ఆ ఐఏఎస్ సార్ లు అంటే గజగజ...! ఐఏఎస్ అధికారుల ఆగడాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం
- కస్సుబుస్సులు...బండ బూతులు
- ఉద్యోగులు, దిగువ స్థాయి అధికారుల్లో అలజడి
- ముఖ్యమంత్రికి ఫిర్యాదు దిశగా సంఘాలు
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
విద్యాశాఖలో ఒక ఉన్నతాధికారి వైఖరి వివాదమయింది. ఆయన ఇచ్చే సర్య్యులర్ లు , ఉత్తర్వులు ఒకదానితో మరొకటి పొంతన లేకపోవడం, విద్యా విధానాలకు వ్యతిరేకంగా ఉండటంతో ఉపాధ్యాయ లోకం నిరసన స్వరాలు వినిపించింది. ఈ అంశమూ చివరికి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. ఉద్యోగులతో మానవీయంగా వ్యవహరించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ కూడా హితబోధ చేశారు
సెప్టెంబరు 4- ఆంధ్రప్రదేశ్ లో కొందరు ఉన్నతాధికారులు తమ కింద అధికారులు, ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరు వివాదమవుతోంది. వారు ఉపయోగిస్తున్న భాష, వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. కొందరు ఐఏఎస్ లు తెలుగు భాష సరిగా నేర్చుకోపోవడం వల్లో, లేక ఆ భాషా పదాలకు సరైన అర్థాలు తెలియకపోవడం వల్లో, లేక వారి వ్యవహారశైలి వల్లో సభ్య సమాజం కూడా సహించనలేని స్థితిలో ఉద్యోగులు, అధికారులతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇది యావత్ ఉద్యోగులు, కిందిస్థాయి అధికారుల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది.
తాజాగా ఒక జిల్లా కలెక్టర్ కిందిస్థాయి రెవెన్యూ అధికారులతో వ్యవహరించిన తీరు సంచలనమయింది. ఆయన ఉపయోగించిన భాష అధికారిక వ్యవహారాల్లో ఉపయోగించేదేనా అనే అనుమానం కలుగుతోంది. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఒక ఉద్యోగ సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఇది ఒకటి కాదు, ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి...
తూర్పుగోదావరి జిల్లా ఏజన్సీలో ఒక ఉన్నతాధికారి తీరు ఎప్పటి నుంచో వివాదమవుతోంది. మహిళా ఉద్యోగులను బూతు పదాలతో తిట్టిన సందర్భాలపైనా ఆయనపై ఉన్నతస్థాయికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు.
మరో వైపు మరో రాయలసీమ జిల్లాలో ఒక ఉన్నతాధికారి తన పర్మిషన్ లేకుండా జీతాలు ఇవ్వవద్దంటూ హూంకరించారు.
వైద్య ఆరోగ్యశాఖలో ఒక ఉన్నతాధికారి తీరు, ఆయన మాటలు వివాదమయ్యాయి. అది వైద్యుల సమ్మె వరకు దారి తీసింది. చివరకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అదే అధికారి అంతకుముందు ఒక జిల్లా ఉన్నతాధికారిగా పని చేసిన సందర్భంలోనూ అక్కడి ఉద్యోగ యంత్రాంగం అంతా మూకుమ్మడిగా ఆందోళనకు దిగిన సందర్భాలూ ఉన్నాయి.
వ్యవసాయశాఖలోనూ ఒక ఉన్నతాధికారి తీరు ఇలాగే ఉంది. చాలా కాలంగా అదే పోస్టులో ఉంటున్న ఆ అధికారి తన కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులతో పాటు జిల్లాల వారితోను వ్యవహరించే తీరుతో అంతా నొచ్చకుంటున్నారు. ఇప్పటికే వ్యవసాయాధికారుల సంఘం ఈ అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లింది.
సచివాలయంలో కూడా కొందరు ఉన్నతాధికారుల తీరు చర్చనీయాంశమవుతోంది. కొందరు అధికారులు ఛాంబర్లోకి వెళ్లి మాట్లాడేందుకు ఆ దిగువ స్థాయి అధికారులు సైతం భయపడతారంటే ఉద్యోగ కార్యకలాపాల నిర్వహణ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు...
’సార్ మూడ్ ఎలా ఉంది’ అని ఆరా తీస్తే కానీ కొందరు అధికారుల వద్దకు వెళ్లేందుకు దిగువ అధికారులు సాహసించరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అందరూ ఐఏఎస్ లూ అలా ఉండరు. కొందరు ఐఏఎస్ లను కింది ఉద్యోగులు దేవుడు అని పిలుచుకున్న సందర్భాలూ ఉన్నాయి.
క్షేత్రస్థాయికి వెళ్లని అధికారులు...
ప్రస్తుతం ఉన్నతస్థాయి అధికారులు చాలా మంది క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన మానేశారు. అంతా యాప్ లతోనే పర్యవేక్షించే స్థాయికి వచ్చింది. ఇందులో ఆచరణాత్మకంగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా ఆ ఒత్తిడి అంతా కింది అధికారులపైకి, కింది ఉద్యోగులపైకి నెట్టివేస్తున్నారు. చాలా మంది అధికారులు జిల్లాల్లో పర్యటించరు. రాష్ర్ట స్థాయి అధికారులదీ ఇదే పరిస్థితి. సాంకేతికత సాయంతో కూర్చున్న చోట నుంచే పాలించాలనుకోవడంతోనే అసలు సమఃస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ అధికారులకు ఉద్యోగుల వాస్తవిక ఇబ్బందులు, ప్రజల క్షేత్రస్థాయి ఇబ్బందులు పట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఎదుగుతున్న సమాజంలో పని వాతావరణం ఎంత ముఖ్యమో తెలియని స్థాయిలో పాలనాధికారులు ఉంటే ఆ వ్యవస్థను ఏమని ప్రశ్నించాలి. హ్యాపీ ఇండెక్సుల పై చెప్పే అధికారులు, ఏ దేశాల్లో ప్రజలు సంతోషంతో ఎందుకు ఉంటున్నారో ప్రసంగాలు చెప్పే వారు తమ కింది ఉద్యోగులతో, అధికారులతో సంతోషంగా పని చేయించలేకపోతే అది అధికారుల వైఫల్యమా? ఉద్యోగుల వైఫల్యమా అన్న ప్రశ్న సహజం.
ఐఏఎస్ అధికారుల ఆగడాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం
ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేత అరవపాల్
(ఉద్యోగులు.న్యూస్)
సెప్టెంబరు 3- ఆంధ్రప్రదేశ్ లో కొందరు ఐఏఎస్ ల ఆగడాలపై, ఉద్యోగులతో వారు వ్యవహరిస్తున్న తీరుపై త్వరలోనే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఏపీ గవర్నమెంటు ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అరవపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రోజు రోజుకు రాష్ర్టంలో కొందరు ఐఏఎస్ అధికారుల వేధింపులు మితిమీరుతున్నాయని ఆయన విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా కొందరు ఐఏఎస్ అధికారులు ఉద్యోగులను వేధిస్తున్నారని అన్నారు. రాష్ర్టంలో అనేక మంది ఉద్యోగులు కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి రేయింబగళ్లు కష్టపడి పని చేశారని అన్నారు. ఇప్పటికే సీఎం ఆఫీసులో ఈ విషయంపై చర్చ జరుగుతోందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగులను అసభ్యపదజాలంతో దూషించడం మానుకోపోతే వారి ఇళ్ల ముందు ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సహా ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు.