అమ్మ ఒడి’ పథకంలో ఐదు అంశాలు పాటించాలి
ఈ విద్యా సంవత్సరంలో అమ్మఒడి పథకంలో విద్యార్థులకు లబ్థి కలగాలంటే ఐదు అంశాలను కచ్చితంగా పాటించాలని పాఠశాలల యాజమాన్యాలకు విద్యా శాఖ అధికారులు సూచించారు.
గత ఏడాది సదరు పథకంలో లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే గత ఏడాది లబ్ధి పొందని అర్హులైన విద్యార్థుల వివరాలను ఇప్పుడు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.
ఈ ఏడాది కొత్తగా పాఠశాలల్లో చేరిన విద్యార్థుల వివరాలు నమోదు చేయాలన్నారు.
విద్యా కానుక కిట్స్, బయోమెట్రిక్ అథంటికేషన్‌లో విద్యార్థుల వివరాల్లో ఏవైనా మార్పులుంటే అప్‌డేట్ చేయాలన్నారు.
ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను అప్‌లోడ్ చేయకపోయినా, ఏమైనా అవకతవకలకు పాల్పడినట్టు తమ సిబ్బంది గుర్తించినా సదరు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ అధికారులు హెచ్చరించారు.
తెరుచుకోని అమ్మఒడి పోర్టల్
ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు
జగనన్న అమ్మఒడి పోర్టల్ వెబ్సైట్ రెండు రోజుల నుంచి తెరుచుకోకపోవడంతో దరఖాస్తులు నింపేందుకు ఉపాధ్యాయులు ఇబ్బందిపడుతున్నారు.
9వ తేదీ నుంచి అమ్మఒడి అర్హుల జాబితాను డేటా సిద్ధం చేయాలని గౌ౹౹ పాఠశాల విద్యాశాఖ కమిషనరు గారు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నెల 15వ తేదీలోపు చైల్డ్ ఇన్ఫో పూర్తిచేయాలని ఆదేశించారు. సర్వర్ నిదానంగా ఉంటోందని దీనివల్ల సమాచారం నమోదు చేయడం ఆలస్యమవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చైల్డ్ ఇన్ఫోలో అప్డేట్ అయిన విద్యార్థుల వివరాలను ఎపిసిఎఫ్ఎస్ఎసకు 15వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు అందజేయాల్సి ఉంటుంది.అర్హులైన తల్లుల జాబితాను ఆరు అంచెల ప్రకారం పరిశీలించి ఈ నెల 16 నాటికి విడుదల చేస్తారు.
పోర్టల్ తెరుచుకోకపోవడంతో విధించిన గడువులోపు పూర్తిచేయడం సాధ్యమవుతుందా? కాదా? అని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.