AP కి మరో పిడుగులాంటి వార్త ... బంగాళాఖాతంలో మరో వాయుగుండం.
చెన్నై: బంగాళాఖాతంలో ‘జవాద్’ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్న తరుణంలో వచ్చేవారం మరో అల్పపీడనం వాయుగుండంగా మారనున్నదని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం సాయంత్రం ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. శనివారం ఉదయం ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
చూడండి : తుఫాన్ గమనం లైవ్ చూడండి ఇక్కడ
ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయన్నారు. శనివారం కన్నియా కుమారి, తిరునల్వేలి, సేలం, ఈరోడ్, నామక్కల్, తిరుప్పూరు జిల్లాల్లో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నెల ఆరు, ఏడు తేదీలలో రాష్ట్రంలో పలుచోట్ల చెదురుముదురగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులలో బంగాళాఖాతంలో ఈ నెల రెండోవారం అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఆ వాయుగుండం ఏ దిశగా కదులుతుందన్న విషయంపై వాతావరణ పరిశోధన నిపుణులు పరిశీలన జరుపనున్నారని తెలిపారు. రాజధాని చెన్నై నగరానికి సంబంధించి ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రిపూట చిరుజల్లులు పడే అవకాశం ఉందని వివరించారు.