పాఠ్యాంశంపై సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు ..
పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్ర విద్య, పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్
ఇబ్రహీంపట్నం, న్యూస్టుడే: మత విద్వేషాలను రిచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ డైరెక్టర్ బి. ప్రతాపరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు మంగ శవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ శ్రీధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అయిదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో గుణదల మేరీమాత ఉత్సవాల గురించి ప్రస్తావన ఉంది. దీనిపై కొందరు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. "బెజవాడలో ప్రసిద్ధి గాంచిన దుర్గమ్మ తెలుగు పాఠాల నుంచి పోయి గుణదల కొత్త మాత వచ్చి చేరింది. అధికారికంగా పిల్లల మెదళ్లలోకి ప్రణాళిక ప్రకారం. ఇతర మతాన్ని ఎక్కిస్తున్నారు. ఆంధ్రా. హిందువుల నుంచి చేజారిపోయింది. . . జరగాల్సిన నష్టం జరిగిపోయింది... సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలి" అని ప్రతాప్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టులు పెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు
దుష్ప్రచారాన్ని ఖండించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
అన్ని మతాల విశిష్టతను వివరిస్తూ ఇతర అంశాల పరిచయం
పాఠ్య పుస్తకాల్లోని 12 పండుగల్లో 8 హిందూ మతానివే
సాక్షి, అమరావతి: పాఠ్య ప్రణాళిక సంస్కరణల్లో భాగంగా కొత్త పాఠ్యపుస్తకాలను అన్ని మతాల పండుగలు, సంప్రదాయాలు, ధర్మ మార్గం విశిష్టతను తెలియచేసేలా వీలైనంత సమగ్రంగా రూపొందించాలని భావించినట్లు పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘బెజవాడ దుర్గమ్మ తెలుగు పాఠాల నుంచి వెళ్లిపోయింది.. గుణదల కొత్తమాత వచ్చి చేరింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదని, 6వ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్నాయని స్పష్టం చేశారు. కొత్త పాఠ్యాంశాలను చేర్చడంలో భాగంగా ఇతర అంశాలను పొందుపరచినట్లు చెప్పారు.
రెండో తరగతి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులకు తెలుగు సంస్కృతిని పరిచయం చేసే క్రమంలో వివిధ మతాల ముఖ్యమైన పండగలను పాఠ్యపుస్తకాల్లో చేర్చినట్లు తెలిపారు. ఇందులో మొత్తం 12 పండుగల్లో హిందూ మతానికి సంబంధించిన 8 ముఖ్యమైన పండుగలు ఉన్నట్లు వివరించారు. మొదటిసారిగా గిరిజనుల పండుగను కూడా పరిచయం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల పండుగలను కూడా పరిచయం చేశామన్నారు. శ్రీకాకుళం సవరల పండుగ, విజయనగరం సిరిమానోత్సవం, నెల్లూరు రొట్టెల పండగ, అహోబిలం పార్వేటలతోపాటు విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలను కూడా పరిచయం చేశామని తెలిపారు. ఇలా వివిధ మతాలు, వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా పాఠ్యపుస్తకాలను ఇంక్లూజివ్‌గా రూపొందించడం ఇదే తొలిసారి అని తెలిపారు. అయితే ఇందులో నుంచి ఒక్కటి మాత్రమే ఎంపిక చేసి హిందూ మతానికి అన్యాయం జరుగుతున్నట్లుగా ట్రోలింగ్ చేయడం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టం చేశారు.