♦ప్లీజ్.. కొత్త అప్పులకు అనుమతివ్వండి
♦16 వేల కోట్లు కావాలి.. పథకాలూ అమలుచేయలేకపోతున్నాం
♦కేంద్రం వద్ద రాష్ట్ర సర్కారు వేడుకోలు.. ఢిల్లీలో బుగ్గన చక్కర్లు
♦ప్రస్తుతం 1150 కోట్లే అప్పు పరిమితి
జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. పథకాలు అమలు చేయలేకపోతున్నాం. కొత్తగా రూ.16,000 కోట్లు అప్పులు చేసుకునేందుకు అనుమతులివ్వండి’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని వేడుకుంటోంది. ఇటీవల ఢిల్లీలో మకాం వేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర ఆర్థిక శాఖకు ఈ మేరకు వినతిపత్రం సమర్పించినట్టు సమాచారం.
ఆగస్టు లో కూడా కొత్త అప్పుల అనుమతి కోసం మంత్రి, అప్పటి సీఎస్, ఆర్థిక శాఖ సెక్రటరీలు నాలుగైదు విడతలుగా ఢిల్లీ వెళ్లొచ్చారు. మొత్తానికి బతిమాలి బామాలి సెప్టెంబరు 3న రూ.10,500కోట్లు కొత్త అప్పునకు అనుమతి తెచ్చుకున్నారు. ఈ అప్పులు, మూలధన వ్యయ లక్ష్యం చేరుకున్నందుకు కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహక అప్పు రూ.2650 కోట్లు, రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు బ్యాంకులకు కుదిరిన రూ.25,000కోట్ల అప్పు ఒప్పందంలో భాగంగా మిగిలిన రూ.3,500కోట్ల అప్పును సెప్టెంబరు, అక్టోబరుల్లో వాడేశారు. ఇప్పుడు రాష్ట్రంవద్ద రూ.1150 కోట్ల అప్పు పరిమితి మాత్రమే మిగిలి ఉంది. దీంతో మళ్లీ కొత్త అప్పుల కోసం వినతి పత్రం పట్టుకుని కేంద్ర ఆర్థిక శాఖ చుట్టూ మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ సెక్రటరీ తిరుగుతున్నారు. కేంద్రం నిర్దేశించిన మూలధన వ్యయ పరిమితి చేరుకునే దిశగా రాష్ట్రం పయనిస్తుందన్న కారణంతో అక్టోబరులో అదనంగా రూ.2650కోట్ల మేర కొత్త అప్పులకు అనుమతి ఇచ్చింది. తాజాగా శుక్రవారం ఇదేవిధంగా మరో 7 రాష్ట్రాలకు అనుమతిచ్చింది. అందులో మన రాష్ట్రం లేదు. ఎందుకంటే కేంద్రం నిర్దేశించిన మూలధన వ్యయ లక్ష్యాలను చేరుకోవడంలో ఏపీ విఫలమైంది.
దాదాపు రూ.5,000 కోట్ల మేర మూలధన వ్యయం చేయడంలో ఏపీ విఫలమైంది. 2020-21లో రూ.27,000కోట్ల మూలధన వ్యయం చేయాలని కేంద్రం రాష్ట్రానికి నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు జీఎ్‌సడీపీలో 0.5 శాతం మేర అదనపు అప్పులకు అనుమతిస్తామని ప్రకటించింది. ఏపీకి సంబంధించి ఈ 0.5శాతం విలువ దాదాపు రూ.5,500కోట్లు. రాష్ట్రాల మూలధన వ్యయాలను ప్రతి 3నెలలకొకసారి సమీక్షించి లక్ష్యాలు చేరుకున్న రాష్ట్రాలకు అదనపు అప్పులకు కేంద్రం అనుమతి ఇస్తూఉంది. దీని ప్రకారం జూన్ 31నాటికి ఆ రూ.27,000కోట్లలో 15శాతం, సెప్టెంబరు 30నాటికి 45 శాతం, డిసెంబరు 31నాటికి 70శాతం, మార్చి 31నాటికి 100 శాతం.. ఇలా మూలధన వ్యయం చేయాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు జూన్ 30వరకు చేసిన సమీక్షలో ఏపీ 15శాతం ఖర్చు చేసింది. ఇదే స్థాయిలో ఖర్చు చేస్తే నిర్దేశించిన లక్ష్యం చేరుకుంటుందనే ఉద్దేశంతో కేంద్రం అక్టోబరులో ఏపీకి అదనపు అప్పుల పరిమితిలో 50శాతం అంటే రూ.2650 కోట్లకు అనుమతిచ్చింది. వాటిని రాష్ట్రం తెచ్చేయడం, వాడుకోవడం జరిగిపోయింది. సెప్టెంబరు 30నాటికి 45 శాతం మూలధన వ్యయం చేయాలి. కానీ, ఏపీ చేయలేదు.
అందుకే ఈసారి అదనపు అప్పులకు కేంద్రం అనుమతివ్వలేదు. ఇప్పటివరకు ఏపీ రూ.8,000కోట్లు మాత్రమే మూలధన వ్యయం చేసింది. కానీ, రూ.13,000 కోట్ల మూలధన వ్యయం చేస్తే ఎంత అదనపు అప్పు లభిస్తుందో అంతపరిమితిని కేంద్రం ముందుగానే ఇచ్చేసింది. ఒకవేళ మార్చి 31నాటికి కూడా ఏపీ రూ.13,000కోట్ల మూలధన వ్యయం చేయకపోతే.. అదనంగా ఇచ్చిన అప్పులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇచ్చే అప్పుల పరిమితిలో ఆ మేరకు కోత విధిస్తుంది