ఆ ఖాళీలపైనే ఆశలు!

♦స్పష్టత వచ్చాకే ఐచ్ఛికాలిస్తాం

♦ఇదీ కొందరి ఉపాధ్యాయల తీరు

♦ఆప్షన్ల నమోదుకు నేటితో ముగియనున్న గడువు

🌻ఈనాడు-గుంటూరు

వెబ్... లబోదిబో

ఉపాధ్యాయ బదిలీలు ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తున్నాయి. సర్వర్ బ్రాండ్ విడ్త్ తక్కువ గా ఉండడం తో ఆప్షన్ ల ప్రక్రియ ప్రహసనం లా సాగుతోంది. సైట్ ఓపెన్ కాదు, ఐతే సబ్మిట్ కావట్లేదు, ప్రింట్ రావడం లేదని పలువురు ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. నేటితో ముగియనున్నది మరింత సమయం ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడానికి ఒకేచోట చేరిన ఉపాధ్యాయులు

బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఐచ్ఛికాలు ఇచ్చుకోవటానికి ఇంకా 24 గంటలే గడువు ఉంది. మంగళవారంతో ఈ ప్రక్రియ ముగియనుంది. అయినా చాలా మంది ఉపాధ్యాయులు అప్రమత్తం కావడం లేదు. ప్రతి మండలంలో బ్లాక్‌ చేసిన ఖాళీలను కూడా ఎంపిక చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు పోరాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందేమోనన్న ఆశతో ఉపాధ్యాయులు ఉన్నారు. అదే జరిగితే ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చిన వారు తిరిగి మరోసారి ఐచ్ఛికాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని భావించి వేచి చూస్తున్నారు. మరికొందరు ఈ ఆప్షన్లు పెద్ద సంఖ్యలో ఇచ్చుకోవాల్సి ఉండడంతో వాటి ప్రాధాన్యం ఎలా గుర్తించాలో తెలియక ఆప్షన్ల జోలికి వెళ్లడం లేదు. ఇలా వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది.

తప్పనిసరి బదిలీ జాబితాలో ఉన్న వారు సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, లేకపోతే వారికి ఆఖరిలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడకు పంపే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

🌻జిల్లా వ్యాప్తంగా బదిలీల కోసం 5700కు పై చిలుకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఆప్షన్లు మాత్రం సోమవారం నాటికి 2 వేల మంది కూడా చేసుకోలేదు. అందరూ చివరి రోజు చేయడానికి ప్రయత్నిస్తే సర్వర్‌పై ఒత్తిడి పడి స్తంభిస్తుందేమోనన్న ఆందోళనలో విద్యాశాఖ వర్గాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు మాత్రం తమకు బ్లాక్‌ చేసిన ఖాళీలపై ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే తప్ప తాము ఆప్షన్ల ఎంపికలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవటానికి వీలుపడదని చెబుతున్నారు. కొందరు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకునే విషయంలో అవగాహన లేక ఇతరులపై ఆధారపడటం వల్ల కూడా తక్కువ సంఖ్యలో ఆప్షన్లు నమోదుకావటానికి కారణమైందని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నెల 11 నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో అన్ని క్యాడర్లకు సైట్‌ తెరుచుకోలేదు. కేవలం సెకండరీగ్రేడ్‌ హెచ్‌ఎంలు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు మాత్రమే సైట్‌ అందుబాటులోకి వచ్చింది. ఆ మరుసటిరోజు సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, స్కూల్‌ సహాయకులు, వ్యాయామోపాధ్యాయులు ఇలా అందరికి వెబ్‌ ద్వారా ఆప్షన్లు ఇవ్వటానికి లింకు విడుదల చేసింది ప్రభుత్వం. మొదటి రోజు సర్వర్‌ చాలా వరకు పనిచేయలేదు. మధ్యలో ఒక రోజు అమావాస్య వంటి కారణాలతో ఆప్షన్లు ఇచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. వీటన్నింటి నేపథ్యంలో గడువు పొడిగిస్తారనే ఆశలో పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తన సీనియారిటీ జాబితాలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. గుంటూరు చుట్టుపక్కల మండలాలైన తాడికొండ, మంగళగిరి, పెదకాకాని, ప్రత్తిపాడు, మేడికొండూరు, చేబ్రోలు, తాడేపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువ ఖాళీలు బ్లాక్‌ చేశారని, వాటిని చూపితే ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని మరికొందరు ఉపాధ్యాయులు భీష్మించుకు కూర్చొన్నారు.

♦ర్యాంకే ప్రామాణికం..

ప్రతి ఉపాధ్యాయుడికి తను చేసిన సర్వీసు, ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లో ఎన్నాళ్ల నుంచి ఉంటున్నారో ఆ మొత్తానికి లెక్కించి పాయింట్లు ఇచ్చారు. ఈ మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. సగటున ఒక్కో ఉపాధ్యాయుడు తనకు వచ్చిన ర్యాంకు దగ్గరి నుంచి ఆ తర్వాత ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని పాఠశాలలను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ తను పరిమితంగానే ఖాళీలను ఎంపిక చేసుకుని వాటిల్లో ఎక్కడా లేకపోతే సదరు ఉపాధ్యాయుడు ఆ తర్వాత ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఐచ్ఛికాలు ఇచ్చుకునేటప్పుడే సాధ్యమైనంత వరకు ఎక్కువ సంఖ్యలో పాఠశాలలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏ ఉపాధ్యాయుడికి అయినా అతనికి వచ్చిన ర్యాంకే ప్రామాణికంగా బదిలీకి యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. చాలా మంది ఈ విషయం తెలియక తనకు అనుకూలమైన 20-30 పాఠశాలలు ఎంపిక చేసుకుని సరిపుచ్చుకుంటారు. ఒకవేళ ఆయన కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఆ పాఠశాలలు కేటాయిస్తే తన పరిస్థితి ఏమిటని ఆలోచించి సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఆలోచన చేయాలని సీనియర్‌ ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad