ఎన్.ఇ.పి చట్రంలో రాష్ట్ర విద్యా విధానం
నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్.ఇ.పి) రాష్ట్రంలో అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. మొదటి దశలో పాఠశాల విద్యా నిర్మాణ చట్రాన్ని ఏకపక్షంగా మార్పులు చేస్తున్నది. ఒకటి నుండి ఐదు తరగతుల చట్రాన్ని మార్పు చేసి ఊరిబడిలో 3,4,5 తరగతులు మూసేసి ఉన్నత పాఠశాలలకు తరలింపు జరుగుతున్నది.
ఈ సంవత్సరం 250 మీటర్ల లోపున్న 3,300 పాఠశాలలు,
కిలోమీటరు లోపు లెక్కిస్తే 17 వేల పాఠశాలలు,
ఆ తరువాత 35,000 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భవిష్యత్‌లో ఫౌండేషన్ పాఠశాలలు రెండవ తరగతి వరకు మాత్రమే ఉంటాయి.
సి.బి.యస్.ఇ సిలబస్ - రాష్ట్ర సిలబస్
సి.బి.యస్.ఇ, రాష్ట్ర సిలబస్‌లలో ఏది మేలు అనేది ఇంగ్లీషు మీడియం లాగే ఎప్పటి నుండో జరుగుతున్న చర్చ.
2007లో నాటి వై.ఎస్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ఇంగ్లీషు మీడియం (సక్సెస్) పాఠశాలల్లో 6వ తరగతి నుండి సిబియస్‌ఇ సిలబస్ ప్రవేశపెట్టారు. ఈ విషయమై నాడు విద్యాశాఖ కార్యదర్శి సి.బి.యస్ వెంకట రమణతో ఉపాధ్యాయ సంఘాలు చర్చించాయి. పరీక్షలు స్టేట్ బోర్డు లోనే ఉంచుతూ సిలబస్ మాత్రమే ఎడాప్టు చేసుకున్నది. సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది.
ప్రాథమిక పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం మొత్తం రద్దు చేయడంపై హైకోర్టులో కేసు నడుస్తున్నది.
నూతన జాతీయ విద్యా విధానం 8వ తరగతి వరకు మాతృభాషలో ఉండాలని చెబుతున్నది.
ఈ నేపథ్యంలో సి.బి.యస్.ఇ సిలబస్‌గా మార్పు చేస్తే తెలుగు మీడియం చర్చ లేకుండా కోర్టులలో కూడా ఆటంకం లేకుండా చేసుకోవచ్చుననేది ప్రభుత్వ ఆలోచన.
అందుకే పాఠశాల విద్య మొత్తాన్ని సి.బి.యస్.ఇ. సిలబస్ లోకి మార్చివేయాలని ఆలోచన చేస్తున్నది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సి.బి.యస్.ఇ) కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థగా పనిచేస్తుంది. ఎన్.సి.ఇ.ఆర్.టి జాతీయ స్థాయిలో సిలబస్ రూపొందించి పుస్తకాలు ముద్రిస్తుంది. 10,11,12 తరగతులలో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తోంది. దేశంలో ఇరవై వేలకు పైగా పాఠశాలలు సి.బి.యస్.ఇ బోర్డుకు అనుసంధానం చేయడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలో ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో నడుస్తున్నాయి. జాతీయ స్థాయి పోటీలకు ఈ సిలబస్, మాధ్యమం తోడవుతోందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇందుకు పాఠశాల విద్యాశాఖ త్వరత్వరగా అమలుకు పూనుకొంటున్నది. 2021-22 నుండి సిబియస్‌ఇ ప్రారంభించి క్రమంగా 2024-25 నాటికి పదవ తరగతి వరకు, తదపరి 11,12 తరగతులకు విస్తరిస్తామని చెబుతోంది.
తొలి విడతలో సుమారు వెయ్యి పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి వరకు సిబియస్‌ఇ సిలబస్‌కు కేంద్రం అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు సరిపోయే పాఠశాలలను గుర్తిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ సిబియస్‌ఇ గుర్తింపు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా, కేంద్రం నిబంధనలకు సడలింపులు ఇవ్వకపోవడంతో తొలి దశలో సుమారు వెయ్యి పాఠశాలలు అనుమతి కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇందుకు ఆన్‌లైన్‌లో సమాచారం సేకరిస్తున్నారు.
మోడల్ స్కూళ్లు (164), కస్తూరిబా పాఠశాలలు (352), మిగిలిన జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలను తొలి విడతలో గుర్తించినట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు.
ఫిజిక్స్, బయాలజీ, సైన్సు ప్రయోగశాల, కంప్యూటర్ ల్యాబ్, వెబ్‌సైట్, గ్రంథాలయం, గ్రౌండ్, భవనాలు, ఉపాధ్యాయుల విద్యార్హతలు ఇతర నియమ నిబంధనలు సరిపోతాయో లేదో...ఎన్నింటికి కేంద్రం అనుమతి ఇస్తుందో చూడాలి.
దేశంలో ఏ రాష్ట్రంలో పాఠశాల విద్య మొత్తాన్ని సిబియస్‌ఇ కి అనుసంధానం చేయలేదు.
విద్యార్థుల పరిస్థితి ఏమిటి?
సిబియస్‌ఇ సిలబస్‌తో ఏర్పాటు చేసే నూతన పాఠశాలల్లో విద్యార్థులకు ఆప్షన్ ఉంటుందా? లేక ఇంగ్లీషు మీడియం లాగనే బలవంతంగా మార్చబడతారా?
స్టేట్ సిలబస్ చదువుకునే విద్యార్థులకు అదే పాఠశాలల్లో రెండు సిలబస్‌లు నడుస్తాయా? లేదా స్టేట్ సిలబస్‌లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఏమిటి?ఎక్కడికి తరలిస్తారు?*
ఉపాధ్యాయుల అర్హతలు ఏమిటి? నియామకాలు ఎలా?
సిలబస్ ఎడాప్ట్ చేస్తారా?
పాఠశాలలను సిబియస్‌ఇ బోర్డుకు ఎడాప్ట్ చేస్తారా?... వంటి వాటికి సమాధానం చెప్పకుండా
...ముందు అమలు చేసేసి, తర్వాత సమస్యలకు పరిష్కారం చెబుతారా? అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలి.
ఏది మేలు?
ఎన్.సి.ఎఫ్ (నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్కు) ప్రకారం ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన సిలబస్‌ను సిబియస్‌ఇ అమలు చేస్తుంది.
రాష్ట్రంలో ఎస్‌సిఇఆర్‌టి ఆధ్వర్యంలో ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన సిలబస్ ఆధారంగా రాష్ట్ర స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 20 శాతం మార్పులతో సిలబస్ రూపొందిస్తున్నారు. ఆ విధంగా చూస్తే సిలబస్‌లో పెద్దగా తేడా కనిపించదు. ప్రమాణాల లోనే తేడా కన్పిస్తుంది.
మౌలిక వసతులు, (సిబియస్‌ఇ నిబంధనల ప్రకారం) ఉపాధ్యాయుల అర్హతలు, బోధనా సమయం, పని వేళలు, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, రెసిడెన్షియల్, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో లాగా అకడమిక్ విషయాల కంటే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు లేకపోవటం, పరీక్షలో నాణ్యత వంటి విషయాలలో తేడా కన్పిస్తున్నది.
లెక్కలు, భౌతిక శాస్త్రంలో రాష్ట్ర సిలబస్ స్థాయి సిబిఎస్‌ఇ కంటె ఎక్కువగా ఉందని, అధిక ప్రమాణాలను కలిగి ఉందని సబ్జెక్టు నిపుణులు అంటున్నారు.
రాష్ట్ర సిలబస్‌లో ఐఐటి, జెఇఇ, నీట్ లాంటి ఆలిండియా పరీక్షలలో రాష్ట్ర సిలబస్ విద్యార్థులు ఏమీ తీసిపోలేదని, మంచి ఫలితాలు సాధించారని ఫలితాలు తెలియచేస్తున్నాయి.
సిబిఎస్‌ఇ లో సైన్సు, సోషల్ సిలబస్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.
మూల్యాంకనానికి సంబంధించి సిబియస్‌ఇలో మూడు స్టేజిలుగా పరీక్షలు నిర్వహిస్తూ 20 శాతం ఇంటర్నల్ మార్కులు లెక్కిస్తున్నారు. పరీక్షలు కఠినంగానే నడుపుతున్నారు.
రాష్ట్ర సిలబస్‌లో ఒకటే స్టేజి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఇంటర్నల్ మార్కులు, 10వ తరగతికి రెండు పేపర్లు 100 మార్కులకు నిర్వహిస్తున్నారు. చదువులు ఎలా ఉన్నా 100 శాతం పాస్, పదికి పది గ్రేడ్ మార్కులు రావాలనే లక్ష్యంతో పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.
సిబియస్‌ఇ సిలబస్ ఎడాప్ట్ చేసుకుంటేనే సరిపోదు, సిబియస్‌ఇ ప్రమాణాలతో పాఠశాలలు రూపుదిద్దుకోవాలి. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ఒకే సిలబస్, ప్రమాణాలు పాటించే విధంగా విద్యా వ్యవస్థను సంస్కరించాలి.
పాఠశాల విద్య వరకు ఏ సిలబస్ అయినా, ఏ మీడియం అయినా మొత్తం విద్యార్థుల కోణం నుండి ఉండాలి. కొందరి కోసం అందరినీ అందులోకి నెట్టడం సరి కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేటికీ విద్యలో వివక్షత పాటిస్తున్నాయనడానికి నేటి పాఠశాల వ్యవస్థే నిదర్శనం. కేంద్రీయ, నవోదయ, రెసిడెన్షియల్, ప్రభుత్వ, జిల్లా పరిషత్ మండల పరిషత్ విద్యార్థులకు సిలబస్‌లో, మీడియంలో సౌకర్యాలలో, మెనూలో, ఒక్కొక్క విద్యార్థికి ఒక్కో విధంగా బడ్జెట్ ఖర్చు చేయడంలో ఎంత వివక్షత ఉందో అర్ధం అవుతుంది. రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం విద్యలో ఎక్కడా కనిపించదు. ఏ సిలబస్ అయినా ఏ మీడియం అయినా, ఏ మేనేజ్‌మెంట్ అయినా విద్యార్థులందరికీ సమానంగా చదువు చెప్పే వ్యవస్థ కావాలి. అందుకోసం పోరాడాలి.
కేంద్రం చేతుల్లోకి విద్య
ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే విద్యా విధానం... ఇలా అన్నింటిని కేంద్రం గుప్పెట్లోకి తీసుకుంటున్నది. ఇంతవరకు రాష్ట్రాల చేతుల్లో ఉన్న అంశాలను తన చేతుల్లోకి లాగేసుకొంటున్నది. సమాఖ్య స్ఫూర్తిని, రాష్ట్రాల హక్కులను హరిస్తున్నది. భాషా పెత్తనం, ఆధిక్యతలతో పాటు చరిత్ర, సిలబస్, పాఠ్యాంశాల రూపకల్పనాధిóకారం వంటివి కేంద్రం చేతుల్లోకి తీసుకుంటున్నది. ప్రస్తుత విద్యా విధానాన్ని మరింతగా ప్రైవేటీకరించి, కార్పొరేటీకరించి, విదేశీ విద్యను విస్తృత పరచడమే లక్ష్యంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ భావజాలన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రైవేటు వైపే ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని అర్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలన్నింటికి ఆమోదం తెలుపుతున్నట్లే జాతీయ విద్యా విధానానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దాసోహం అంటున్నది. మేం కూడా ఇదే అనుకుంటున్నామని అమలుకు పూనుకొంటున్నది. ఈ పరిస్థితి రాష్ట్రాల హక్కులకు, మొత్తం విద్యా రంగానికి నష్టం తెస్తుందని చర్చ నడుస్తున్నా ఏమీ పట్టించుకోవడం లేదు.
నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్.ఇ.పి) రాష్ట్రంలో అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది.
మొదటి దశలో పాఠశాల విద్యా నిర్మాణ చట్రాన్ని ఏకపక్షంగా మార్పులు చేస్తున్నది. ఒకటి నుండి ఐదు తరగతుల చట్రాన్ని మార్పు చేసి ఊరిబడిలో 3,4,5 తరగతులు మూసేసి ఉన్నత పాఠశాలలకు తరలింపు జరుగుతున్నది.
ఐ. వెంకటేశ్వరరావు
వ్యాసకర్త : పిడియఫ్ శాసనమండలి సభ్యులు