ఇంట్లోనే సొంతంగా కరోనా టెస్ట్.. కొత్త కిట్‌కు ICMR అనుమతి.. ఎలా పనిచేస్తుందంటే..

 


ప్రస్తుతం కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే సమీపంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలి. ప్రభుత్వాస్పత్రిలో పరిమిత సంఖ్యలోనే టెస్ట్‌లు చేస్తున్నారు. ప్రైవేట్‌కు వెళ్దామంటే వేలకు వేలు వసూలు చేస్తున్నారు. మరోవైపు టెస్ట్‌ల కోసం వచ్చే వారిని చూసి చాలా మంది భయపడుతున్నారు. లేని వైరస్ కూడా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఐతే ఇక నుంచి ఈ బాధలు ఉండవు. ఇంటి వద్దే మనమే కరోనా టెస్ట్ చేసుకునే కిట్ వచ్చేసింది.

ఇంటి వద్దే కరోనా టెస్ట్ చేసుకునే సరికొత్త కిట్‌కు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానిని ఎవరు వాడాలి? ఎలా వాడాలి? రిపోర్టులు ఎలా వస్తాయి? వంటి వివరాలతో మార్గదర్శకాలు విడుదల చేసింది.

కోవిసెల్ఫ్ టీఎం (ప్యాథోక్యాచ్) కోవిడ్19 ఓటీసీ యాంటిజెన్ ఎల్ఎఫ్ అనే కరోనా కిట్‌ను పుణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. మొబైల్ యాప్ సాయంతో ఇది పనిచేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లో ఆ యాప్ అందుబాటులో ఉంది.

టెస్ట్ కిట్‌లో ఉన్న పరికరాలతో మ్యానువల్‌లో చెప్పిన విధంగా టెస్ట్ చేసువాలి. ఆ టెస్ట్ ట్రిప్‌ను మొబైల్ కెమెరాతో ఫొటో తీయాలి. ఆ ఫొటోను మీ వివరాలతో సదరు యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. టెస్ట్ స్ట్రిప్‌ను అనలైజ్ చేసిన తర్వాత కరోనా పాజిటివా? నెగెటివా? అనే వివరాలతో రిపోర్టు చూపిస్తుంది

యాప్ సర్వర్ ద్వారా ఆ వివరాలను కేంద్ర, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ సేకరిస్తుంది. పాజిటివ్ వచ్చిన వారి వివరాలను ఆ రోజు కరోనా బాధితుల జాబితాలో చేర్చుతుంది. అన్ని వివరాలను గోప్యంగానే ఉంచుతారు. అంతేకాదు ఆరోగ్య సిబ్బంది కాల్ చేసి.. హోమ్ ఐసోలేషన్‌లో ఎలాంటి మందులు తీసుకోవాలో సవివరంగా చెబుతారు. 

కేవలం లక్షణాలున్న వారు, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులను కలిసిన వారు మాత్రమే పరీక్షలు చేసుకోవాలని ఐసీఎంఆర్ తెలిపింది. అనవసరంగా టెస్ట్‌లు చేయించుకోకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ లక్షణాలున్నప్పటికీ .. ఈ టెస్ట్‌లో నెగెటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం మేలు అని వెల్లడించింది. 

ఐతే ఈ కిట్ మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశముంది. టెస్ట్ కిట్‌లో ఏమేం ఉంటాయి? రిపోర్టు ఇచ్చే ఆ యాప్ ఏంటి? టెస్ట్ కిట్ ధర ఎంత? అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ కిట్ అందుబాటులోకి వస్తే టెస్ట్‌లు మరింత వేగవంతం కానున్నాయి. 


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad