ఒకసారి పతనం అనేది మొదలయ్యాక, అది వ్యక్తిగత జీవితమైనా, దేశ భవిష్యత్ అయినా సర్వనాశనం కావాల్సిందే.సోవియెట్ రష్యా అండతో ఆఫ్ఘానిస్తాన్ లో 1978లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది . దాని పేరే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘానిస్తాన్ (DRA ) అసలు ఈ పేరుతోనే ఆ పార్టీ విధి విధానాలు కొంత మేర అర్థ చేసుకోవొచ్చు. పేరుకు తగ్గట్టే ఆ పార్టీ స్వేచ్ఛా వాయువులతో దేశాన్ని అభివృద్ధి వైపు పయనింపజేసింది. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి, ఆశ్రయం (ఇళ్ళు ) లక్ష్యంగా ఆ పార్టీ పనిచేసింది.
మతంలో (ఏ మతమైనా ఒక్కటే ) ఉన్న ఛాందస భావాల్నీ, తుక్కునీ, బూజునీ వదిలించుకున్నప్పుడు మాత్రమే మనం అభివృద్ధి వైపు అడుగులు వేయగలం. మతమనేది అభివృద్ధి నిరోధకం. అది ఎప్పుడూ మనల్ని వెనక్కి లాగుతుందే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడనీయదు. ఆడపిల్లలికి చదువు, స్వేచ్ఛ, సమానత్వం వంటి అనేక అంశాలను మతం వ్యతిరేకిస్తుంది. ఇలాంటి చెత్త ఆలోచనలతో మతం మత్తుని తలకెక్కించుకున్న కొందరు ఆఫ్ఘన్ మతోన్మాదులకు కమ్యూనిస్ట్ పాలన సహజంగానే రుచించదు.
కమ్యూనిజం పేరు వింటే...
అగ్నికి ఆజ్యం పోయడానికి దగుల్బాజీ అమెరికా ఎప్పుడూ గోతికాడ నక్కలా కాచుకు కూర్చుంటుంది. ఏ దేశంలో అయినా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే చాలు ఎన్ని కుతంత్రాలు పన్ని అయినా సరే దాన్ని మొగ్గలోనే తుంచి పారేయాలి. కమ్యూనిజం పేరు వింటే పాపం అమెరికాకు అంత హడల్ మరి !!!
అందుకే ఆఫ్ఘనిస్థాన్ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా అఫ్ఘాన్ మతోన్మాదులకు మద్దతుగా నిలిచింది. వారిలో మరింత విషాన్ని నింపింది. ఇస్లాం ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. సోవియెట్ పై తిరగబడింది. కొంత కాలం యుద్ధం తర్వాత రష్యా తన సైన్యాన్ని ఆఫ్ఘాన్ నుంచి ఉపసంహరించుకుంది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల హస్తగతమైంది.
అమెరికా ఏ ఉగ్రవాదానైతే పాలు పోసి పెంచిందో, అది తన మీదే తిరగబడింది. ఫలితంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కుప్పకూలాయి. తను తీసుకున్న గోతిలో తనే పడ్డానని గ్రహించిన అమెరికా తన చేతులతో పెంచిన తాలిబన్లను తుదముట్టించేందుకు కంకణం కట్టుకున్నట్టు (అంతా ఉత్తిదే... ప్రపంచం ముందు నాటకం అంతే. టెర్రరిజం అనేది ఎప్పటికీ బతికే ఉండాలి.లేకపోతే అమెరికాకు మనుగడే ఉండదు) అఫ్ఘాన్ లో పాగా వేసింది.
గత 20 ఏళ్లుగా బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఆఫ్ఘాన్ సైన్యానికి శిక్షణ ఇస్తూ, మొత్తం 3.5 లక్షల మంది, వీరోచితంగా పోరాడగలిగే సైనికుల్ని తయారు చేసిందట. అత్యాధునిక యుద్ధసామగ్రిని సమకూర్చి పెట్టిందట !
అప్పట్లో, రష్యా, మద్దతు, సైన్యం ఉపసంహరించుకున్నా సరే అప్పటి అఫ్ఘాన్ ప్రభుత్వం తాలిబన్లతో మూడు సంవత్సరాలపాటు పోరాడి అమెరికా కుతంత్రానికి ఓడిపోయింది.
కానీ ఇప్పుడు...
అమెరికా సైన్యం వెనుతిరగ్గానే... ఎలాంటి ప్రతిఘటనా లేకుండా అఫ్ఘాన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. తోక ముడిచి పారిపోయింది. ఆనాడు అఫ్ఘాన్ ప్రభుత్వం దగ్గర అంత సైన్యం లేదు, అంతగా యుద్ధ సామగ్రి లేదు అయినా ప్రాణాలకు తెగించి పోరాడింది. ఈనాడు గత 20 ఏళ్లుగా అమెరికా ఆధ్వర్యంలో శిక్షణపొందిన 3.5 లక్షల సైన్యం, అత్యాధునిక యుద్ధ సామగ్రి... అయినా సరే 60-70 వేల మంది తాలిబన్లను ఎదిరించలేక తలోదిక్కుకి పారిపోయారు.
ఎందుకిలా?
ఎందుకంటే.... స్వార్థపూరితమైన అవినీతి పెట్టుబడిదారీ వ్యవస్థకూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాటుపడే సోషలిస్ట్ వ్యవస్థకూ ఉన్న తేడా ఇదే !!
సోషలిస్ట్ భావాలకూ, పెట్టుబడిదారీ ఆలోచనలకూ ఉన్న తేడా ఇదే !!
ఇక మతపరమైన విషయానికి వస్తే... ఆఫ్ఘనిస్థాన్ లో అంతా ఇస్లాం మతస్థులే కదా, అంతా మతాన్ని ఇష్టపడేవాళ్ళే కదా.... మరి ఆ మత భావాలను పరిరక్షించే ధ్యేయంతో పాలన సాగించే తాలిబన్లను చూసి ఎందుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. మతాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మతమనేది శాపంగా ఎలా మారుతుందో వాళ్ళు గతంలో అనుభవించారు కాబట్టే విమానాల రెక్కల కింద దాక్కున్నారు, గాల్లో ఎగురుతున్న విమానం నుంచి కిందికి పడిపోతున్న మనుషుల్ని చూస్తుంటే.... ఏం అనాలో అర్థం కావట్లేదు. ప్రాణం వుంటుందా లేదా అనే ఆలోచన లేదు, ముందు ఈ దేశం నుంచి బయటపడాలి అంతే.
మత రాజ్యం ఎంత ప్రమాదకరమో నేడు ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు చెబుతోంది.
పాఠం నేర్చుకోకపోతే...
దీని నుంచి పాఠం నేర్చుకోకపోతే రేపు మన దేశంలో కూడా ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది.. అఫ్ఘాన్ ప్రజలు మతరాజ్యాన్ని కోరుకోలేదు కానీ భారత ప్రజలు కొందరు, స్వార్థంతో, అజ్ఞానంతో, అమాయకత్వంతో హిందూ మతరాజ్య స్థాపనకు తహతహలాడుతున్నారు. ఊబిలోకి జారకుండా జాగ్రత్త పడాలేగానే అందులోకి కూరుకుపోయాక ఎవ్వరూ కాపాడలేరు.
- మతం అనేది మంచితనాన్ని చంపేస్తుంది.
- మానవత్వాన్ని చంపేస్తుంది,
- ప్రేమను చంపేస్తుంది.
- మన పర అనే సంకుచిత భావాన్ని నింపుతుంది.
- ద్వేషాన్ని, పగను రగిలిస్తుంది.
- మనం మనుషులం అనే స్పృహ లేకుండా చేస్తుంది.
అందుకే ఇప్పుడు మన దేశంలో కొందరు మతోన్మాదులు శరణార్థులుగా మన దేశానికి వచ్చే అఫ్ఘాన్ లకు సాయం చేయకూడదని సిగ్గులేకుండా చెప్పుకోగలుగుతున్నారు.
ఒక్కసారి మతం నుండి బయటికి వచ్చి చూడండి మనమంతా మనుషులం అనే నిజం తెలుస్తుంది
-Vanaja Che