శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్ యూజర్లకు ఇకపై రాజకీయ సంబంధిత గ్రూపులను రికమెండ్ చేయబోమని ఈ సోషల్ మీడియా దిగ్గజం ప్రకటించింది. ఈ మేరకు ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకెర్‌బర్డ్ వెల్లడించారు. అమెరికాలో ఇప్పటికే ఈ చర్యలు అమలు చేస్తున్నారు. గతంలో రాజకీయ గొడవల వల్ల ఫేస్‌బుక్ పరపతి క్షీణించింది. మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకునే దిశగా ఈ కంపెనీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సివిక్, పొలిటికల్ గ్రూపులను రికమండేషన్ల జాబితా నుంచి తొలగించాలని భావిస్తున్నట్లు జుకెర్‌బర్గ్ పేర్కొన్నారు. అలాగే ఫేస్‌బుక్‌లో వచ్చే న్యూస్ ఫీడ్ నుంచి కూడా రాజకీయ కంటెంట్‌ను సాధ్యమైనంత తగ్గిస్తామని ఆయన చెప్పారు. ఫేస్‌బుక్ యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జుకెర్‌బర్గ్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించే మెసేజిలు, హింసాత్మక సందేశాలు ప్రబలం కాకుండా ఉండేందుకు ఫేస్‌బుక్ చాలా చర్యలు తీసుకుంది. ఇప్పుటు వీటిని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ నెల 6న యూఎస్ కాపిటోల్‌పై ట్రంప్ అభిమానుల దాడి తర్వాత.. ఈ మాజీ అధ్యక్షుడి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై కొందరు నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.