వణికిస్తున్న కేసులు.. జిల్లా JC కి పాజిటివ్‌గా నిర్ధారణ

24 గంటల్లో 5,086 మందికి

ఒక్కరోజులో 14 మంది మృతి

31వేలు దాటిన యాక్టివ్‌ కేసులు

చిత్తూరు జిల్లాలో అదే ఉధృతి

పశ్చిమగోదావరి జేసీకి పాజిటివ్. 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి వణకు పుట్టిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,741 శాంపిల్స్‌ను పరీక్షిచగా.. 5,086 కేసులు బయటపడినట్టు వైద్యఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 9,42,135కి పెరిగింది. తాజాగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 835 మందికి వైరస్‌ సోకగా.. కర్నూలులో 626, గుంటూరులో 611, శ్రీకాకుళంలో 568, తూర్పుగోదావరిలో 450, విశాఖపట్నంలో 432, కృష్ణాలో 396, అనంతపురంలో 334 కేసులు వెలుగుచూశాయి. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) కె వెంకట రమణారెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక 24 గంటల్లో 14 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో ఐదుగురు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నంలో ఇద్దరేసి చొప్పున, గుంటూరు, కడప, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాలు 7,353కి పెరిగాయి. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం 30 వేలలోపే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. 

కరోనాతో కానిస్టేబుల్‌ మృతి 

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బత్తిపూడి సాంబశివరావు (47) గురువారం కరోనాతో మృతిచెందారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు వేయించుకున్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. గురువారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. 

మధ్యాహ్నం వ్యాక్సిన్‌.. రాత్రి గుండెపోటు

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వృద్ధుడు అదేరోజు రాత్రి గుండెపోటుతో మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మాచర్లకు చెందిన షేక్‌ సైదా (70) ఆజాద్‌నగర్‌ స్కూల్లో బుధవారం మధ్యాహ్నం వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచాడు. వ్యాక్సిన్‌ వలనే సైదా మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

హోంమంత్రి సుచరితకు టీకా 

గుంటూరులోని సాయిభాస్కర్‌ ఆస్పత్రిలో హోంమంత్రి మేకతోటి సుచరిత గురువారం కొవాగ్జిన్‌ టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌ వాడాలని సూచించారు.  

వైసీపీ నేత ఇంటికొచ్చిన వ్యాక్సిన్‌

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ గంగుల వెంకటలక్ష్మి భర్త, వైసీపీ నేత గోపాలకృష్ణ (గోపీయాదవ్‌) ఏఎన్‌ఎంను ఇంటికి పిలిపించుకని వ్యాక్సిన్‌ వేయించున్నారు. ఆయనకు 45 ఏళ్లు కూడా నిండకపోవడం విమర్శలకు దారితీసింది. దీనిపై వెంకటలక్ష్మి వివరణ ఇస్తూ.. తమ బంధువులలో ఒకరికి ఆరోగ్యం బాగుండకపోతే వ్యాక్సినేషన్‌కు ఇంటికి రమ్మన్నామని, పనిలో పనిగా ఆయనకూ టీకా వేయించినట్టు తెలిపారు‌

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad