కొవిడ్‌కు ప్రత్యామ్నాయ చికిత్స ఇదే...

 


కరోనా విపత్తు శాశ్వతంగా సమసిపోవడం, బహుశా, ఇప్పట్లో సంభవించదు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోనందునే ప్రభుత్వం దానిని ఒక్క విడత విలయం మాత్రమేనని భావించి ఆర్థిక వ్యవస్థను యథావిధిగా నిర్వహిస్తూ వచ్చింది. వాక్సినేషన్‌తో ఆ మహమ్మారి అంతమవుతుందని, కాని పక్షంలో గణనీయంగా అదుపులోనైనా ఉంటుందని మన పాలకులు, వైద్యనిపుణులు, ప్రజలు భావించారు. ఈ తరంవారు ఘోరంగా పొరపడిన సందర్భమిది. వాక్సినేషన్ కార్యక్రమాన్ని అతి విస్తృతస్థాయిలో అమలు జరిపేందుకు సర్వ సన్నాహాలు జరుగుతుండగా కరోనా రెండోదఫా విజృంభణ మొదలయింది. అతి తక్కువ రోజుల్లోనే అది ఉగ్రరూపం దాల్చింది. వైద్య నిపుణులు మళ్ళీ లాక్‌డౌన్ విధించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అయితే సాధ్యమైనంతవరకు లాక్‌డౌన్‌ విధించకూడదనే ప్రభుత్వం భావిస్తోంది. నిజం చెప్పాలంటే ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉంది. 

లాక్‌డౌన్ విధిస్తే ఆర్థికవ్యవస్థకు అపార నష్టం వాటిల్లుతుంది. కొవిడ్ బాధితుల మరణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అది విధించని పక్షంలో ఆర్థిక వ్యవస్థకు సంభవించే నష్టాలు తక్కువే కానీ, కొవిడ్ బాధితులు పిట్టల్లా రాలిపోవడం ఖాయం. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే కరోనా రెండోదఫా విజృంభణే చివరి విజృంభణ కాదు, కాబోదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాక్సిన్లు కరోనా వైరస్ భావి రూపాంతరాల నిర్మూలనకు ప్రభావశీలంగా పని చేయలేవు.

మనం కరోనా రెండో విడత విజృంభణతో అల్లాడు తుంటే, కొన్ని దేశాలు ఇప్పటికే మూడు, నాలుగో దఫా విజృంభణ భారినపడి గిలగిలలాడుతున్నాయి. మరింత గమనార్హమైన విషయమేమిటంటే కొవిడ్ వైరస్ వేగంగా ఉత్పరివర్తనం చెందుతోంది. గత జనవరిలోనే ఒక ప్రముఖ సైన్స్ జర్నల్‌లో ఒక ప్రముఖ బ్రిటిష్ నిపుణుడు ఇలా రాశారు: ‘బయోటెక్ కంపెనీ నోవావాక్స్ కరోనా విషక్రిమిపై పోరుకు ఒక ప్రయోగాత్మక వాక్సిన్‌ను రూపొందించింది. ఆ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల సమాచారం ప్రకారం బ్రిటన్‌లో వ్యాపిస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా 85శాతం మేరకు ప్రభావశీలంగా పని చేయగా, దక్షిణాఫ్రికా వేరియంట్ 501 వై.వి2కు వ్యతిరేకంగా 50 శాతం మాత్రమే పని చేసింది’. ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నదేమిటి? ప్రస్తుత కరోనా రకాలను మట్టుబెట్టగల వాక్సిన్లు భావిరకాల కరోనా విషక్రిములను అంత మొందించలేవు. 

మరి మార్గాంతరమేమిటి? అదే, కొవిడ్ మహమ్మారిపై పోరుకు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ విధానం ఫేజ్‌ థెరపీ. బ్యాక్టీరియా ఫేజ్ (బ్యాక్టీరియా భక్షిణి. కంటికి కనిపించనంత చిన్నజీవులను తినే వైరస్ జాతి సూక్ష్మజీవి)నే క్లుప్తంగా ఫేజ్ అంటారు. ఫేజ్‌లు కరోనా మాదరిగా వైరస్‌లు. అయితే ఇవి మేలు చేసే సూక్ష్మజీవులు. అత్యంత లాభదాయకమైనవి. ఆతిథేయి శరీరంలోని రోగకారక బేక్టీరియాను అవి భక్షిస్తాయి. ఈ ఫేజ్‌ల మిశ్రమాన్ని మనం ఒక వాక్సిన్‌గా వాడుకోవచ్చని టర్కీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. వైద్య పరిభాషలో ఇటువంటి మిశ్రమాలను ‘కాక్‌టైల్’ అంటారు. అటువంటి ఒక కాక్‌టైల్ ఇవ్వడం వల్ల వాక్సిన్ తనకు తానుగా రోగి శరీరంలోని బ్యాక్టీరియాను ఎంపిక చేసుకుని భక్షిస్తుందని ఆ నిపుణుడు తెలిపారు. మన రైతులు విత్తనాలను మిశ్రమంగా విత్తడం లాంటిదే ఇది కూడా. నిర్దిష్టమైన అనుకూల వాతావరణ పరిస్థితులలో ఆ విత్తనాలలో కొన్ని మొలకెత్తుతాయి. మిగతావి మట్టిలో కలిసిపోతాయి. 

ఫేజ్‌ల విషయంలో మనకు ఒక ప్రత్యేక అనుకూలత ఉంది. నాగపూర్ లోని ‘నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్’ పరిశోధకులు గంగానదిపై ఒక సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించారు. గంగానది ఎగువ భాగంలోని నదీ జలాల్లో 200 రకాలకు పైగా ఫేజ్‌లు ఉన్నట్టు వారు కనుగొన్నారు. గంగానదితో పోల్చితే యమునా, నర్మదా నదులలో కేవలం 20 నుంచి 50 రకాల ఫేజ్‌లు మాత్రమే ఉన్నాయి. ఒక కాక్‌టైల్ వాక్సిన్‌ను తయారుచేసేందుకు అవసరమైన ఫేజ్‌ల కాక్‌టైల్ మనకు సహజంగా లభ్యమవుతుంది. 

ఉత్తరాఖండ్‌లోని ‘గంగా టుడే ట్రస్ట్’ గంగాజలాలను దేశవ్యాప్తంగా 100 మంది వ్యక్తులకు సరఫరా చేసింది. ఆ జలాలను సేవించగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారిలో 67 శాతం మందికి ఉపశమనం కలిగిందని నిర్ధారణ అయింది. అలాగే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఈ జలాల సేవనం వల్ల ఉపశమనం పొందిన వారి శాతం చెప్పుకోదగిన రీతిలోనే ఉంది. నాడీ సంబంధ వ్యాధిగ్రస్తులు 56 శాతం, జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారిలో 55 శాతం; చర్మవ్యాధులతో బాధపడుతున్నవారిలో 54 శాతం, మూత్రకోశ వ్యాధిగ్రస్థులలో 50 శాతం; కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారిలో 45 శాతం, మధుమేహ వ్యాధిగ్రస్తులలో 40 శాతం, హృద్రోగులలో 36 శాతం, శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారిలో 33 శాతం మంది గంగాజలాలు తాగడం వల్ల ఉపశమనం పొందారు. ప్రతి వ్యాధికి సంబంధించి కనీసం 25 మంది బాధితులకు గంగాజలాలను ఇచ్చారు. వివిధ రోగాలను నిరోధించడంలో గంగానది ఫేజ్‌ల సామర్థ్యం తిరుగులేని విధంగా రుజువయింది.

అమెరికాలోని మేరీలాండ్కు చెందిన ‘అడాప్టివ్ ఫేజ్ థెరపిటిక్స్’ అనే వైద్య సంస్థ ఇప్పటికే ఫేజ్ ఆధారిత వాక్సిన్ నొకదాన్ని రూపొందించింది. అది ఇప్పుడు మొదటి దశ క్లినికల్ పరీక్షల్లో ఉంది. మన దేశంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలకు టీకాలు వేసిన తరువాత పరిస్థితులు సవ్యంగా ఉంటాయని భావించడం శ్రేయస్కరం కాదు. అలా భావించేవారు ఒక భ్రమలో ఉన్నారని నిరాఘాటంగా చెప్పవచ్చు. వైరస్ ఉత్పరివర్తనం చెందుతోంది. అది వాక్సిన్లను ప్రభావరహితం చేసే అవకాశం ఎంతైనాఉంది. కనుక రాబోయే ఘోర పరిస్థితులకు మనం సంసిద్ధమై ఉండాలి. 

ఇప్పటికే మనం చాలాకాలాన్ని వ్యర్థం చేశాం. విదేశీ వాక్సిన్లను తెచ్చుకునేందుకు నానా తంటాలుపడుతున్నాం. అయితే అవి కొన్ని రకాల విషక్రిములపై మాత్రమే వ్యతిరేకంగా పని చేస్తాయి. తాను ఫైజర్ టీకా కోసం వేచి ఉన్నానని ఒక వృద్ధుడు నాతో అన్నారు. అది అందుబాటులోకి వచ్చిన తరువాత మాత్రమే తాను టీకా వేయించుకుంటానని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో చెప్పవచ్చిన దేమిటంటే కొవిడ్‌కు కాక్‌టైల్ ఫేజ్ ఆధారిత వాక్సిన్‌ను రూపొందించేందుకు మనం తక్షణమే పెద్ద ఎత్తున పూనుకోవాలి. 

ఆర్థికవ్యవస్థను యథావిధిగా కొవిడ్ పూర్వపద్ధతులలో నిర్వహించడానికి ప్రభుత్వం స్వస్తి చెప్పాలి. ఇది తప్పనిసరి. భారీ రుణాలు తీసుకుని తన ‘వినియోగం’ కోసం సిబ్బంది జీత భత్యాల కోసం ఉపయోగించడం ప్రభుత్వ విధానంగా ఉంది. కరోనా పాడుకాలం త్వరలో ముగుస్తుందని, ఆర్థికవ్యవస్థ మళ్ళీ శీఘ్ర పురోగమనపథంలోకి ప్రవేశిస్తుందని, రుణాల చెల్లింపు భారం కాబోదనే ఆశాభావం ప్రభుత్వంలో నిండుగా ఉంది. అయితే అలా జరగకపోవచ్చు. రెండోదఫా విజృంభణ వెనువెంటనే మూడోదఫా విజృంభణ ప్రారంభమవచ్చు. మూడో విజృంభణ అనంతరం కూడ కొత్తరకం విషక్రిమి వ్యాపించే అవకాశం ఉన్నది. పరిస్థితులు ఎలా పరిణమించేదీ ఎవరికీ తెలియదు. అంతిమంగా, అన్ని రకాల ఉపద్రవాలకు మనం సదా సంసిద్ధమై ఉండాలి.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad