Human Lifespan: మన అసలు ఆయుష్షు 150ఏళ్లు.. ఒత్తిడిని జయిస్తే.. ముసలితనాన్ని ఆపగలమా?
Human Lifespan Can Extend : పుట్టినవారు.. గిట్టుక తప్పదు అంటారు. ఈ కలియుగ సృష్టిలో పుట్టిన ప్రతిప్రాణికి ఒక ఎక్స్ పెయిరీ డేట్ ఉంటుంది. ఏదో ఒకరోజు తనువు చాలించాల్సిందే.. వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధిచెందిన ఈ ఆధునిక కాలంలో పుట్టిన మనిషి జీవితకాలాన్ని పొడిగించలేమా? చావును ఆపడం సాధ్యమేనా? అంటే సమాధానం లేని ప్రశ్న.. అసలు అమరత్వం సాధ్యమేనా? మనుషులు దీర్ఘాయువు ఎంతకాలం ఉంటుంది.. అంటే.. ఇప్పుడు మనిషి గరిష్ట జీవితకాలం ఎంత ఉంటుంది అనేదానిపై సింగపూర్ కు చెందిన పరిశోధకుల బృందం ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో మన అసలు ఆయుష్షు ఎంతో ఆధారాలను కనిపెట్టారు.
మన ఆయుష్షు గరిష్టంగా 150ఏళ్ల వరకు ఉంటుందట.. ముసలితనం వేగంపై ఈ పరిశోధక బృందం పరిశోధన చేసింది. మనిషి దీర్ఘాయువు.. 120ఏళ్ల నుంచి 150 ఏళ్ల మధ్య బతుకుతారంటూ సింగపూర్‌కు చెందిన బయోటెక్ కంపెనీ (Gero) పరిశోధకులు చెబుతున్నారు. మరణం అనేది అంతర్గత బయోలాజికల్ అంశంగా పేర్కొన్నారు. అన్నిరకాల ఒత్తిడులను జయించినట్టుయితే మనిషి 150ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించగలరని అధ్యయనంలో రుజువైంది. మనుషుల్లో ఎర్ర రక్త కణాలను కౌంట్ ఆధారంగా అంచనా వేశారు. అమెరికా, బ్రిటన్, రష్యాలో పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి ఆరోగ్య డేటాను సేకరించారు. ఫ్రాన్స్‌కి చెందిన Jeanne Calment 122 ఏళ్లు జీవించాడు. ఈయనే ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి.
మనుషుల్లో వృద్ధాప్యం అన్ని దేశాల్లో ఒకే రకంగా వేగంగా ఉందని గుర్తించారు. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయని పరిశోధక బృందం చెబుతోంది. ఈ పరిణామ క్రమాన్ని అంచనా వేసేందుకు.. పరిశోధకులు రక్త కణాల గణనలో మార్పులు, మనం తీసుకునే రోజువారీ అలవాట్లను పరిశీలించారు. తిమోతి వి పిర్కోవ్ నేతృత్వంలోని పరిశోధక బృందం.. వయస్సు పెరిగేకొద్దీ, వ్యాధి కారకాలతో రక్త కణాలను క్షీణింపచేస్తున్నాయని గుర్తించారు. శరీర సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని గమనించారు. రక్త కణాల క్షీణత ఫలితంగా వేగంగా వృద్ధాప్యం రావడంతో అది మరణానికి దారితీస్తుందని కనుగొన్నారు. రక్తకణాలు తగ్గిపోయే దశ పూర్తిగా ఆగిపోయేటప్పటికి 120 ఏళ్ల నుంచి 150 ఏళ్లు పడుతుందని గుర్తించారు.
ముసలి తనం రావడానికి అసలు కారణం ఇదేనంటున్నారు. ఒక మనిషిలో రక్త కణాల సంఖ్య స్థిరంగా తగ్గడం సాధారణంగా 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య మొదలవుతుందట.. ఒత్తిడి పెరుగుతూ పోతే శరీరం సామర్థ్యం క్రమంగా క్షీణిస్తూ పోతుందని అంటున్నారు. చనిపోయే రక్త కణాల సంఖ్య కన్నా కొత్తగా పుట్టే రక్త కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్ది ఈ సమస్య అధికమవుతుంది. వయసు రీత్యా అనేక వ్యాధులు వస్తుంటాయి. మెడికల్ ట్రీట్‌మెంట్లతో వ్యాధులను తగ్గించి కొంతవరకూ ఆయుష్షును పెంచుకోగలము.. అసలైన వృద్ధాప్యాన్ని ఆపగలిగే థెరపీలు లేవు.. అప్పటివరకూ మరణాన్ని, ముసలితనాన్ని ఆపలేమంటున్నారు పరిశోధకులు.