Online Classes: నేటి నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన

1 నుంచి 10వ తరగతి వరకు 

అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా.. 

మార్గదర్శకాలు జారీచేసిన ఎస్సీఈఆర్టీ 


సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు శనివారం నుంచి (నేటి నుంచి) ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సూచించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు మార్గదర్శకాలు పంపింది. వీటిని అనుసరించి ఆయా జిల్లాల విద్యాధికారులు.. ఉప విద్యాధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు తగిన సూచనలు జారీచేశారు. కోవిడ్‌–19 కారణంగా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు జూన్‌ 30 వరకు వేసవి సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 1 నుంచి 10వ తరగతి వరకు సవివర అకడమిక్‌ క్యాలెండర్‌ను, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ మాధ్యమాలు (దూరదర్శన్, రేడియో, యూట్యూబ్, వాట్సాప్‌ గ్రూప్‌) ద్వారా, పర్సనల్‌ కాంటాక్టు ద్వారా అన్ని తరగతుల వారికి జూన్‌ 12వ తేదీ (నేటినుంచి) ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ సర్క్యులర్‌ పంపింది.

ఈ ఆన్‌లైన్‌ బోధన ద్వారా విద్యార్థులకు అకడమిక్‌ సపోర్టు అందించాలని సూచించింది. ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు తమ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ అన్ని తరగతుల (ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు) విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. శనివారం నుంచి ప్రారంభించే ఈ ఆన్‌లైన్‌ తరగతులకు ఎంతమంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి వచ్చారో అనే విషయాలను ఎంఈవోలకు, ఉప విద్యాధికారులకు ప్రధానోపాధ్యాయులు తెలపాలని నిర్దేశించింది. ఆన్‌లైన్‌ తరగతుల ప్రణాళిక, నిర్వహణ సమాచారాన్ని ఎంఈవోలు, ఉప విద్యాధికారులకు, అక్కడినుంచి రాష్ట్ర కార్యాలయానికి తప్పనిసరిగా తెలపాలని సూచించింది

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad