ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇవ్వనున్న ఉద్యోగులు..!


ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల మధ్య పీఆర్సీ నివేదిక వ్యవహారం వివాదంగా మారుతోంది. కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నతాధికారులకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబట్టగా, ఇందుకు సంబంధించి గతంలో సీఎస్‌ ఆధ్వర్యంలో వేసిన కమిటీ అధ్యయనం చేయాల్సి ఉందని ఉన్నతాధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే 13 సంఘాల్లో 9 సంఘాల నాయకులు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నుంచి బయటికొచ్చేసాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు కీలక ప్రకటన చేశాయి. పీఆర్సీపై ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు డెడ్‌లైన్ విధించాయి.

ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు షాకిచ్చారు. పీఆర్సీ తోపాటు పెండింగ్ డీఏ బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలకు, సంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల నుంచి వివిధ రూపాల్లో నిరసన తెలపనున్నారు. డిసెంబర్ 1న సీఎస్ సమీర్ శర్మకు నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు అమరావతిలో ఆదివారం ఉద్యోగ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి 10 వరకు అన్ని జిల్లాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని వారు ప్రకటించారు.

అంతకుముందు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పీఆర్సీ అమలు, సిపియస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 1600కోట్ల చెల్లింపులపై ప్రత్యేకంగా కార్యవర్గ సమావేశంలో చర్చించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం పిఆర్సీ నివేదికను బయట పెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని వెంకటేశ్వర్లు ఆరోపించారు. మా జేఏసీ అమరావతిలో ఉన్న సంఘాలన్నీ భేటీ అయ్యామని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని పీఆర్సీ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మీరిచ్చే జీతాలు మా హక్కు, అది భిక్ష కాదని, సచివాలయం ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిది అనుభవ రాహిత్యమన్నారు. ఆయన ఏమీ మాట్లాడుతూన్నాడో ఆయనకే తెలియదని, ఆయన నాయకుడై రెండేళ్లేనంటూ వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మా సంఘాలకు దశాబ్దాల చరిత్ర ఉందని, మేము ఉద్యమానికి వెళ్తున్నామని స్పష్టం చేశారు. వెంకట్రామిరెడ్డి కూడా మాతో కలిసి రమ్మని కోరుతున్నామని, 2019 డీఏ అరియర్స్ ఇంకా రాలేదని వెంకటేశ్వర్లు చెప్పారు. కేంద్రం అన్ని డిఏ లు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న అన్ని డీఏలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు మాకు చెల్లించాల్సి వుందని, ఆర్ధిక మంత్రి ఒక్కసారైనా ఉద్యోగుల తో చర్చించారా అని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఉద్యోగులు రగిలిపోతున్నారని. పేదల కోసం పని చేసే ఉద్యోగులను ఆర్ధిక మంత్రి కించపరిచేలా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధం అవుతున్నాయని. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా పీఆర్సీ ప్రకటన చేస్తే మేము ఒప్పుకొమన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad