ఎన్నికల్లో గెలిచేందుకు జాగ్రత్తలు గాలికొదిలారు
రెండో వేవ్ ముందే తెలిసినా సన్నద్ధత లేదు
కుప్పకూలిన ఆరోగ్య మౌలిక సదుపాయాలు
భారత్‌లో కొత్త మ్యూటెంట్లు వస్తే ముప్పే
ఎన్నికల కోసం నిబంధనలను గాలికి వదిలారు
రెండో వేవ్ ప్రమాదకరమని తెలిసీ చర్యలు చేపట్టలేదు
అన్నింటినీ తెరిచి కేసులను పెంచేశారు
వెస్ట్రన్ దేశాల మీడియా కథనాలు
దుమ్మెత్తి పోస్తున్న అంతర్జాతీయ పత్రికలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: నిన్నటిదాకా భారతదేశం ప్రపంచ దేశాల దృష్టిలో కరోనా నుంచి రక్షించే ఒక ఆపన్న హస్తం. మొదట ప్రాణాధార మందులను అందించి, తర్వాత కాలంలో వ్యాక్సిన్లను అందించి, ప్రపంచ మానవాళిని రక్షించడంలో తన పాత్ర పోషిస్తున్న బాధ్యతాయుత దేశంగా భారత్‌ను అందరూ కొనియాడారు. కొద్ది వారాలుగా హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ మీడియా దృష్టిలో భారత్ ఒక బాధ్యతా రహితమైన దేశంగా నిలిచింది. నిన్నటి చైనాలా నేడు మనదేశం బోనులో నిలబడుతోంది. రెండో అల కరోనా ముంచుకొస్తున్న విషయాన్ని గత అక్టోబరులోనే హెచ్చరించినా, భారత ప్రభుత్వం ఎన్నికల జాతరలు, కుంభమేళాలు నిర్వహించి, బడులు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్ తెరచి భౌతిక దూరాన్ని మరచింది. దాంతో 130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం ఒక్కసారిగా కరోనా విపత్తుకు గురుత్వ కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగం భారత్ నుంచే వస్తున్నాయి. మరణాలు కూడా వేల సంఖ్యను దాటిపోయాయి.
ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క రోగులు కారిడార్లలోనే మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్మశాన వాటికల్లో రోజంతా చితిమంటలు ఎగస్తున్నాయి. ఇదంతా ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అంతర్జాతీయ మీడియా కొద్ది రోజులుగా 24 గంటలూ ఒకే విషయాన్ని కవర్ చేస్తోంది. అది భారత్‌లో విజృంభిస్తున్న రెండో అల కరోనా. ఈ దారుణ వైఫల్యానికి ప్రధాని మోదీనే కారకుడిగా నిందిస్తున్నాయి. నిన్నటిదాకా ప్రపంచానికి దారిచూపే ముఖ్యనేతల్లో ఒకరిగా కీర్తి గడించి, ఇప్పుడు పశ్చిమ దేశాల మీడియా దృష్టిలో అత్యంత అసమర్థపాలకుడు అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల భారత్ కరోనా కూపంగా మారిందని, కొత్త కొత్త కరోనా వేరియంట్లు భారత్‌లో పుట్టుకొచ్చి, సరిహద్దులు దాటి ప్రపంచమంతటికీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోనా తీవ్రత ఏంటో ఏడాది కిందటే తెలిసింది. రెండోదశకు ఏడాది సమయం ఉన్నా మోదీ నిర్లక్ష్యం చేశారని విదేశీ మీడియా మండిపడింది. ముందే తెలిసిన రెండో అలను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఎందుకు సన్నద్ధం కాలేక పోయిందో సమాధానం లేదని ఎకనామిస్ట్ వ్యాఖ్యానించింది. కరోనా విషయంలో మోదీ వైఫల్యాలను ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొంది