Omicron: స్కూళ్లు, సినిమా హాళ్లు మళ్లీ మూత!
న్యూఢిల్లీ: కోవిడ్ పాజిటివ్ కేసులు లెక్కకు మించి పెరుగుతున్న కారణంగా దేశ రాజధానిలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధారిటీ మంగళవారం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. గడచిన ఆరునెలల్లో (జూన్ 9 నుంచి) నమోదైన కేసుల కంటే కేవలం ఒక్క రోజులోనే 331 కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వరుసగా రెండు రోజుల పాటు పాజిటివిటీ రేటు 0.5% కంటే ఎక్కువ నమోదైతే లేదా ఏడు రోజుల వ్యవధిలో వరుసగా పాజిటివ్ కేసులు 1,500 దాటితే ‘ఎల్లో అలర్ట్' విధించే అవకాశం ఉందని తెల్పింది. ‘ఎల్లో అలర్ట్' దృష్ట్యా రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
తాజా ఆంక్షలివే..
తాజా మార్గదర్శకాల మేరకు అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, వ్యాయామ శాలలు మూతపడనున్నాయి. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 10 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు యథాతథంగా కొనసాగుతాయి. షాపింగ్ మాల్స్ సరి - బేసి ప్రాతిపదికన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నాయి. స్పా, సెలూన్, బార్బర్ షాప్‌లు మామూలుగానే తెరచుకోవచ్చు. మెట్రో, పబ్లిక్ బస్సులు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో (ప్రయాణికులు నిలబడకూడదు) పనిచేస్తాయి. తదుపరి మార్గదర్శకాలు విడుదలయ్యేంతవరకు అన్ని పొలిటికల్, సామాజిక, మత పరమైన సమావేశాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది.