శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ ఉంది. రాజధాని అటు విజయవాడ కాదు....ఇటు గుంటూరు కాదు. ఈ ప్రాంతంలో కనీస వసతుల కల్పనకే లక్ష కోట్లు అవుతుంది. ఈ రోజు లక్ష కోట్లు పదేళ్లకు 6 లక్షల కోట్లు అవుతుంది. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే లక్షల కోట్లు కనీస వసతులకు వెచ్చించాల్సి ఉంది. మన పిల్లలకు పెద్ద నగరాన్ని ఎప్పుడు అందిస్తాం? ఉద్యోగాలు ఎలా కల్పిస్తాం? రాష్ట్రంలో అతిపెద్ద సిటీ విశాఖ. అన్ని వసతులు ఉన్న నగరం విశాఖ. అక్కడ కొద్దిగా వసతులు పెంచితే హైదరాబాద్‌తో పోటీ పడుతుంది.’’ అని జగన్ తెలిపారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న అనంతరం సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సభలో చర్చ జరిగింది. ఆస్తులన్నీ సీఆర్డీఏకే బదలాయిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అలాగే ఏఎంఆర్డీఐకి బదిలీ చేసిన ఆస్తులు, ఉద్యోగులు యథావిధిగా సీఆర్డీఏకి కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీఆర్డీఏ చట్టం 2014 పునరుద్ధరించినట్లు వెల్లడించారు.