AP PRC : మీరడిగినంత ఇవ్వలేం..! వేతన సవరణపై సీఎం నిర్ణయమే ఫైనల్‌

 


మీరడిగినంత ఇవ్వలేం..!

ఉద్యోగులు అడిగినంత ఇవ్వడం అసాధ్యం

ఐఆర్‌ కంటే కొంచెం ఎక్కువ లాభమే

కొవిడ్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది

ఉద్యోగులు అడిగినంత ఇవ్వడం అసాధ్యం

ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పష్టీకరణ

14.29 శాతం ఫిట్‌మెంట్‌తో మధ్యంతర భృతి కంటే ఎక్కువగానే లాభం ఉంటుంది.  కొవిడ్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ఉద్యోగులు అడిగినంత వేతన సవరణ చేయడం అసాధ్యం. సీఎస్‌ కమిటీ ప్రతిపాదనలతో ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం వాటిల్లదు.

- సలహాదారు సజ్జల

అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల వేతన సవరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిదే తుది నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు కోరుతున్నట్లుగా 45 శాతం ఫిట్‌మెంట్‌ సాధ్యం కాదన్నారు. సీఎస్‌ కమిటీ సిఫారసు చేసిన 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అమలు వల్ల వారికి ఏ మాత్రం నష్టం ఉండదని తెలిపారు. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తున్నామని.. 14.29 శాతం ఫిట్‌మెంట్‌తో మధ్యంతర భృతి కంటే ఒక్క రూపాయి కూడా తగ్గదని.. ఐఆర్‌ కంటే కొంత ఎక్కువగానే లాభం ఉంటుందని వివరణ ఇచ్చారు. సీఎస్‌ కమిటీ సిఫారసులపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన మంగళవారమిక్కడ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో చర్చలు జరిపారు. 

సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ చైర్మన్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, జేఏసీల్లోని పలు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రితోనూ చర్చించే అవకాశం ఉందన్నారు. ఆలోపు వారి సమస్యలు తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తాను చర్చలు జరుపుతున్నానని వెల్లడించారు. ఉద్యోగులు ఎంతమేర వేతన సవరణ ఆశిస్తున్నారో వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని తెలిపారు. పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం రివర్స్‌ కాలేదన్నారు. 

‘ఉద్యోగులు కోరుతున్నట్లుగా 45 శాతం వేతన సవరణ అమలు సాధ్యం కాదు. కొవిడ్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో వారు అడిగినంత వేతన సవరణ చేయడం అసాధ్యం. అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేలా సీఎస్‌ కమిటీ ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలతో ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం వాటిల్లదు. ఉద్యోగులకు సీఎం జగన్‌ తప్పకుండా న్యాయం చేస్తారు. వీలైనంత ఎక్కువ ఫిట్‌మెంట్‌ను ఇచ్చేలా సీఎం ఆలోచన చేయొచ్చు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌పై ఆయన తీసుకునే నిర్ణయమే ఫైనల్‌’ అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం పీఆర్‌సీ అమలయ్యేసరికి ఏడెనిమిదేళ్లు పడుతోందని.. అదే కేంద్రంతో పాటైతే పదేళ్లకోసారి ఆటోమేటిగ్గా వేతన సవరణ అమలవుతుందని అన్నారు. 

కేంద్ర వేతన సవరణ సంఘం (సీఆర్‌సీ) సిఫారసుల అమలు.. ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులపై ఒత్తిడి తగ్గిస్తుందని అభిప్రాయపడ్డారు. సీపీఎస్‌ రద్దుపై సీఎం స్వయంగా హామీ ఇచ్చారని, ఆ హామీని తప్పక అమలు చేస్తారని వెల్లడించారు. ‘సీపీఎ్‌సపై కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి.. సీఎం తప్పక పరిష్కరిస్తారు. ఈ విషయంలో టెక్నికల్‌ ఇష్యూస్‌ తెలియకుండా హామీ ఇచ్చారు. ఇప్పుడు పరిశీలిస్తే అది రాష్ట్ర బడ్జెట్‌ను దాటేస్తోంది. సీపీఎస్‌ నుంచి బయటకు వస్తే వారికి పెన్షన్‌ భద్రత ఎలాగని ఆలోచిస్తున్నాం. ఫైనాన్స్‌కు సంబంఽధంలేని 71 డిమాండ్లను అధికారులు తేల్చేస్తారు’ అని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు వల్లే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యం కావడం లేదన్నారు. వారికి చట్టపరిధిలో న్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని.. వారికి మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. 

అనంతరం సజ్జల తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. వేతన సవరణపై ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. బుధవారం నాడు సంఘాల నేతలతో ముఖ్యమంత్రి కూడా చర్చలు జరిపే వీలున్నందున.. వారి అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఫిట్‌మెంట్‌ 14.29 శాతం నుంచి 27 శాతం మధ్య ఉండేలా ఒక నిర్ణయాన్ని వెల్లడించాలని ఉద్యోగ సంఘాలను కోరానని.. అయితే వారు 45 శాతం కావాలని కోరారని ముఖ్యమంత్రికి తెలియజేశారు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad