• ప్రభుత్వ సలహాదారు సజ్జల గారితో ఉద్యోగ సంఘాల నేతల భేటీ
• PRC నివేదిక బయట పెట్టే దిశగా అడుగులు... ??
• PRC అమలు, పెండింగు DA లు, CPS రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం
- Meeting with Sajjala on PRC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. వెలగపూడిలోని రాష్ర్ట సచివాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ సమావేశం ప్రారంభమయింది. పీఆర్సీ అమలు, పెండింగు డీఏలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోందని సమాచారం.
ఇటీవల ఉద్యోగ సంఘాల జేఏసీలు ఎన్ జీ వో ఆధ్వర్యంలోని జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. ఇక ఓపిక పట్టలేమని తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి వారితో మాట్లాడిన అంశమూ వివాదమయింది.
ప్రస్తుతం సజ్జల తో భేటీ అయిన వారిలో బండి శ్రీనివాసరావు, శివారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. తొలి సమావేశంలో సంక్రాంతి లోపు పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఉద్యోగ సంఘాల నేతలు తదుపరి విలేకరుల సమావేశంలో ఆ డిమాండ్ ను దసరా కు మార్చారు. దసరా లోపు పీఆర్సీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏర్పడ్డ ఇబ్బందులు తొలగించే క్రమంలో కొన్ని దిద్దుపాటు చర్యల దిశగా ఈ సమావేశం అడుగులు వేసే అవకాశం ఉందని సమాచారం. తొలుత పీఆర్సీ నివేదిక త్వరలోనే బయట పెట్టేందుకు ఈ సమావేశం తొలి అడుగుగా అంచనా వేస్తున్నారు.
- అతి త్వరలోనే పీఆర్సీ ఇస్తాం - సజ్జల
- 2 రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తాం
- ఉద్యోగ సంఘ నేతలకు సజ్జల హామీ - - బండి శ్రీనివాసరావు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, పీఆర్సీ తదితర అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు ఈ మేరకు హామీ ఇచ్చారు. అలాగే అతి త్వరలోనే పీఆర్సీ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశం ముగిసింది. అనంతరం నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ జీ వో ల ఆధ్వర్యంలో జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ఆ విషయాలు ఇలా ఉన్నాయి...
- ఉద్యోగల సమస్యలపై రెండ్రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తామని సజ్జల చెప్పారు.
- ఆయన సానుకూలంగానే మాట్లాడారు.
- పీఆర్సీ దసరాకు వస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పాం. అతి త్వరలోనే పీఆర్సీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- ఈ రోజుకీ ఉద్యోగులకు ఇంకా పెన్షన్లు రాలేదని, జీతాలు రాలేదని చెప్పాం. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బలు రావ డం లేదనీ వివరించాం.
- మా పై ఒత్తిళ్లు ఉన్నాయని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరాం.
- మా సమస్యల పరిష్కారానికి మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలుస్తాం.