• కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులు క్రమబద్దీకరించాలి
• సచివాలయ ఉద్యోగులను బేషరతుగా క్రమబద్ధీకరించాలి
• ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్
• సీపీఎస్ రద్దు చేయాలి
• ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి కెవీవీ శివారెడ్డి డిమాండ్
సెప్టెంబరు 11: PRC ని 55 % ఫిట్ మెంట్ తో తక్షణం ప్రకటించాలని, 5 డీఏల బకాయిలు తక్షణం విడుదల చేయాలని APNGO రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు శనివారం డిమాండ్ చేశారు. ఏపీన్జీవో రాష్ట్ర నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత అసోసియేషన్ సభ్యులంతా శనివారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చారు .
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే 55శాతం ఫిట్మెంట్తో మెరుగైన పీఆర్ సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు . కొన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఉద్యోగుల జీతాలకు బడ్జెట్ తో ముడి పెట్టకుండా ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరారు . అన్ని అర్హతలతో సచివాలయ ఉద్యోగులుగా చేరిన వారికి అక్టోబర్ 2 నాటికి మళ్లీ పరీక్షలు నిర్వహించడం సరికాదని , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సర్వీసు కమిషన్ నిబంధనలతో ఉద్యోగాల్లోకి వచ్చిన సచివాలయ ఉద్యోగులకు బేషరతుగా పూర్తి స్థాయి హోదా కల్పించాలని డిమాండ్ చేశారు . అవసరమైతే డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించి వారికి పదోన్నతులు కల్పించాలే తప్ప , అన్ని అర్హతలతో ఉద్యోగాలు పొందిన వారికి రెండు సంవత్సరాలు పూర్తెనందున తిరిగి పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులు , పెన్షనర్ల ప్రయోజనాలు పరిరక్షిస్తూ 5 పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు . ఇప్పటి వరకు ఎరియర్స్ పెండింగ్లోనే ఉన్నాయని , ఎటువంటి డిఏ చెల్లించకుండానే పెన్షనర్లు , సర్వీసు ఉద్యోగుల నుంచి ఇన్ కం టాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు.
ఉద్యోగులకు సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ మొదటి వారంలో 55 శాతం ఫిట్ మెంట్ తో మెరుగైన పీఆర్ సీ ప్రకటించి బకాయి డీఏలను విడుదల చేయాలని , కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని సచివాలయ ఉద్యోగులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ఏపీఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు , జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాంలు కోరారు . అనంతరం ఏపీఎన్జీవో ఆధ్వర్యంలో నూతన అధ్యక్ష , కార్యదర్శులకు రాష్ట్ర , కార్యవర్గ సభ్యులకు ఆత్మీయ సత్కారం , అభినందన సన్మానం నిర్వహించారు .
Source: (ఉద్యోగులు.న్యూస్)