పిల్లలిక్కడ.. బడి ఎక్కడో!


మూడో క్లాసు చదువులకు 3 కి.మీ. నడక

ఊళ్లో ప్రాథమిక పాఠశాలలో చదివే పిల్లాడిని సెకండరీ స్కూలు బాట పట్టించడంవల్లే ఈ కష్టం

రాష్ట్రంలో భారీఎత్తున తరగతుల విలీనం

అంగన్‌వాడీలనూ కలిపేసి ఫౌండేషన్‌ స్కూళ్లు

చాలాచోట్ల కనుమరుగుకానున్న ఈ కేంద్రాలు

రాష్ట్రంలో 24వేల ప్రైమరీ స్కూళ్లు మూత

పిల్లల్లో భారీగా పెరిగిపోనున్న డ్రాపౌట్స్‌ 

‘ఒకే విధానం’తో మున్సిపల్‌ విద్యకు గ్రహణం

నూతన విద్యా విధానం అమలైతే జరిగేదిదే

విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా నిర్ణయం

కొన్ని విషయాల్లో జాతీయ విధానానికీ వ్యతిరేకమే

సర్కారు ఏకపక్ష ధోరణి పై సర్వత్రా ఆందోళన

చట్టం చెబుతున్నదిదీ..

విద్యా హక్కు చట్టం ప్రకారం .. ప్రతి కిలో మీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి. ప్రతి మూడు కిలో మీటర్ల పరిధిలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం చూస్తే ..3 , 4, 5 తరగతుల విద్యార్థులు కూడా ఐదు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రభుత్వ విధానం.. విద్యాహక్కు చట్టానికి పూర్తి విరుద్ధంగా ఉన్నదన్న విమర్శలు ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

నూతన విద్యావిధానం రాష్ట్రంలో కనీస విద్యను అందుకోడానికి పిల్లలు పడుతున్న కష్టానికి.. కొత్తగా ‘దూరాన్నీ’ తెచ్చిపెట్టింది. పరిమితికి మించిన భారంతో ఇప్పటికే తరగతి గదులు చాలడం లేదు. ఈ పరిస్థితుల్లో హేతుబద్ధత లేకుండా ప్రభుత్వం తలపెట్టే తరగతుల విలీన ప్రక్రియతో మొత్తంగా పాఠశాల విద్య ప్రమాదంలో పడినట్టేనని విద్యానిపుణులు ఆందోళన చెందుతున్నారు. విలీనంలోభాగంగా కొత్తగా జతచేసే తరగతులకు గదులను కేటాయించే సామర్థ్యం సెకండరీ స్కూలు భవనాలకు ఉందా? మూడో తరగతి చదివే ఎనిమిదేళ్ల పిల్లాడు మూడు కిలోమీటర్ల దూరంలోని ఈ స్కూలుకు రోజూ వెళ్లి రాగలడా?... ఇవేవీ ఆలోచించకుండానే నూతన విద్యా విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాతృభాషకు ఈ విధానంలో కేంద్రం పెద్దపీట వేస్తే.. రాష్ట్రంలో మాత్రం కేవలం ‘మండలానికి’ తెలుగు మాధ్యమాన్ని కుదించేయడం కొసమెరుపు!

(అమరావతి - ఆంధ్ర జ్యోతి)

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా  విధానాన్ని ఎలాంటి సంప్రదింపులు లేకుండా, హడావిడిగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లక్షలాది మంది పిల్లలు, ఉపాధ్యాయులతో ముడిపడిఉన్న ఈ అంశంపై సంస్కరణల పేరుతో ఏకపక్షధోరణితో అడుగులు వేయడం సరికొత్త గందరగోళానికి తెరలేపింది. దీనివల్ల ప్రాథమిక విద్యకు చిన్నారులు దూరం కావడమో లేక చదువుకోడానికి రోజూ దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడమో జరుగుతుందని విద్యానిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రైమరీని అంగన్‌వాడీల్లో పూర్తి చేసి ఐదేళ్లు రాగానే విద్యార్థి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరతాడు. 

1 నుంచి ఐదో తరగతి వరకు అక్కడ చదువుతాడు. ఆరో తరగతిలో సెకండరీ స్కూలులో చేరి అక్కడే పదో తరగతి వరకు చదువుతాడు. అయితే, నూతన విద్యా విధానం ప్రకారం, రాష్ట్రంలో ఇప్పుడున్నట్టు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు కనిపించవు. ప్రీప్రైమరీ, ఫౌండేషన్‌, సెకండరీ స్కూళ్లు మాత్రమే ఉంటాయి. పీపీ-1, పీపీ-2లు.. వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లుగా పనిచేస్తాయి. ప్రిపరేటరీ-1, 1వ తరగతి, 2వ తరగతులు ఫౌండేషన్‌ స్కూళ్లలో బోధిస్తారు. మూడో తరగతికే విద్యార్థి సెకండరీ స్కూలు బాట పడతాడు. అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రాథమిక స్కూళ్లలో అనుసంధానం చేస్తారు. ఒకే ప్రాంగణం లేక ఒకే భవనంలో ఇవి ఉండేలా చేసి, వాటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా పరిగణిస్తారు. కిలోమీటరు పరిధిలో ఓ ఫౌండేషన్‌ స్కూలు ఉండేలా చూస్తారు. అంటే ఇప్పటివరకు ఉన్న అంగన్‌వాడీ సెంటర్లు కనుమరుగు కానున్నాయి. తరగతుల విలీనం కారణంగా భారీగా ప్రాథమిక పాఠశాలలు కూడా మూతపడనున్నాయి. 

స్కూళ్ల సామర్థ్యం సరిపోతుందా?

అధికారిక లెక్కలప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 34 వేలప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. నూతన విధానం అమల్లోకి వస్తే వీటి సంఖ్య 10 వేలకు తగ్గిపోతుంది. అంటే ఏకంగా 24వేల ప్రైమరీ స్కూళ్లు మూతపడతాయి. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులు ఇకపై సమీపంలోని ప్రాథమికోన్నత లేక ఉన్నత పాఠశాలలకు వెళ్లాలి. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రాథమికోన్నత లేక ఉన్నత పాఠశాలను గుర్తిస్తారు. అంటే మూడో తరగతి విద్యార్థి ఇకపై కనీసం మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈవిధానం వల్ల పెద్ద ఎత్తున పిల్లలు డ్రాపవుట్స్‌గా మారే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల లేదు. అంతకన్నా ముఖ్యం కొత్తగా జతగూడే 3,4,5 తరగతుల విద్యార్థులను తట్టుకొనే సామర్థ్యం ప్రస్తుతం ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఉన్నదా అనేది చూడాలి. విద్యార్థుల సంఖ్యకు తగిన తరగతి గదులు సరిపడా ఉన్నాయో చూసుకోవాలి. ఇలాంటి అంశాలేవీ పరిశీలించకుండానే ఈ విద్యాసంవత్సరం నుంచే నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఆదేశించింది. 

విద్యా పథకాలు గల్లంతేనా?

అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద తదితర విద్యా పథకాలను ఇప్పటికే అమలు చేస్తోన్న ప్రభుత్వం... నూతన విద్యావిధానంలో భాగంగానే వాటిని చేపట్టినట్లు తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొనడం గమనార్హం. అయితే, తాజా నిర్ణయాల వల్ల అసలు విద్యా పథకాలలక్ష్యం నెరవేరుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటివరకు అంగన్‌వాడీ టీచర్లు శిశు సంక్షేమ శాఖ పరిధిలో,  స్కూల్‌ టీచర్లు పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్నారు. ఇకపై వీరిద్దరూ ఒకే వ్యవస్థలోకి రావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు సర్వీసు నిబంధనలు, పర్యవేక్షణ ఎలా అన్న విషయంలో స్పష్టత లేదు. 

పిల్లల మనసుపై ప్రభావం.. 

మూడో తరగతి చిన్నారులు అప్పటిదాకా చదివిన ప్రాథమిక పాఠశాలను వదిలేసి.. ఎక్కడో దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. పైతరగతుల/ఎక్కువ వయస్సున్న విద్యార్థులతో కలిసి వెళ్లి రావాల్సిరావడంవల్ల వారు మానసికంగా ఇబ్బంది పడతారు. ఏదైనా ఒక కొత్త విధానాన్ని అమలు చేయబోయేముందు అన్ని కోణాల్లో ఆలోచన చేయాలి. విద్యావేత్తలు, విద్యా నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరపాలి. కానీ ఎలాంటి చర్చలు జరపకుండా, అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా ముందుకెళ్లే సర్కారు ధోరణి, అంతిమంగా ప్రాథమిక విద్యా రంగాన్ని ప్రమాదంలో పడేస్తుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. 

పట్టణ విద్యకూ దెబ్బే..

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విద్యారంగంలో సంస్కరణలు పురపాలక విద్యా వ్యవస్థకు మేలు చేకూర్చకపోగా చేటు కలిగించే ప్రమాదం ఉందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ, పట్టణ విద్యా రంగాల లక్ష్యాలు, ఆకాంక్షలు వేరుగా ఉన్నప్పటికీ రాష్ట్ర విద్యా శాఖ మాత్రం రెండింటికీ ఒకటే విధానాన్ని ప్రతిపాదించడం సరికాదని పేర్కొంటున్నారు. మండలానికి 2 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర నూతన విద్యా విధానం అమలైతే, గ్రామీణ ప్రాంతాల్లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు రూపాంతరం చెందుతాయే తప్ప నగరం, పట్టణాల్లో సగటున ఉండే 10 నుంచి 15 ఉన్నత పాఠశాలల్లో ఏవీ జూనియర్‌ కళాశాలలు కాలేవని అంటున్నారు.

పైగా మున్సిపల్‌ హైస్కూళ్ల నుంచి ఉత్తీర్ణులైన పేదవిద్యార్థుల్లో అత్యధికులు పై చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నూతన విద్యా విధానం ప్రకారం ప్రాథమిక తరగతులైన 3, 4, 5 లను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం పట్టణాల్లో కష్టమని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు తమ ఇళ్లకు దగ్గర్లోని ప్రాథమిక పాఠశాలలకు సులభంగా వచ్చి వెళ్తున్న చిన్నారులు ముఖ్యంగా ఆడపిల్లలు కిలోమీటర్ల దూరంలో ఉండే హైస్కూళ్లకు నిత్యం రాకపోకలు సాగించడం అసాధ్యమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ఒక్కసారిగా ఉన్నత పాఠశాలలకు పెద్దసంఖ్యలో జతయ్యే 3, 4, 5 తరగతుల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హైస్కూళ్లలో వసతులు సమకూర్చడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. 

కేంద్ర  విధానానికీ వ్యతిరేకమే..

ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని నూతన జాతీయ విద్యా విధానం విస్పష్టంగా పేర్కొంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ ఆంగ్ల మాధ్యమం దిశగానే వెళుతోంది. మండలానికి ఒక్క పాఠశాల చొప్పున తెలుగు మాధ్యమం పెడతామని చెబుతోంది. మిగిలిన అన్ని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియమే. ఇది నూతన విద్యా విధానం స్ఫూర్తిని నీరుగార్చడమేనని నిపుణులు చెబుతున్నారు. 

విద్యార్థులకు సరిపడా టీచర్లు ఉన్నారా?

తరగతులను విలీనంచేసే ప్రక్రియ మొదలైతే అనివార్యంగా టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు కూడా చేపట్టే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎలిమెంటరీ స్కూళ్లలో 1: 30 నిష్పత్తిలో, హైస్కూళ్లలో 1:40 నిష్పత్తిలో టీచర్లు-విద్యార్థులు ఉండేలా సర్కారు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ లెక్కన చూస్తే  ప్రస్తుతం ఉన్న 26 వేల టీచర్ల ఖాళీలు కూడా పోతాయి. గత విద్యాసంవత్సరంలో అదనంగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వపాఠశాలల్లో చేరినట్లు ప్రభుత్వం అధికారికంగానే చెప్పింది.  అ లెక్కన కొత్తగా దాదాపు 15 వేల టీచర్లను నియమించాల్సిన అవసరం ఉంది.  కానీ ప్రభుత్వ వైఖరి చూస్తే భవిష్యత్తులో అసలు నియామకాలు చేపట్టే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం లక్షలాది మంది ఔత్సాహిక అభ్యర్థులు  ఎదురు చూస్తున్నారు. వారికి ఈ పరిణామం కోలుకోలేని దెబ్బే!

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad