Container Homes: ఇళ్ల నిర్మాణంలో కొత్త ట్రెండ్..ఖర్చు తక్కువ... సమయం తక్కువ.. సౌకర్యాలు ఎక్కువ
కోవిడ్ సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగ అనేక అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వర్క్ కల్చర్‌లో వర్క్ ఫ్రం హోం వచ్చి చేరింది. ఆన్‌లైన్ క్లాసులు కామన్‌గా మారాయి. అదే తరహాలో కంటైనర్ హోమ్స్‌కి డిమాండ్ పెరుగుతుంది
సొంతింటి కల
ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా సొంతిళ్లు కలిగి ఉండాలనేది చాలా మంది కోరిక. అయితే కోవిడ్ సంక్షోభం తర్వాత మారిన పరస్థితిల్లో ఇంటి నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరిగింది. స్టీలు, సిమెంటు మొదలు అన్ని రకాలైన బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ పెరిగింది. ఇదే సమయంలో ఆదాయం, రాబడులు తగ్గిపోయాయి. దీంతో తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం ఎలా అంశంపై చాలా మంది దృష్టి సారించారు.
రిఫ్రెష్‌మెంట్ కోసం
ఇక వర్క్ ఫ్రం హోం కల్చర్‌తో చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఇతర హై ఎండ్ వైట్ కాలర్ జాబ్ ఉద్యోగులు బోర్‌డమ్ ఫీలవుతున్నారు. బయటి ప్రదేశాలకు వెళ్దామంటే కరోనా వేరియంట్లు, కోవిడ్ నిబంధనలు ఎప్పటికప్పుడు బంధనాలు వేస్తున్నాయి. దీంతో సొంతిరిలో సౌకర్యాల లేమి ఇబ్బందిగా మారింది. దీంతో అతి తక్కువ ఖర్చుతో సొంతూరు, లేదా తమ వ్యవసాయ క్షేత్రంలో ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారి సంఖ్య పెరిగింది.
కంటైనర్ హోమ్స్
ఇలా తక్కువ ధరలో చక్కనైన ఇళ్లు కావాలనుకునే వారికి కంటైనర్ ఇళ్లలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. గతంలో భారీ ప్రాజెక్టులు చేపట్టే దగ్గర అక్కడ పని చేసే సిబ్బంది, కార్మికులు ఉండేందుకు వీలుగా కంటైనర్ ఆఫీసులు, ఇళ్లులు నిర్మించడం జరిగేది. కానీ ఇప్పుడు వ్యక్తిగత ఇల్ల నిర్మాణంలో సైతం కంటైనర్ హోమ్స్ దూసుకొస్తున్నాయి.
ఖర్చు తక్కువ
ప్రస్తుత పరిస్థితుల్లో రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే కనీసం ఐదు లక్షల రూపాయలు కూడా సరిపోవడం లేదు. అదే కంటైనర్ హోమ్ అయితే ఐదు లక్షల రేంజ్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇంటినే సకల సౌకర్యాలతో నిర్మించుకునే వీలుంది. పైగా ఆర్డర్ చేసిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. పైగా హాల్, కిచెన్, బెడ్‌రూమ్ ఇలా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. దీంతో తక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చే కంటైనర్ ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని రియల్టీ వర్గాలు అంటున్నాయి.
డిమాండ్
నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఢిల్లీ)తో పాటు ముంబై, మహారాష్ట్ర, కర్నాటక, హైదరాబాద్‌లలో కంటైనర్ హోమ్స్‌కి డిమాండ్ పెరిగిందని ఎకానామిక్‌టైమ్స్ కథనం ప్రచురించింది. గతంలో తమ కంపెనీకి నెలకు ఒకటి లేదా రెండు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్డర్లు వచ్చేవని కోవిడ్ తర్వాత ఈ సంఖ్య ఐదు నుంచి ఆరుకు చేరుకుందని తెలిపారు.