కొత్త స్కేల్లో ఉద్యోగుల మూల వేతనం
ఫిట్మెంట్ 27 శాతమే
తన సవరణ సంఘం సిఫార్సు
ప్రభుత్వ నోట్ సారాంశం ఇది
అనధికారికంగా చలామణి
అక్టోబరు 29: పీఆర్సీ నివేదికను ప్రభుత్వం పూర్తిస్థాయిలో వెల్లడించలేదు. ఒక పేజీ మాత్రమే విడుదల చేసింది. అందులో ఫిట్మెంట్ ఎంత ఉండాలో, డీఏ ఎంత ఉండాలో సిఫార్సు చేసింది. ఈ పేజీలోని సారాంశం..
• నిత్యావసరాల ధరల పెరుగుదలను తట్టుకునే విధంగా మూల వేతనంపై కనీస పెంపు ఉండాలి.
• ఆధునిక నాగరిక సమాజంలో హుందాగా జీవించడానికి అవసరమయిన కొత్త సౌకర్యాలను ఉద్యోగులు తమ జీవనంలో ఇముడ్చుకోగలిగేలా కూడా ఈ పెంపు ఉండాలి.
• సమానత్వాన్ని చాటేలా వేతనాల పెంపుదల శాతం అన్ని రకాల ఉద్యోగులకూ ఒకేరకంగా ఉండాలి
• 01-07-2018 నాటికి కార్మిక సదస్సు నిబంధనల ఆధారంగా నిర్దేశించిన కనీస వేతనంలో పెంపునకు, చివరి వేతన సవరణ అమలు తేదీ (01-07-2013) నాటికి నిర్దేశించిన మొత్తానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేలా ఫిట్మెంట్ ప్రయోజనం అందించాలి. నిత్యావసరాల ధరలపై పడే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తట్టుకునే విధంగా మూల వేతనంలో కరవు భత్యాన్ని కలపాలి.
• ఈ సూత్రం ఆధారంగా చూస్తే ప్రస్తుత కేసులో ఫిట్మెంట్ 23శాతం అవుతుంది. అయితే ఈ పీఆర్సీ నివేదిక ఇంకా పెండింగ్ లోనే ఉన్న నేపథ్యంలో వివిధ ఉద్యోగ సంఘాల వినతి మేరకు రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే మధ్యంతర భృతిని మూలవేతనంలో 27శాతంగా ఆమోదించి 01-07-2019 నుంచి చెల్లిస్తోంది. పీఆర్సీ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా వేతనం, ఇతర భత్యాల సవరణ ద్వారా ఉద్యోగులకు అందే మొత్తానికి అనుగుణంగా మధ్యంతర భృతిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
పై అంశాల ఆధారంగా వేతన సవరణ సంఘం వేతన సవరణకు ఈ కింది సూత్రాన్ని సిఫార్సు చేస్తోంది.
• వేతన సవరణకు ముందు ఉన్న మూలవేతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
• వినియోగదారుల సూచీకి అనుగుణంగా 01-07-2018 నాటికి కరవు భత్యాన్ని వేతన సవరణకు ముందు ఉన్న మూలవేతనంలో 30.392 శాతంగా లెక్కించాలి.
• వేతన సవరణకు ముందున్న మూలవేతనంలో 27శాతంగా ఫిట్మెంట్ ఉండాలి.
• ప్రస్తుతం అందుకుంటున్న మూల వేతనం, అందులో 30.392శాతం కరవు భత్యం, ప్రస్తుతమున్న మూలవేతనంలో 27శాతం ఫిట్మెంట్ ప్రయోజనం- ఈ మూడూ కలిపితే ఎంత మొత్తం అవుతుందో అంతకన్నా ఎక్కువగా కొత్త వేతన స్కేలులో సవరించిన మూల వేతనం ఉండాలి. లేదా ప్రస్తుత మూలవేతనాన్ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గా నిర్దేశించిన 1.57392తో హెచ్చిస్తే వచ్చిన మొత్తాన్ని సవరించిన మూలవేతనంగా లెక్కించాలి.
• సవరించిన పే స్కేలులోని కనీస మొత్తం కన్నా ఏ ఉద్యోగి వేతనమయినా తక్కువగా ఉన్నట్టయితే దాన్ని కనీస మొత్తం వద్ద స్థిరపర్చాలి.
• సవరించిన పే స్కేలులోని గరిష్ఠ మొత్తం కన్నా ఎవరి వేతనమయినా మించితే ఆ వ్యత్యాసాన్ని పర్సనల్ పేగా భావించి దాన్ని భవిష్యత్తులో పెరిగే మొత్తాల్లో సర్దుబాటు చేయాలి. లేదా ఇంక్రిమెంట్లు నిలిపివేయాలి (గరిష్ఠంగా ఐదు).
• వేతన సవరణ ప్రకారం స్థిరపరిచే వేతనాలు 01-07-2018 నుంచి అమలు చేయాలని సిఫార్సు చేస్తున్నాం. అయితే ఏ తేదీ నుంచి ఫిట్మెంట్ ప్రయోజనం అందించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వద్ద ఉన్నవనరుల ఆధారంగా ప్రభుత్వానికే వదిలేయడం సబబని వేతన సవరణ కమిషన్ భావిస్తోంది.
• ప్రస్తుత మూల వేతనంలో 27శాతంగా మధ్యంతర భృతిని 01-07-2019 నుంచి ప్రభుత్వం చెల్లిస్తోంది. మధ్యంతర భృతిపై ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన వ్యయం రూ.16,281 కోట్లు.