఈ ఏడాది బదిలీల్లో ఎలాగైనా భార్యకు స్పౌజ్ పాయింట్లు దక్కేలా చేయాలనుకున్నాడు. అందుకు గతంలో ఆయన స్పౌజ్ పాయింట్లు వాడుకోలేదన్నట్లు లేఖ తీసుకుని తాజాగా తన భార్యకు స్పౌజ్ పాయింట్లు దక్కేలా పావులు కదిపాడు. 8 ఏళ్లు గడవకనే ఉన్నతాధికారుల కళ్లు గప్పి మోసానికే పాల్పడినట్లు విద్యా శాఖ వర్గాలు, కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చర్చించుకుంటున్నారు.
భార్య ఆ చివరి జిల్లాలో.... భర్త ఈ చివరి జిల్లాలో
ఆయన ఓ పేరున్న సంఘంలో జిల్లా ప్రధాన నాయకుడు. ఆయన భార్య శ్రీకాకుళంలో ఉద్యోగం చేస్తోంది. ఆయనేమో కూడేరు మండలంలో టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. బదిలీల్లో స్పౌజ్ కింద పాయింట్లు పొందాలనుకున్నాడు. భార్య రెగ్యులర్ పోస్టింగ్ శ్రీకాకుళంలో అయినా విజయవాడలో డెప్యూటేషన్‌పై పనిచేస్తోంది. అయితే ఆమె ఇటీవల బదిలీ కాకున్నా అనంతపురం బదిలీ అయ్యిందంటూ అధికారులను నమ్మించినట్టు సమాచారం. ఆ మేరకు ఉన్నతాధికారులను మభ్యపెట్టి కొంత, కాసులతో మరికొంత మాయచేసి క్లారిఫికేషన్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. పైగా 20 శాతం హెచ్‌ఆర్‌ఏ స్థానాలైన రుద్రంపేట, పాపంపేట, పంతుల కాలనీ, విద్యారణ్యనగర్‌లోని స్కూళ్లలో ఎలాగైనా ప్లేస్ కొట్టేసేందుకు ఈ ఎత్తుగడ వేశాడన్న విమర్శలు ఆ సంఘం నాయకుల నుంచే వినిపిస్తున్నాయి.
మరికొందరిదీ అదే దారి....
కూడేరు ఉన్నత పాఠశాలలో పనిచేసే మరో ఉపాధ్యాయుడు గతంలో ప్రిఫరెన్షియల్ కేటగిరీ బదిలీల్లో లబ్ధిపొందాడు. 8 ఏళ్లు ఇంకా పూర్తికాలేదు. అయితే ఇటీవల చిన్న ప్రమాదంలో గాయపడ్డాడు. గతంలో ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ప్రయోజనం పొంది తాజాగా పీహెచ్ కోటాలో మళ్లీ పాయింట్లు పొందేందుకు సిద్ధమయ్యాడు. ఇలా చాలా మంది ఉపాధ్యాయులు, పలు సంఘాల నాయకులు ఫ్రిఫరెన్షియల్, స్పౌజ్ పాయింట్లు వాడు కుంటూ అడ్డదారిలో బదిలీల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
గేట్లు ఎత్తేసిన కొందరు విద్యాశాఖాధికారులు
అక్రమ మార్గాల్లో వచ్చే వారికి అడ్డుకట్ట వేయాల్సిన కొందరు విద్యాశాఖాధికారులు గేట్లు ఎత్తేశారు. స్పౌజ్ సర్టిఫికెట్ల పరిశీలించి అక్రమార్కులను తేల్చాలంటూ డీఈఓ ఆదేశించారు. ఇందుకోసం 19 బృందాలను నియమించారు. కొందరు విద్యాశాఖాధికారులు కొందరు సంఘాల నాయకులు, టీచర్లతో చీకటి ఒప్పందాలు చేసుకుని వక్రమార్గంలో అక్రమార్కులకు క్లీన్‌చిట్ ఇచ్చారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తతంగం వెనుక భారీగానే డబ్బులు చేతులు మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.