*♦కరోనాతో 556 మంది మృతి*
*♦కరోనాలోనూ తప్పని విధులతోబలైపోతున్న ఉపాధ్యాయులు*
*♦సెకండ్‌వేవ్‌లోనే 400 మంది మృతి*
*♦వ్యాక్సిన్ ఇవ్వకుండా సర్కారీ విధులు*
*♦కర్ఫ్యూలోనూ తగ్గని పని ఒత్తిడి*
*♦టీచరుతోపాటు కుటుంబాలూ బలి*
*♦వాటి లెక్క ఎంతనేది తేలని వైనం*
*♦ఇవన్నీ సర్కారు నిర్లక్ష్యపు మరణాలే*
*♦ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం*
*♦వ్యాక్సిన్ ముందు... తరువాతే స్కూళ్లు*
*♦హైకోర్టులో పిల్... నేడు విచారణ*
*🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి)*
విధిలేక తప్పనిసరై విధుల్లో పాల్గొంటూ గురువులు కరోనాకు బలి అవుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 556 మంది టీచర్లు కొవిడ్‌బారిన పడి చనిపోయారు. ఇందులో ఒక్క సెకండ్ వేవ్‌లోనే 400 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రమంతా కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తూనే.. ‘పనులు’ ఆగడానికి లేదని పరుగులు పెట్టిస్తుండటమే టీచర్ల ప్రాణాలపైకి తెస్తోంది. ఇన్ని పనులు చేయించుకొంటున్న రాష్ట్ర ప్రభు త్వం.. టీచర్లకు అందాల్సిన వ్యాక్సినేషన్ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. తొలి విడతలోనే వ్యాక్సిన్ డోసులు ఇప్పించడంపై దృష్టి సారించలేదు. దీంతో విధి నిర్వహణలో ఉండగానే కొందరు కొవిడ్ బారినపడి చనిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరణించిన ప్రభుత్వ ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొహం చాటేస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.ఈ సంఘాలు తాజాగా ప్రభుత్వానికి ఇచ్చిన గణాంకాల ప్రకారం.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 556 మంది ఉపాధ్యాయులు మృత్యువాతపడ్డారు. ఇందులో 400 మంది ఒక్క సెకండ్‌వేవ్‌లోనే మరణించారు. ఇంకా లెక్కకురాని మరణాలు 30 నుంచి 40 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. కొన్నిచోట్ల టీచరుతో పాటు కుటుంబసభ్యులు కూడా కరోనా కాటుకు బలయ్యారు. అలాంటివారు ఎంతమంది ఉన్నారనేది లెక్కలు తేలలేదు. కానీ, కరోనా బారినపడిన ఉపాధ్యాయుల కుటుంబాలు మాత్రం కోకొల్లలుగా ఉన్నాయి.
*♦బలిగొంటున్న ‘బలవంతపు’ విధులు*
పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న నాడు-నేడు పనుల్లో ఉపాధ్యాయులను ప్రభుత్వం భాగస్వాములను చేసింది. కర్ఫ్యూ సమయంలోనూ టీచర్లు వెళ్లి ఈ పనుల్లో పాల్గొంటున్నారు. కరోనా మొదటి దశలో విద్యార్థులకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు మాత్రం పాఠశాల హాజరును తప్పనిసరి చేసింది. కోట్లాదిమంది ఓటర్లు, వేలాదిమంది సిబ్బందితో ముడిపడిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉపాధ్యాయులే ఎక్కువగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కరోనాబారినపడి పలువురు ఉపాధ్యాయులు మరణించారు. ఫార్మెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆదేశించింది. అయితే, శాఖ రూపొందించిన సర్వర్లు చాలా ప్రాంతాల్లో పనిచేయడం లేదు. దీంతో ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి మార్కులు ఎంటర్ చేసే పనులు చేస్తున్న హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయుల్లో కొందరు కరోనాకు గురయి చనిపోయారు. కరోనావేళ కూడా పాఠశాలల్లో బయోమెట్రిక్ నమోదు, టాయిలెట్స్ ఫొటోలు అప్‌లోడు వంటి విధుల్లో పాల్గొంటూ మరికొందరు టీచర్లు కొవిడ్‌కు బలయ్యారు. ఇక విద్యా సంబంధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను అందిస్తూ ఇంకొందరు వైరస్ సోకి చనిపోయారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరినీ ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించాలనేది చాలా పాత డిమాండ్. 45 ఏళ్ల వయస్సు నిబంధనతో సంబంధంలేకుండా వ్యాక్సిన్ వేయించాలన్నా సర్కారు చెవిన పెట్టలేదు. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ వేయకుండా పాఠశాలలు ప్రారంభిస్తే కరోనా వారియర్స్‌గా కాక.. కరోనా క్యారియర్స్‌గా మారే అవకాశం ఉందని పలువురు భయపడుతున్నారు. అంతేకాదు, ఉపాధ్యాయులను హైరిస్క్ కేటగిరీలో చేర్చి, తొలి దశలోనే వ్యాక్సిన్ వేసి ఉంటే ఇంత మంది చనిపోయేవారు కాదని వాపోతున్నారు. వ్యాక్సిన్ వేయకుండానే ప్రభుత్వం ఎన్నికల విధులకు సైతం వినియోగించుకున్నదని మండిపడుతున్నారు. ఇంత జరిగినా, ప్రభుత్వంలోకానీ పాఠశాల విద్యాశాఖలో కానీ టీచర్ల మరణాలపై చలనంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, అనవసర కదలికలే ఇంతమందిని బలి తీసుకొన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
*♦కుటుంబాలకేదీ భరోసా!*
రాష్ట్రంలో ‘అందరికీ భరోసా’ కల్పిస్తామని చెప్పుకునే ప్రభుత్వం.. కరోనాతో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను దాదాపుగా గాలికొదిలేసింది. కనీసం మాటామంతీ కూడాలేకుండా ప్రవర్తించిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు పాఠశాల విద్యాశాఖ మరణించిన కుటుంబాలకు కనీసభరోసా కూడా కల్పించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మరణించిన ఉపాధ్యాయుల జాబితాలను ప్రభుత్వానికి అందజేశాయి. వారి కుటుంబాలను ఆదుకోవాలని పదేపదే కోరుతున్నాయి. అయినా, జరిగిందేమీ లేదు. చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు అందాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్, ఇతర అంశాలను కూడా పట్టించుకోలేదు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్న ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులను పెడచెవిన పెట్టింది. దీంతో ‘మాగోడు పట్టించుకునేవారే లేరా?’ అని పలువురు టీచర్లు వాపోతున్నారు.
*♦బాబోయ్ బడులొద్దు..*
జూన్ ఒకటి నుంచి ఉపాధ్యాయులు స్కూల్‌కి రావాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం ఆ నెలలోనే టెన్త్ పరీక్షలు జరగాలి. మరోవైపు మూడో వేవ్‌పై వైద్యులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఇది పిల్లలపైనే ఎక్కువగా దాడిచేస్తుందనీ అంచనా వేస్తున్నారు. అదేసమయంలో 45 ఏళ్ల లోపు టీచర్లు ఎందరో ఉన్నారు. వారికి ఇంకా వ్యాక్సినేషనే ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితుల్లో స్కూళ్లకు ఎలా హాజరు కావాలని పలువురు టీచర్లు భయపడుతున్నారు.
*♦ఢిల్లీని చూసి నేర్చుకోలేమా?*
కరోనాతో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ‘‘మనకు చలనంలేదు సరే.. కనీసం పక్క రాష్ట్రాలను చూసైనా ప్రభుత్వంలో చలనం రాదా? స్పందించదా?’ అనే ఆవేదన గురువుల్లో వ్యక్తం అవుతోంది. గంటకో ఉత్తర్వు అడ్డదిడ్డంగా ఇచ్చి, గజిబిజిగా పని ఒత్తిడి పెంచే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు.. ఉపాధ్యాయులు విపత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టదా అని పలువురు ఉపాధ్యాయులు నిలదీస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రవర్తన తీరు కూడా కరోనా వేళ విమర్శలకు గురవుతోంది.
*♦రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి*
‘‘కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా అందాల్సిన ప్రయోజనాలు వెంటనే చేరేలా చూడాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి. కుటుంబంలో ఉపాధ్యాయ అర్హత ఉన్నవారు ఉంటే నిబంధనలు సడలించి ఉపాధ్యాయులుగా నియమించాలి’’
జీవి నారాయణరెడ్డి, నరహరి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ సమాఖ్య అధ్యక్షుడు, కార్యదర్శి
*♦ప్రతిపాదనలను 15 రోజుల్లో పంపాలి: ఎమ్మెల్సీ కత్తి*
కొవిడ్, ఇతర వ్యాధుల కారణంగా మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు చెల్లించాల్సిన ఫ్యామిలీ పెన్షన్, పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ తదితర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ప్రతిపాదనలను 15 రోజుల్లోనే పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటన చేశారు. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు జాప్యం లేకుండా ఆర్థిక ప్రయోజనాలను అందించాలంటూ తాను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానన్నారు. దానిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
*♦కరోనాతో మరణించిన టీచర్ల జాబితా*
*♦జిల్లా పేరు కరోనాతో మరణించిన ఉపాధ్యాయుల సంఖ్య*
శ్రీకాకుళం 57
విజయనగరం 31
విశాఖపట్నం 68
తూర్పుగోదావరి 49
పశ్చిమగోదావరి 70
కృష్ణా 36
గుంటూరు 55
ప్రకాశం 13
నెల్లూరు 30
చిత్తూరు 55
కర్నూలు 44
కడప 42
అనంతపురం 28
మొత్తం 578
*♦వ్యాక్సిన్ ముందు... తరువాతే స్కూళ్లు*
*♦హైకోర్టులో పిల్... నేడు విచారణ*
రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడానికి ముందు ఉపాధ్యాయులు అందరికీ కొవిడ్ వ్యాక్సిన్లు వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు వై.ఉమాశంకర్ ఈ వ్యాజ్యం వేశారు. ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ఇవ్వకుండా జూన్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభించడంతో పాటు జూన్ 7న 10 పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని వ్యాజ్యంలో కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కొవిడ్ నిర్వహణ - వ్యాక్సిన్ విభాగం ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీ రమేశ్, జస్టిస్ కే సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.