WhatsApp: ఆ వాట్సాప్‌లను డౌన్‌లోడ్ చేస్తే.. డేంజర్‌లో పడ్డట్టే!
ఇంటర్నెట్ డెస్క్: ఈ కాలంలో ప్రతి వస్తువుకీ నకలు ఉండటం మామూలు విషయమైపోయింది. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లకూ ఆ నకిలీ బెడద అంటుకుంది. ఏది ఒరిజినలో, ఏది డూప్లికేటో కనుక్కోలేనంతగా మార్పులు చేసేస్తున్నారు. మన దినచర్యలో వాట్సాప్(WhatsApp) ఎంత మమేకమైపోయిందో అందరికీ తెలుసు. ఈ మెసేజింగ్ యాప్‌నకు నకలు సృష్టించి కొంతమంది వినియోగదారులపై వదిలేస్తున్నారు. అవి డౌన్‌లోడ్ చేసి వాడితే మాత్రం ప్రమాదం కొనితెచ్చుకున్నట్లేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ నకిలీ వాట్సాప్‌ల కథేంటి, డౌన్‌లోడ్ చేస్తే ఎందుకు ప్రమాదమో ఒకసారి తెలుసుకోండి
డెల్టా వాట్సాప్- జీబీ వాట్సాప్
వాట్సాప్‌కు ఉన్న నకిలీ సాఫ్ట్‌వేర్ యాప్సే (Duplicate Apps) డెల్టా వాట్సాప్ (Delta WhatsApp) లేదా జీబీ వాట్సాప్ (GBWhatsApp). ఒరిజినల్ వాట్సాప్‌కు ఏమాత్రం తీసిపోవు. అంతకుమించిన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటాయి. ఇవేవీ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో లభించవు. అనధికారికంగా కొన్ని కొన్ని వెబ్‌సైట్స్‌లో ఏపీకే ఫైల్స్‌లో దొరుకుతాయి. లేదంటే థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్‌లో ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్ కూడా వాటికి అనుకూలంగా ఈ యాప్స్‌కు మంచి రేటింగ్స్, ఎక్కువగా డౌన్‌లోడ్స్ చూపించి వినియోగదారులను మోసం చేస్తుంటాయి. డెల్టా ల్యాబ్స్ స్టూడియో ఇటువంటి యాప్స్‌ను డెవలప్ చేసి బయట వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచుతుంది.
అదిరిపోయే ఫీచర్లతో... కానీ
కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్‌లో ఈ జీబీ వాట్సాప్(ఆండ్రాయిడ్ వెర్షన్) ఏపీకే ఫైల్స్ దొరుకుతుంటాయి. ఇప్పటికే వాట్సాప్‌లో లభించే ఫీచర్స్‌తో పాటు అదనంగా కొన్ని కొత్త ఫీచర్స్‌ను జోడించి కస్టమైజ్డ్ లేదా మోడిఫైడ్ యాప్‌గా డెవలప్ చేసి మార్కెట్‌లోకి తీసుకొస్తారు. ఒరిజినల్ వాట్సాప్‌లో లేని ఆటో రిప్లై, 50MB కన్నా ఎక్కువ సైజ్ ఉన్న వీడియో ఫైల్స్‌ను పంపించుకోవటం, కొత్త ఫాంట్స్- థీమ్స్ మార్చుకోవటం, ఒక మెసేజ్‌ను ఎంతమందికైనా ఎక్కువ సార్లు ఫార్వర్డ్ చేసుకునే సదుపాయం, ఆల్ స్టిక్కర్ యాప్స్ వంటి ఫీచర్లు ఈ జీబీ వాట్సాప్ లేదా డెల్టా వాట్సాప్‌లో ఉంటాయి. కానీ ఇలాంటి మోడిఫై చేసిన యాప్స్‌ను (Customized Apps) వాడితే సమస్యలే ఎక్కువని టెక్ వర్గాలు చెబుతున్నాయి
డౌన్‌లోడ్ చేయొద్దు.. ఎందుకంటే?
ఇలాంటి అనధికారిక మోడిఫైడ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసి వాడటం వల్ల యూజర్స్‌కు చాలా నష్టమని టెక్ నిపుణులు చెబుతున్నారు. మనకు తెలియకుండానే మన ఫోన్‌లోని సమాచారాన్ని ఇవి దొంగలిస్తాయట. ఫోన్ నెమ్మదించటమే కాకుండా ఇతర అప్లికేషన్స్ క్రాష్ అవటం వంటివి జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. వాటికి మించి ఇలా ఒరిజినల్ వాట్సాప్‌ను మార్పులు చేసి అనధికారికంగా వాడితే.. ముందు హెచ్చరికగా మీ అకౌంట్‌ను వాట్సాప్ తాత్కాలికంగా బ్యాన్ చేస్తుంది. అప్పటికీ మీరు మోడిఫై చేసిన వాట్సాప్‌ను వాడటం కొనసాగిస్తే.. మీ అకౌంట్‌ను శాశ్వతంగా నిషేధిస్తుంది.
వాట్సాప్ ప్లస్ (WhatsApp Plus), వాట్సాప్ డెల్టా, జీబీ వాట్సాప్‌లను అన్‌సపోర్టెడ్ యాప్స్ జాబితాలో వాట్సాప్ చేర్చింది. ఇటువంటి థర్డ్ పార్టీ మోడిఫై చేసిన యాప్స్‌నకు వాట్సాప్ నుంచి ఎటువంటి సెక్యూరిటీ సపోర్ట్ ఉండదని వాట్సాప్ పేర్కొంది. అలానే మెసేజింగ్‌లో పటిష్ఠమైన భద్రతా ప్రమాణంగా పేర్కొనే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End-End-Encryption) ఫీచర్ ఈ యాప్‌లలో ఉండవని వాట్సాప్ వెల్లడించింది. దీని వల్ల ఈ యాప్‌ల ద్వారా యూజర్ పంపే డేటాకు ఎలాంటి భద్రత ఉండదు. ఈ కారణంగా యూజర్ డేటా చాలా సులువుగా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారికంగా ప్లేస్టోర్‌లో దొరికే వాట్సాప్‌నే వాడాలని సూచిస్తున్నారు.