ఉక్కు పిడికిలి బిగించిన ప్రభుత్వ ఉద్యోగులు... ఉద్యమం ఉధృతం.
నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన
స్వచ్ఛందంగా హాజరైన అన్ని శాఖల సిబ్బంది
సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్
సంఘీభావంగా ఉద్యోగ సంఘాల అగ్రనాయకత్వం
ఒకరి వెంట ఒకరు.. పదులై.. వందలై ముందుకు కదులుతున్నారు. పిడికిలి బిగించి నినదిస్తున్నారు. వైద్య, పంచాయతీరాజ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇరిగేషన్, ట్రెజరీ శాఖలకు చెందిన ఉద్యోగులు ప్రత్యక్ష ఆందోళన బాట పట్టారు. సంఘీభావంగా అగ్రనేతలు కదిలివచ్చారు. జిల్లావ్యాప్తంగా బుధవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనలు కొనసాగించారు. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి, ఏపీ డీఎంఈ కార్యాలయం, ప్రభుత్వ ఐటీఐ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రాంగణాల్లో ఆందోళనలు జరిగాయి. ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ ఐక్యవేదిక అగ్రనేతలూ కలిసి రావడంతో ఉద్యమం మహోగ్రమైంది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ‘ఆంధ్రజ్యోతి’కి తమ ఆవేదనను వెలిబుచ్చారు.
ఏడాదిగా అడుగుతూనే ఉన్నాం
ఉద్యోగుల సమస్యలు డీఏలతో మొదలయ్యాయి. పీఆర్‌సీ వరకూ చేరాయి. ఆఖరుకు జీతాలు అందుకునే విషయంలో కూడా సమస్యలు వచ్చేశాయి. ఏడాదిగా సమస్యలను ఏకరువు పెడుతున్నా.. కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. పీఆర్‌సీ నివేదిక ప్రకటించలేదు. అన్ని సమస్యల పరిష్కారానికే ఈ ఉద్యమంలోకి దిగాం. ఆ సంఘం నుంచి బహిష్కరించిన రవికుమార్ అనే వ్యక్తి ఉద్యమంలో పాల్గొనటం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. మా ఉద్యమంలోకి సెక్రటేరియట్ ఉద్యోగులు ఇంకా రాలేదు. వెంకటరామిరెడ్డి గుప్పెట పట్టాలని చూస్తున్నాడు. ఎవరైనా చివరకు మా ఉద్యమంలోకి రావాల్సిందే.
- వీవీ మురళీకృష్ణనాయుడు, ఏపీ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
Read: PRC 2020 (PRC 2018) New Basic Pay Calculator
ఇదేనా న్యాయం?
కరోనా వంటి కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. ప్రభుత్వానికి ఎక్కడా చెడ్డ పేరు తేలేదు. మా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావటానికి కృషి చేశాం. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తున్న గుర్తింపు ఏంటి? పీఆర్‌సీ ప్రకటన కోసం ఉద్యోగులు కళ్లు కాయలు చేసుకుని చూస్తున్నారు.
- వి.నిర్మలకుమారి, ఏపీ ఎన్జీవో మహిళా అధ్యక్షురాలు
PRC 2018 : 34 % ఫిట్మెంట్ తో మీ బేసిక్ ఎంత అనేది ఇక్కడ తెలుసుకోండి
ఉద్యోగినులను ఏడిపించొద్దు
అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పారు. అలా జరగలేదు. ఉద్యోగుల జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. పీఆర్‌సీ, డీఏలు ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు. ఎన్నో ఇబ్బందుల మధ్య ఉద్యోగాలు చేస్తున్నాం. ఆడవారిని ఏడిపించటం ఎవరికీ మంచిది కాదు. మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
- సీహెచ్ ఎస్తేరురాణి, హెడ్ నర్స్
రోడ్డు మీదకు మీరే తెచ్చారు
ఎన్నో ఆర్థిక సాయాలు చేస్తున్నారు. కానీ, మేము ఆర్థిక సాయం అడగట్లేదు. చట్టబద్ధంగా మాకు కల్పించాల్సిన పీఆర్‌సీతో పాటు పెండింగ్ డీఏలు ఇవ్వమని కోరుతున్నాం. ప్రభుత్వం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేమేదో రోడ్డెక్కాలి అని అనుకోవట్లేదు. ఈ పరిస్థితికి కారణం మీరే. దీనికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి.
- బేబీ, వైద్య ఉద్యోగిని
ఉద్యమాన్ని చూసైనా స్పందించాలి
ఉద్యోగుల శక్తిని చూస్తున్నారా? ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించ లేదంటే అది ఎవరి తప్పు? ఆర్థికేతర సమస్యలను పరిష్కరించటానికి వచ్చిన సమస్య ఏంటి? ఉద్యమ స్పందన చూసైనా ప్రభుత్వం దిగి రావాలి. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి.
- కె.శివలీల, హెడ్ నర్స్, ప్రభుత్వ డెంటల్ కళాశాల