♦వేసవి సెలవులు ఉండవా?
♦విద్యాశాఖ ‘పది’ షెడ్యూలు విడుదల
♦ఏప్రిల్ 13 వరకు తరగతులు
♦ఆపై ప్రీపబ్లిక్... మేలో పబ్లిక్ పరీక్షలు?
♦ఆ వెంటనే కొత్త విద్యా సంవత్సరం
♦మరి మిగిలిన తరగతుల సంగతి?
♦ప్రాథమిక పాఠశాలలు తెరుచుకునేది ఎప్పుడో!?
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జనవరి 22:* కరోనా మహమ్మారితో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జనవరి ముగుసున్నా ఇప్పటికీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలో అడుగు పెట్టలేదు. 6 నుంచి 9 వరకు తరగతుల విద్యార్థుల్లో ఎక్కువ మంది బడికి వెళ్లాలా.. వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఇప్పుడిప్పుడే బోధన ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు బోధించాల్సిన విధానంపై విద్యాశాఖ ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రధానోపాధ్యాయులకు పంపింది. దాని ప్రకారం చూస్తే ఈ ఏడాది వేసవి సెలవులు ఎప్పటిలా ఉండే అవకాశం లేదని అర్థమవుతోంది. కాకపోతే 6 నుంచి 9 తరగతుల వరకు విద్యార్థులకు ఎప్పటి వరకు తరగతులు నిర్వహిస్తారు, 1 నుంచి 5 తరగతుల వారికి తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారు అన్న వాటిపై స్పష్టత లేదు.
♦ఏప్రిల్ 10 వరకు తరగతులు
విద్యా శాఖ షెడ్యూల్ ప్రకారం 10వ తరగతి విద్యార్థులకు మే నెలలో తుది పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అభ్యసనాభివృద్ధి కార్యక్రమాన్ని గురువారం నుంచి పాఠశాలల్లో ప్రారంభించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు అనుసరించాల్సిన విద్యా విధానానికి సంబంధించిన కార్యాచరణను విద్యాశాఖ విడుదల చేసింది. దాని ప్రకారం ప్రతిరోజూ ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయంలోపు 5 పీరియడ్లలో సిలబస్‌ను బోధించాలి. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు పునశ్చరణ, పర్యవేక్షణ పఠన తరగతి నిర్వహించాలి. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు రోజూ మధ్యాహ్నం 3.40 నుంచి 4.40 గంటల వరకు పరీక్ష నిర్వహించాలి. ఈ పరీక్ష 20 మార్కులకు ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రశ్నపత్రం ఏరోజుకారోజు మధ్యాహ్నం 3.15 గంటలకు డీఈవో వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సమాధాన పత్రాలను తరగతి ఉపాధ్యాయులే మూల్యాంకనం చేసి ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ప్రత్యేక బోధన చేపట్టాలి. ఇక ఏప్రిల్ 15వ తేదీ నుంచి పది విద్యార్థులకు ప్రీపబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు.
♦వేసవి సెలవులు లేనట్లే
ఈ విద్యా సంవత్సరం సగభాగానికిపైగా కరోనాతో కరిగిపోయింది. ఈ లోటును పూడ్చేందుకు, విద్యార్థులు నష్టపోకుండా చూసేందుకు విద్యాసంవత్సరాన్ని పొడిగించి బోధన చేపట్టంతోపాటు ఇది ముగిసిన వెంటనే వేసవి సెలవులు లేకుండానే తదుపరి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. పది విద్యార్థులకు ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం మే నెలలో పబ్లిక్ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఆ వెంటనే ఫలితాలను విడుదల చేసి జూన్ 12వ తేదీ నుంచి ఎప్పటిలాగే తదుపరి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించవచ్చని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అయితే 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.