చిన్న పిల్లల్లో కరోనాపై డీజీహెచ్‌ఎస్ మార్గదర్శకాలు
ఐదేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అవసరం లేదు!
పిల్లల్లోనూ వైరస్ నాలుగు దశల్లో ఉంటుంది
►పిల్లల్లో కోవిడ్–19 వస్తే... తీవ్రతను తెలుసుకునేందుకు ముఖ్యంగా వారు శ్వాస తీసుకునే విధానం పరిశీలించాలి.
►సాధారణంగా తీసుకునేదాని కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తిస్తే సమస్య ఉన్నట్లేనని భావించవచ్చు.
►పిల్లల్లోనూ అసింప్టమాటిక్ (లక్షణాలు లేకపోవడం), మైల్డ్ (కొద్దిగా), మోడరేట్ (మధ్యస్థాయి), సివియర్ (తీవ్రం) అనే నాలుగు దశలు ఉంటాయి.
►పిల్లల విషయంలో సీటీ స్కాన్‌కు బదులుగా చెస్ట్ ఎక్స్‌రేతో పరిస్థితిని సమీక్షించవచ్చు.
►పిల్లల్లో కోవిడ్–19 వస్తే... తీవ్రతను తెలుసుకునేందుకు ముఖ్యంగా వారు శ్వాస తీసుకునే విధానం పరిశీలించాలి.
►సాధారణంగా తీసుకునేదాని కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తిస్తే సమస్య ఉన్నట్లేనని భావించవచ్చు.
►పిల్లల్లోనూ అసింప్టమాటిక్ (లక్షణాలు లేకపోవడం), మైల్డ్ (కొద్దిగా), మోడరేట్ (మధ్యస్థాయి), సివియర్ (తీవ్రం) అనే నాలుగు దశలు ఉంటాయి.
►పిల్లల విషయంలో సీటీ స్కాన్‌కు బదులుగా చెస్ట్ ఎక్స్‌రేతో పరిస్థితిని సమీక్షించవచ్చు.
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు కోవిడ్–19తో పెద్ద ప్రమాదం లేదు. అయినప్పటికీ అలక్ష్యం, అలసత్వం కూడదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) సూచిస్తోంది. కోవిడ్–19 పెద్దలతో పాటు పిల్లల్లో కూడా వ్యాప్తి చెందుతోంది. అయితే పెద్దలతో పోలిస్తే పిల్లల్లో దుష్ప్రభావాలు అతి తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం 18 సంవత్సరాలు పైబడిన వారికి ప్రభుత్వం వ్యాక్సిన్ ఇస్తూ వారికి రక్షణ కల్పిస్తోంది. కానీ ఆలోపు వయసున్న వారికి టీకాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలకు కరోనా సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స, సూచనలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీజీహెచ్‌ఎస్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రస్తుతం కోవిడ్–19 జాగ్రత్తల్లో ప్రధానమైంది మాస్కు ధరించడం. అయితే ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్కు వినియోగించాల్సిన అవసరం లేదు. వారు మాస్కు సరిగ్గా వేసుకోకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి సమస్యను బయటకు వ్యక్తపరచలేకపోవడంతో కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక ఐదు సంవత్సరాల నుంచి పన్నెండేళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే మాస్కు ధరించాలి. పన్నెండేళ్లు పైబడిన వారంతా పెద్దలతో సమానంగా మాసు్కలు ధరించాలి. ఇక వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేతులు తరచు శుభ్రం చేసుకోవాలి. కరోనా వైరస్ వ్యాప్తి అందరిలో ఒకే రకంగా ఉన్నప్పటికీ ప్రభావం చూపడంలో తేడాలుంటున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువ ప్రభావం చూపుతోంది.
శ్వాసను పరిశీలిస్తుండాలి
పిల్లల్లో కోవిడ్–19 వస్తే.. తీవ్రతను తెలుసుకునేందుకు ముఖ్యంగా వారు శ్వాస తీసుకునే విధానం పరిశీలించాలి. రెండు నెలల్లోపు పిల్లలు నిమిషానికి 60 సార్లు శ్వాస తీసుకుంటారు. 2 నుంచి 12 నెలల్లోపు పిల్లలు 50 సార్లు, ఐదేళ్లలోపు పిల్లలు 40 సార్లు, 5 సంవత్సరాలు పైబడిన వారంతా 30 సార్లు శ్వాస తీసుకుంటారు. సాధారణంగా తీసుకునేదాని కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తిస్తే సమస్య ఉన్నట్లేనని భావించవచ్చు. ఐదు సంవత్సరాలు పైబడినవారు శ్వాస తీసుకునే విధానాన్ని పరిశీలించే ముందు ఆరు నిమిషాల పాటు నడిచిన తర్వాత ఎన్నిసార్లు తీసుకుంటున్నారనేది పరిగణించాలి. రోజుకు మూడుసార్లు ఈ పరీక్ష చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా ఓ ఫార్మాట్‌ను తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఆక్సీమీటర్ ఆధారంగా కూడా ఎస్‌పీఓ2 ను మూడుసార్లు పరిశీలించుకుని నిర్ధారించుకోవాలి.
తల్లిదండ్రులు ఆందోళన పడకూడదు
పిల్లలు కోవిడ్–19 పాజిటివ్‌గా తేలితే తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన పడకూడదు. ప్రస్తుతం కరోనా సోకినవారిలో ఎక్కువమంది సీటీస్కాన్ తీయించి స్కోర్ చూస్తున్నారు. పిల్లల్లో మాత్రం సీటీ స్కాన్‌కు దూరంగా ఉండాలి. చిన్నపిల్లల్లో సాధారణంగా సీటీ స్కాన్‌లో తేడాలు ఉంటాయి. ఎదుగుదల ఆధారంగా వీటిలో మార్పులు నమోదవుతుంటాయి. సీటీకి బదులుగా చెస్ట్ ఎక్స్‌రేతో పరిస్థితిని సమీక్షించవచ్చు.
ఈ లక్షణాలతో జాగ్రత్త
పిల్లల్లో కోవిడ్–19 వచ్చి తగ్గిన రెండు వారాల తర్వాత మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్–సి (మిస్క్))కు అవకాశాలున్నాయి. గణాంకాల పరంగా అతి తక్కువే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ వచ్చి తగ్గిన 2వారాల తర్వాత మూడు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉండడం, శరీరంపైన రాషెస్, కళ్లు ఎరుపుగా ఉండడం, నోట్లో, చేతులు, కాళ్లపైన ఎర్రటి మచ్చలు ఏర్పడడం, బీపీ పడిపోవడం, గుండె సమస్యలు, డయేరియా, వాంతులు, కడుపులో నొప్పి తదితర లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి.
బ్లాక్ ఫంగస్‌కూ అవకాశం
ఆస్పత్రిలో కోవిడ్–19 చికిత్స పొందిన చిన్నారులు అతి తక్కువ మందిలో బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం కూడా ఉంది. పెద్దల్లో మాదిరిగా పిల్లల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిíపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలి. పిల్లల్లో బ్లాక్ ఫంగస్ ప్రభావం ముక్కు, మెదడు, కడుపుల్లో ఉంటుంది. చర్మం నల్లబడడం, దంతాలు వదులు అయ్యి ఊడిపోవడం, కడుపు అప్‌సెట్ కావడం, వాంతులు, విరేచనాలు, పొట్ట భాగంలో వాపు లాంటివి ఈ కోవలోకే వస్తాయి.
నాలుగు దశల్లో ఇలా..
1.అసింప్టమాటిక్: శ్వాస గమనిస్తూ ఉండాలి
కోవిడ్–19 సోకినప్పటికీ అసింప్టమాటిక్‌గా ఉన్న చిన్నారుల్లో శ్వాస తీసుకునే విధానాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తుండాలి. అదేవిధంగా రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
2,మైల్డ్: యాంటీబయోటిక్స్ వద్దు
వీరిలో ఎస్‌పీఓ2 (ఆక్సిజన్ శాచురేషన్ లెవల్) శాతం 94గా ఉంటుంది. ముక్కు కారడంతో పాటు జ్వరం ఉంటే అందుకు తగిన టాబ్లెట్లను వినియోగించాలి. దగ్గు ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిని తాగించే ప్రయత్నం చేయాలి. వీరికి ఎలాంటి యాంటీబయోటిక్స్ వినియోగించొద్దు. వారి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవే„క్షిస్తుండాలి.
3.మోడరేట్: లక్షణాలను బట్టి చికిత్స అవసరం
ఈ దశలోని పిల్లల్లో ఎస్‌పీఓ2 శాతం 90నుంచి 94 మధ్య ఉంటుంది. శ్వాస తీసుకునే విధానాన్ని వయసును బట్టి అంచనా వేయాలి. వీరిలో లక్షణాలకు అనుగుణంగా చికిత్స అందించాలి. జ్వరం, దగ్గు ఉన్నప్పుడు అందుకు సంబంధించిన టాబ్లెట్లు తీసుకోవాలి. అవసరమైతేనే వైద్యుడి సలహా మేరకు ఆస్పత్రిలో చేర్చాలి.
4.సివియర్: ఆస్పత్రిలో చేర్చాల్సిందే
ఈ దశలోని పిల్లల్లో ఎస్‌పీఓ2 శాతం 90 కంటే తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో హోంఐసోలేషన్ కాకుండా తప్పకుండా ఆస్పత్రిల్లో చేర్చాల్సిందే. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత వైద్యులు పరిస్థితికి అనుగుణంగా చికిత్స ఇస్తారు. యాంటిబయాటిక్స్‌ను అవసరాన్ని బట్టి ఇస్తారు.
MSIC తో ఆందోళన అవసరం లేదు
పిల్లల్లో మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (మిస్క్) ఆందోళనకరం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసులు అరుదుగానే ఉన్నాయి. 40 లక్షల మంది కోవిడ్–19 బారిన పడ్డారు. అందులో ప్రతి 11వేల మందిలో ఒకరు మాత్రమే మిస్క్ బారినపడి చనిపోతున్నట్లు అమెరికాకు చెందిన సంస్థల పరిశోధనలు చెబుతున్నాయి.
– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్