అసలు ఈ 27 % ఫిట్మెంట్ వెనుక కథేమిటి?

 అసలు  ఈ  27 % ఫిట్మెంట్ వెనుక కథేమిటి?

(ఉద్యోగులు న్యూస్)

అక్టోబరు 15: ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణ కమిషన్ 27శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అంకెను తేల్చే క్రమంలో నాటి పరిస్థితులు కూడా ఆధారపడి ఉన్నాయని కొన్ని విశ్వసనీయ వర్గాల కథనం.  ధరల పెరుగుదల, కరవు పరిస్థితులు వాటిని ఆధారంగా చేసుకుని కొత్త వేతనాల స్థిరీకరణ నిమిత్తం ఈ ఫిట్మెంట్ ను సిఫార్సు చేస్తుంటారు. 2018 జులై ఒకటి నుంచి కొత్త వేతన సవరణ అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో  వేతన సవరణ కమిషన్ నివేదిక సమర్పించిన నాటి పరిస్థితులు, అప్పటి ఇబ్బందులు తదితర అంశాలపై విశ్వసనీయమైన అంచనాలు కొన్ని ఉన్నాయి. వేతన సవరణ కమిషన్ అంశాలను అతి సన్నిహితంగా పరిశీలించిన అధికారిక వర్గాల విశ్లేషణ ప్రకారం 27శాతం ఫిట్మెంట్ గా నిర్ధరించడానికి కొన్ని కారణాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. నాటి పరిస్థితుల ఆధారంగా అప్పటి వాతావరణాన్ని గమనించిన వారి అంచనాలే ఇవి తప్ప ...కమిషన్ లో వాస్తవంగా ఏం  జరిగిందో స్పష్టంగా తెలిసి వెల్లడిస్తున్న అంశాలు కావు...

ప్రభుత్వాలు వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసినా , వేరే ఏమైనా కమిటీలను నియమించినా వారి సిఫార్సుల విషయంలో  చాలా వరకు ప్రభుత్వ ప్రభావం ఉంటూ ఉంటుంది. ఏదో ఒకటి రెండు కమిటీలు తప్ప చాలా వరకు కమిటీలు, కమిషన్ లు ప్రభుత్వ మనసు ఎరిగి నివేదికలు ఇచ్చే అలవాటు ఉంటూ ఉంటుంది. 11వ వేతన సవరణ కమిషన్ ఛైర్మన్ ఆ తీరుతో ఉన్నారని అర్థం కాదు.. కాకపోతే ప్రభుత్వంతో సమన్వయం ఉంటూ ఉంటుంది.

2018 జులైలో పాత ప్రభుత్వ హయాంలో వేతన సవరణ కమిషన్ ఏర్పాటయింది. ఆ తర్వాత సిఫార్సలు కొత్త ప్రభుత్వ హయాంలో సమర్పించారు. 2020 మార్చి నుంచి కరోనా పరిస్థితులు  ఏర్పడ్డాయి. నివేదిక మొత్తం సిద్ధమైన తర్వాత కూడా సమర్పణకు ఆలస్యమయింది. ఈ లోపు ఆర్టీసీ ఉద్యోగుల అంశాలూ చర్చించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత నివేదిక సమర్పణ విషయంలోను, ఇతర అంశాల్లోను ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యేందుకు కమిషన్ వర్గాలు ప్రయత్నించినట్లు తెలిసింది. అప్పట్లో అలాంటి సమావేశానికి ఎంత కాలం వేచి చూసినా అవకాశం దక్కలేదు. నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వారికి అందకుండా కాలం గడిచిపోతున్న పరిస్థితులు. దాదాపు నివేదిక సిద్ధమైపోయినా పెండింగు ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వ మనసు తెలుసుకునే అవకాశమూ లేకుండా పోయిందని- దీంతో అప్పటికి ప్రభుత్వం ఇస్తున్న మధ్యంతర భృతి మేరకే 27శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేసినట్లు ఒక అంచనా వినిపిస్తున్నారు.  ప్రభుత్వం నుంచి నివేదిక స్వీకరణకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోతుండటంతో ఇక కమిషనే నిర్ణయం తీసుకుని నివేదిక సమర్పించారు. ఈ నివేదిక సమర్పణకు కమిషన్ ఛైర్మన్ రాకపోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. కమిషన్ లో పని చేసిన అధికారులే నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. అందుకే నివేదిక సమర్పణ చాలా సాదా సీదాగా సాగింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad