- ఉపాధ్యాయులకు ఆదాయపు పన్ను మినహాయించాలి
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆపస్ వినతి
(ఉద్యోగులు.న్యూస్)
ఆగస్టు 19- ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ప్రమోషన్లు కల్పించాలని, సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి ఆపస్ విన్నవించింది.ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్ శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బాలాజీ ఆపస్ ముఖ్య ప్రతినిధులతో కలిసి తిరుపతిలో కేంద్ర మంత్రికి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. :ఉపాధ్యాయులను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని, 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రాథమిక విద్య తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలని, ఆదాయ పన్ను నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించరాదని తదితర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తిరుపతికి విచ్చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని ఓ ప్రైవేట్ హోటల్ లో కలసి వినతిపత్రం అందించి ఉపాధ్యాయ సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు.