స్కూళ్లు, అంగన్‌వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదు

 

ఏ ఒక్కరినీ తొలగించం.. 

ఏ అంగన్‌వాడీ కేంద్రాన్నీ మూసేయం: సీఎం

నూతన విద్యావిధానం అమలుకు కార్యాచరణ

రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాటు 

మండలానికి ఒకటి, రెండు జూనియర్‌ కాలేజీలు 

ఆట స్థలం లేని స్కూళ్లకు భూమి కొనుగోలు

జూలై 1నుంచి రెండోదశ ‘నాడు-నేడు’ పనులు: సీఎం 

నేడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల! 

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒక్క అంగన్‌వాడీ సెంటర్‌నూ మూసేయం, ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని సీఎం జగన్‌ స్పష్టంచేశారు. ఒక్క పాఠశాల కూడా మూతపడదని, ఒక్క ఉపాధ్యాయుణ్నీ తీసేయడం లేదని భరోసా ఇచ్చారు. విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో ‘నాడు-నేడు’తో పాటు నూతన విద్యావిధానంపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలు కోసం కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నూతన విధానం వల్ల ఉపాధ్యాయులు, ప్రస్తుత, భవిష్యత్‌ తరాలకు మేలు జరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ విధానంలో భాగంగా మండలానికి ఒకటి, రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా చూడాలన్నారు. ఆట స్థలం లేని పాఠశాలలకు నాడు-నేడు కింద భూమి కొనుగోలు చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ప్రస్తుత విద్యా కానుకలో ఇస్తున్న దానికంటే అదానంగా క్రీడా దుస్తులు, బూట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ‘

‘స్కూళ్లు, అంగన్‌వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదు. ఒక్క సెంటర్‌ను కూడా మూసేయడం లేదు. ఈ రెండు అంశాలు పరిగణనలోకి తీసుకునే మార్పులు చేస్తున్నాం. రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యం. పీపీ-1, పీపీ-2, ప్రిపరేటరీ క్లాస్‌, ఒకటి, రెండు తరగతుల వారందరికీ కిలోమీటరు పరిధి లోపు స్కూలు ఉంటుంది. మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి 10వ తరగతి వరకు సమీపంలోనే ఉన్న హైస్కూల్‌ పరిధిలోకి తీసుకురావాలి. ఆ స్కూలు కూడా కేవలం 3 కి.మీ. పరిధిలో ఉండాలి. ఉపాధ్యాయుడు, విద్యార్థి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండటం ఈ విధానం ప్రధాన ఉద్దేశం. నలుగురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే టీచర్‌ ఉండటం సరి కాదు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం కూడా సరికాదు. ఫౌండేషన్‌ కోర్సులో ఇది చాలా అవసరం. ఎందుకంటే 8ఏళ్లలోపు పిల్లల మానసిక వికాసం చాలా అవసరం. వారి నైపుణ్యాలను మెరుగుపర్చడానికి విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులు ఉండాలి. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్‌(ఎన్‌ఈపీ) ప్రకారం నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన మన లక్ష్యం. ఈ మేరకు పిల్లలకు విద్య అందించేదిగా మన విద్యా విధానం ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉపాధ్యాయులకు, పిల్లలకు కూడా మంచి జరుగుతుందని వివరించండి..’’ అని అధికారులను సీఎం ఆదేశించారు. ‘‘నూతన విద్యావిధానంలో ఒక్క స్కూల్‌ మూతపడటం లేదు. ఒక్క ఉపాధ్యాయుడ్ని కూడా తీసేయడం లేదు. అంతిమంగా అదే సందేశం పోవాలి. 

ఇంగ్లీషు మీడియంలో చెప్పాలని ఆరాటపడుతున్నాం. పిల్లలకు మంచి విద్య అందించాలని తపన పడుతున్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నాం. ముందు తరాలకు మేలు జరిగేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. ఇదే విషయాన్ని చెప్పండి. నూతన విద్యా విధానంపై అందరిలో అవగాహన, చైతన్యం కలిగించండి. వచ్చే సమావేశానికల్లా నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, అయ్యే ఖర్చుపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. రెండేళ్లలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలి’’.. అని సీఎం ఆదేశించారు. 

‘‘అంగన్‌వాడీలు కూడా ‘నాడు-నేడు’ లో భాగం. దీనికి కూడా ఒక యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించండి. 2 సంవత్సరాల్లోపు అనుకున్న కాన్సెప్ట్‌ పూర్తి కావాలి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాల్లో సమూల మార్పు తీసుకొస్తున్నాం. జూలై 1 నుంచి రెండో విడత ‘నాడు-నేడు’ ప్రారంభించాలి. కేంద్రం ప్రవేశపెట్టిన ఫౌండేషన్‌ స్కూల్‌ కాన్సె్‌ప్టను అందరూ ఫాలో అవ్వాలి’’ అని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో ప్రయోగశాలలు, లైబ్రరీలు బలోపేతం చేసుకోవాలని, లైబ్రరీల్లో మంచి ఇంటర్నెట్‌ సదుపాయం అందించాలన్నారు.. స్కూళ్లలో నాడు-నేడుపై తెలంగాణ అధికారులు సంప్రదించారని విద్యాశాఖ అధికారులు చెప్పగా.. తెలుగువారు ఎక్కడున్నా వారికి మంచి జరగాలన్నారు. విద్యాకానుకలో భాగంగా ఇవ్వనున్న డిక్షనరీని అధికారులు సీఎంకు చూపించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌, మహిళ, శిశు సంక్షేమశాఖా మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad