ఎయిడెడ్‌ టీచర్లకు విలీన వంచన... ఉద్యోగులు రోడ్డునపడే ప్రమాదం


➤ ఎయిడెడ్‌ టీచర్లకు విలీన వంచన

➤ రాజ్యాంగ విరుద్ధమని తెలిసీ విలీనం 

➤ ఆర్టికల్‌ 16(1) ప్రకారం ఈ నియామకాలు చెల్లవు 

➤ ఇష్టానుసారం ప్రభుత్వంలోకి తీసుకోవడం కుదరదు

➤ సుప్రీం మార్గదర్శకాలు పట్టించుకోని వైసీసీ సర్కారు 

➤ నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాతే పోస్టులు భర్తీ చేయాలి 

➤ సరెండర్‌ ఉత్తర్వుల్లో కొన్ని అంశాలు దాచేసి మాయ 

➤ ఆర్టికల్‌ 309ను దుర్వినియోగం చేసేందుకూ సిద్ధం 

➤ ఎవరైనా కోర్టుకెళ్తే వీగిపోతుందని తెలిసినా నిర్లక్ష్యం 

➤ నెపం న్యాయస్థానాలపైకి నెట్టేయాలనే యోచన 

➤ ఎయిడెడ్‌ ఉద్యోగులు రోడ్డునపడే ప్రమాదం

(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ప్రైవేట్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో సిబ్బందిని నేరుగా ప్రభుత్వంలోకి తీసుకోవడం రాజ్యాంగ బద్ధం కాదని, ఈ నియామకాలను ఆర్టికల్‌ 16 క్లాజ్‌(1) ససేమిరా ఒప్పుకోదని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వంలో రెగ్యులర్‌, కాంట్రాక్టు, గౌరవ వేతనం... తదితర పోస్టులు భర్తీ చేయాలని ఈ ఆర్టికల్‌ స్పష్టం చేస్తోంది. ఈ విధంగా భర్తీ చేసిన పోస్టులకు, ఉద్యోగులకు అవసరమైన నియమ నిబంధనలు, సర్వీసు కండీషన్లను ఆర్టికల్‌ 309 ప్రకారం రూపొందిస్తారు. ఆర్టికల్‌ 309 అనేది ఆర్టికల్‌ 16 క్లాజ్‌(1)కి లోబడి ఉంటుంది. కానీ ఈ ఒక్క ఆర్టికల్‌ను మాత్రమే ఉపయోగించుకొని ఉద్యోగులను ఇష్టానుసారం ప్రభుత్వంలోకి తీసుకోవడం చెల్లదు. ఆర్టికల్‌ 16 క్లాజ్‌(1)ను కాదని నేరుగా ఆర్టికల్‌ 309ని ఉపయోగించుకొని సర్వీసు నిబంధనలు రూపొందించడానికి రాజ్యాంగం అంగీకరించదు. కానీ ఎయిడెడ్‌ సిబ్బంది విలీనం అంశంలో జగన్‌ సర్కారు ఇదే తప్పు చేస్తోంది. 

ఉద్దేశపూర్వకంగానే దాచేశారు 

ప్రభుత్వానికి ప్రైవేట్‌ ఎయిడెడ్‌ సిబ్బందిని సరెండర్‌ చేసేందుకు ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రస్తావించని కొన్ని అంశాలను దానికి సంబంధించిన నోట్‌ఫైల్‌లో ప్రస్తావించారు. వాటిని ఉద్దేశపూర్వకంగానే ఆదేశాల్లో దాచారు. ఆర్టికల్‌ 309ను ఉపయోగించి ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయడానికి అసవరమైన నియమ నిబంధనలు రూపొందించాలని ఏపీపీఎస్సీని ఆదేశించినట్టుగా నోట్‌ ఫైల్‌లో ఉందని తెలిసింది. అయితే ఆర్టికల్‌ 16 క్లాజ్‌(1) ప్రకారం ప్రభుత్వ సర్వీసుల్లోకి రిక్రూట్‌ కాని ప్రైవేట్‌ ఉద్యోగులకు ఆర్టికల్‌ 309 ప్రకారం సర్వీసు కండీషన్లు, ఇతర నియమ నిబంధనలు రూపొందించడం రాజ్యాంగ విరుద్ధం. 

దొడ్డిదారిలో నియామకాలు 

ఈ విషయంలో ప్రభుత్వ నియామకాలను ఉద్దేశించే మేజర్‌ ఆర్టికల్‌ 16 క్లాజ్‌ (1)ని జగన్‌ సర్కారు పూర్తిగా విస్మరించింది. దానికి లోబడి పనిచేయాల్సిన ఆర్టికల్‌ 309ను దుర్వినియోగం చేసేందుకు సిద్ధపడింది. ఆర్టికల్‌ 309ను చూపించి ప్రైవేట్‌ ఎయిడెడ్‌ స్టాఫ్‌ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్ల పోస్టుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులను అపహాస్యం చేస్తూ ఎయిడెడ్‌ సిబ్బందిని దొడ్డిదారిన ప్రభుత్వంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా, దీనిపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని తెలిసినా కూడా వెనక్కు తగ్గడం లేదు.  

అవి వర్తించవు 

ప్రభుత్వంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రా క్టు ఉద్యోగులను నేరుగా రెగ్యులరైజ్‌ చేయడానికి కూడా రాజ్యాంగం ఒప్పుకోదు. దీనికీ నోటిఫికేషన్‌ ఇచ్చి అందరితో పాటు వీరికీ పరీక్షలు నిర్వహించి ఎంపికైన వారినే సర్వీసుల్లోకి తీసుకుంటారు. అలాంటిది ప్రైవేటు ఎయిడెడ్‌ విద్యాసంస్థల సిబ్బందిని నేరుగా ప్రభుత్వంలోకి తీసుకోవడాన్ని రాజ్యాంగం సమర్థించబోదు. ఆర్టికల్‌ 16 క్లాజ్‌ (1)కి కేవలం మూడు మినహాయింపులు మాత్రమే ఉన్నాయి. అవి... లోకల్‌/ నాన్‌లోకల్‌ అర్హత, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్‌, మతపరమైన వ్యవస్థలకు చెందిన కార్యాలయాల్లో ఆ మతానికి చెందిన ఉద్యోగులే పని చేయాలన్న రిజర్వేషన్‌. ఇప్పుడు ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వంలోకి తీసుకోవడం ఈ మూడు మినహాయింపుల పరిధిలోకి రాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే....

ప్రభుత్వంలోకి ఉద్యోగులను తీసుకోవడంపై సుప్రీంకోర్టు కచ్చితమైన మార్గదర్శకాలు, తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ఎవరినైనా ప్రభుత్వంలోకి తీసుకోవాలనుకుంటే ఆర్టికల్‌ 19 క్లాజ్‌ (1) ప్రకారం నోటిఫికేషన్‌ ఇవ్వాలి. అర్హులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఇందుకోసం పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఏదో ఒకటి నిర్వహించాలా? రెండూ అవసరమా అనే విషయాన్ని ఆర్టికల్‌ 309 ద్వారానే నిర్ణయించాలని ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. ప్రత్యేకించి కొంతమంది ఉద్యోగులనే ప్రభుత్వంలోకి తీసుకోవాలనుకున్నా... నోటిఫికేషన్‌ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, అవసరమనుకుంటే సరైన కారణం చూపి ఆ కొందరికి గరిష్ఠంగా 5శాతం వరకూ వెయిటేజీ కల్పింవచ్చని, వయోపరిమితి సడలింపులూ ఇవ్వొచ్చని పేర్కొంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad