Covid New Guidelines: పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

 Covid New Guidelines: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

Covid 19 New Guidelines: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కొత్త వేరియంట్‌ వేళ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు, ఒమిక్రాన్‌ భయంతో రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు.

చదవండి : ఒమిక్రాన్ మూలాల్లో హెచ్‌ఐవీ.. సంచ‌ల‌న విష‌యాలు

దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని ఆయన సూచించారు. ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలన్నారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత 20 రోజుల నుంచి దేశంలో ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అవసరమైతే రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ విధించాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు ఇదివరకే లేఖ రాసింది. వార్‌రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచిస్తోంది కేంద్రం.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు..

* పండగల వేళ ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేలా రాత్రి కర్ఫ్యూలను అమలు చేయాలి.

* భారీ బహిరంగ సభలు, సమావేశాలు, సామూహిక కలయికలు, సమూహాలను నియంత్రించాలి.

* పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించాలి.

* కరోనా బాధితుల నమూనాలకు ఆలస్యం చేయకుండా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి.

* అన్ని జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

* పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న జిల్లాలపై అధికారులు ప్రత్యే దృష్టిపెట్టాలి.

* ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సామర్థ్యం పెంచాలి.

* అన్ని ప్రాంతాల్లో అంబులెన్స్‌, ఇతర వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలి.

* రాష్ట్రంలో వైరస్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి.

* మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలి.

* వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలి.

* ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి.

* రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాస్ట్రాలు.. 100 శాతం టీకా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.

ఇదిలావుంటే, కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభించడంతో కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం విధించింది డీడీఎంఏ. బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించారు ఢిల్లీ అధికారులు. షాపింగ్‌కు వచ్చేవాళ్లు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, లేదంటే దుకాణాల్లోకి అనుమతించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. అటు కర్ణాటకలో కూడా ఇప్పటికే క్రిస్మన్‌, న్యూఇయర్‌ వేడుకలపై నిషేధం విధించారు అధికారులు. ఒమిక్రాన్‌ అలజడి కారణంగా పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకొని ఉద్యోగుల జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించింది. హర్యానాలోనూ ఆంక్షలు విధించారు అక్కడి అధికారులు. టీకా తీసుకోనివాళ్లను బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా నిషేధం విధించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad